జీవిత బీమా కూడా పెట్టుబడి సాధనమే!
పనిచేసే మహిళలకు తప్పనిసరి అవసరం
జీవిత బీమా ను ప్రతిఒక్కరూ ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవాలి. ముందుగా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉండటం సహా పలు ఇతర ప్రయోజనాలుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువ. ఈ విషయం మహిళలకు తెలియనిదేమీ కాదు. అయినా వారు జీవిత బీమా పాలసీని వారి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడటం లేదు. ఎందుకో తెలుసా?!!
ఎందుకో తెలుసుకోవాలంటే... అంతకన్నా ముందు మహిళలు జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఊహించని ప్రమాదం జరిగి మరణించడం, వికలాంగులుగా మారటం వంటివి జరిగితే.. కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసమే ఎవరైనా పాలసీకి ప్రాధాన్యమిస్తారు. చాలామంది ఆ బాధ్యత భర్తది అనుకుంటారు కనుక తమకెందుకులే జీవిత బీమా అనుకుంటారు. ఒకవేళ పనిచేసే మహిళ ఒంటరి అనుకోండి. ఆమె తన తల్లిదండ్రుల కోసం, తనపై ఆధారపడ్డ ఇతర కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలి. ఒకవేళ పనిచేసే మహిళకు పిల్లలుంటే... వారి చదువుని దృష్టిలో ఉంచుకొని పాలసీవైపు మొగ్గు చూపాలి. ఇలా పలు రకాల అంశాలు మహిళలు జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తోన్న మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకని దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడకూడదు? చూడాలి. చూడకపోవడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఒక యుక్త వయసు మహిళ ఉన్నారనుకోండి. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే. ఇక ఆమెపై ఆధారపడి జీవించే వారు ఎవ్వరూ లేరు. స్వతంత్రురాలు. అలాంటపుడు ఆమెకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించకపోవచ్చు. చావు గురించి ఆలోచించడం ఇష్టంలేకపోవడం సహా పాలసీ తీసుకోవడం వల్ల తక్షణం లేదా జీవిత కాలం మొత్తంలో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే ఆలోచన వల్ల కూడా చాలా మంది యుక్త వయసు మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం లేదన్నది వాస్తవం. పాలసీ తీసుకోవడానికి ఎక్కువ డబ్బు అవసరమనే అపోహ, పాలసీ గురించి సమగ్రంగా తెలియకపోవడం, ఆరోగ్యంగా ఉన్నామని భావించడం వంటి విషయాలు కూడా మహిళలు పాలసీకి దూరంగా ఉండటానికి కారణాలుగా ఉన్నాయి. ఇక మరికొందరైతే వారి వయసు వారు పాలసీ తీసుకోలేదని వీరు కూడా వాటికి దూరంగా ఉంటున్నారు.
నా సలహా ఏమిటంటే...
ఇలాంటి అపోహలేవీ పెట్టుకోవద్దు. పాలసీ తీసుకోవడానికి మీ సంపాదన సరిపోతుంది. వేచి ఉండకండి. ఇన్వెస్టర్లతో, కుటుంబ స్నేహితులతో, సహోద్యోగులతో మాట్లాడండి. ఎంత వీలైతే అంత త్వరగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి.
సుబ్రత మొహంతి
మార్కెటింగ్ హెడ్, బజాజ్ అలియాంజ్ లైఫ్