సూచీలు శిఖర స్థాయిల్లో.. ఫండ్స్‌లో మార్పులు చేయాలా? | Make changes in funds | Sakshi
Sakshi News home page

సూచీలు శిఖర స్థాయిల్లో.. ఫండ్స్‌లో మార్పులు చేయాలా?

Published Mon, Jul 31 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

సూచీలు శిఖర స్థాయిల్లో.. ఫండ్స్‌లో మార్పులు చేయాలా?

సూచీలు శిఖర స్థాయిల్లో.. ఫండ్స్‌లో మార్పులు చేయాలా?

మ్యాక్స్‌ లైఫ్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అడ్వాంటేజ్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటూ బీమా ఏజెంట్‌ ఒకతను సూచిస్తున్నాడు. ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున పన్నేండేళ్ల పాటు చెల్లించాలని,  పదేళ్ల పాటు ప్రీమియమ్‌ చెల్లించిన తర్వాత రూ.22 లక్షలు ఏక మొత్తంగా లభిస్తుందని, పదమూడో సంవత్సరం నుంచి నెలకు రూ.23 వేల చొప్పున పదేళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందవచ్చని ఆ ఏజెంట్‌ చెబుతున్నాడు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?
– సుందర్, హైదరాబాద్‌

మ్యాక్స్‌ లైఫ్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అడ్వాంటేజ్‌ ప్లాన్‌ అనేది సాంప్రదాయ మనీ బ్యాక్‌ పాలసీ లాంటిది. మనీ బ్యాక్‌ పాలసీలు దాదాపు ఎండోమెంట్‌ బీమా ప్లాన్‌లాగానే ఉంటాయి. పాలసీ కాలంలో ఇవి పాక్షిక సర్వైవల్‌ బెనిఫిట్స్‌ను మాత్రమే ఇస్తాయి. ఈ తరహా పాలసీలు ఖరీదైనవి. ఇవి తగినంత బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. మంచి రాబడులను కూడా ఇవ్వలేవు. ఇక ఈ ప్లాన్‌ గురించి ఆ ఏజెంట్‌ మీకు చెప్పిన వివరాలు సరైనవి కావు. మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే, పాలసీ తీసుకున్న పదేళ్ల తర్వాత మీకు కొంత సొమ్ము తిరిగి వస్తుంది. ప్రీమియమ్‌ చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే మీకు ప్రతినెలా గ్యారంటీగా కొంత మొత్తం పదేళ్ల పాటు లభిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలకు ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. పాలసీ కాల వ్యవధి పూర్తయిన తర్వాత.. మీరు బీమా చేసిన మొత్తంలో 12వ వంతులో పది శాతం నెల వారీగా లభిస్తుంది. అంటే రూ.10 లక్షల బీమాకు మీకు నెలకు రూ.8,333 లభిస్తుంది. మీ ఏజెంట్‌ ఉదహరించిన రివర్షనరీ, టెర్మినల్‌ బోనస్‌లు గ్యారంటీ కావు. ఇక మీరు చెల్లించే ప్రీమియమ్‌ (ఏడాదికి రూ.2 లక్షలు) చాలా ఎక్కువ.

మీకు క్రమం తప్పని ఆదాయం కావాలంటే, పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్‌ సంబంధిత సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేయండి. మీకు మంచి రాబడులు వస్తాయి. బీమా, మదుపు కలగలపిన సాధనాల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. జీవిత బీమా కోసం ప్యూర్‌ టర్మ్‌ పాలసీని తీసుకోవాలి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయాలి. మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొత్త అయితే ముందుగా, మంచి రేటింగ్‌ఉన్న బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఉండాలి. మీరు ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండి, స్టాక్‌ మార్కెట్‌ పట్ల అవగాహన ఉన్నట్లయితే, ఏదైనా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మీ సిప్‌ను కొనసాగించండి. దీనివల్ల మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ యావరేజ్‌ అయ్యి, మీ రాబడులు పెరుగుతాయి.

నేను గత రెండేళ్లుగా ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను.  ముందు అనుకున్న ప్రకారం, మరో పదేళ్ల పాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ ఈ ఫండ్‌ 20 శాతం వరకూ రాబడులనిచ్చింది. ఈ ఫండ్‌లో కొనసాగమంటారా? ఈ ఫండ్‌ నుంచి వైదొలగి, మరో ఫండ్‌కు మారమంటారా?
– దేవకి, విశాఖ పట్టణం

ఫ్రాంక్లిన్‌ ప్రైమా ఫండ్‌–ఇది పాత మిడ్‌క్యాప్‌ ఫండ్‌. బహుశా భారత్‌లో మొదటి ఓపెన్‌–ఎండెడ్‌ ఫండ్‌ ఇదే కావచ్చు. 1993లో ఈ ఫండ్‌ ప్రారంభమైంది. ఈ ఫండ్‌ పనితీరు బాగానే ఉంది. గత 4–5 ఏళ్ల కాలంలో చాలా మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనే ఇచ్చాయి. ఆ దృష్ట్యా చూస్తే ఈ ఫండ్‌ ఇచ్చిన రాబడులు (ఈ రెండేళ్లలో) తక్కువేనని చెప్పవచ్చు. ఇది ఈక్విటీ ప్రాధాన్యత గల ఫండ్‌. స్పెక్యులేటివ్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయకుండా వాటికి దూరంగా ఉంటోంది. చాలా ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, భారీ మ్యూచువల్‌ ఫండ్‌గా ఎదగలేదు. అయితే ఈ ఫండ్‌ నిర్వహణ పద్ధతులు, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ టైమ్‌ఫ్రేమ్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలాంటి సంశయాలు లేకుండా కొనసాగించవచ్చు.

స్టాక్‌ సూచీలు శిఖర స్థాయిల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈక్విటీ ఫండ్స్‌ విషయంలో ఏమైనా, మార్పులు, చేర్పులు చేయల్సిన అవసరం ఉందా ?
సాకేత్, విజయవాడ

స్టాక్‌ సూచీలు–సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు, మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈక్విటీ ఫండ్స్‌ల్లో మార్పులు, చేర్పులు చేయడం సరైనది కాదు. స్టాక్‌ మార్కెట్‌ బుల్‌రన్‌లో ఉన్నప్పుడు బాగా పెరిగిన షేర్లు, స్టాక్‌ మార్కెట్‌ పతనంలో అంతే స్థాయిల్లో పడిపోతాయని గతంలో పలు మార్లు రుజువైంది. ఇదే సూత్రం మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక ఫండ్‌ 70 శాతానికి పైగా రాబడి ఇచ్చిందనే ఉద్దేశంతో ఆ ఫండ్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటే, స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఈ ఫండ్‌ బాగా పడిపోవచ్చు. అయితే అన్ని ఫండ్స్‌ ఇలానే ఉంటాయని కూడా చెప్పలేము. మంచి ట్రాక్‌ రికార్డ్‌ఉన్న ఈక్విటీ ఫండ్స్‌ బుల్‌ మార్కెట్లో అయినా, బేర్‌ మార్కెట్లో అయినా మంచి రాబడులనే ఇస్తాయి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఈక్విటీ ఫండ్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చినట్లయితే, దానిని మార్చాల్సిన అవసరం  లేదు. మార్కెట్‌ బాగా పెరిగినప్పుడు, ఒక ఫండ్‌  ఏడాది పనితీరును ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement