ఇవన్నీ చూశాకే జీవిత బీమా..
పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో సామాన్యుల జీవన ప్రమాణాలు గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే యువత పనివేళలు, ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి జీవిత బీమా రక్షణ అనేది తప్పనిసరిగా మారింది. మనపై ఆధారపడి జీవించే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి.
కానీ వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదే అసలు సమస్య. ప్రతీ బీమా పథకంలో ఉండే లాభ నష్టాలను పరిశీలించడం కష్టమే. కానీ పాలసీ తీసుకునేటప్పుడు కనీసం ఈ ఐదు అంశాలను పరిశీలిస్తే ఆ పాలసీకి మన అవసరాలను తీర్చే శక్తి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు ఇవీ..
ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక పథకంతో మరో పథకానికి పోలిక ఉండదు. కాబట్టి తీసుకునే పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలను తీర్చే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడం అత్యంత ప్రధానం. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. బీమా రక్షణ ఎంత కావాలన్న విషయం పరిశీలించేటప్పుడు అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని, అలాగే రుణాలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.
కంపెనీ చరిత్ర...
పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ చరిత్రను పరిశీలించండి. ఆ కంపెనీ ప్రమోటర్లు, వారి చరిత్రతో పాటు, బీమా కంపెనీ పనితీరును కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వివరాలు ఆన్‌లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ బీమా కంపెనీ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏ విధంగా ఉంది, పాలసీదారుల సమస్యలకు ఎలా స్పందిస్తోంది. ఆ కంపెనీ సేవలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా వంటివి చూడండి.
క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి?...
ఒక కంపెనీని ఎంచుకునేటప్పుటు క్లెయిమ్ రేషియో కూడా చాలా ముఖ్యం. వచ్చిన క్లెయిమ్స్‌లో ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటిని తిరస్కరించిందన్నది క్లెయిమ్ రేషియో తెలుపుతుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ పనితీరు బాగుందని లెక్క. మీరు కచ్చితమైన సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఉండదు. ఈ విషయంలో మన నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి.
ఫండ్ పనితీరు కూడా..
ఒక వేళ మీరు యులిప్ పాలసీని తీసుకుంటే కనుక ఆ పథకంలోని ఫండ్స్ పనితీరును కూడా పరిశీలించండి. మీ రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అన్ని బీమా కంపెనీలు ఎన్‌ఏవీలను వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో మంచి పనితీరు కనపరుస్తున్న ఫండ్‌ను మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోండి.
పాలసీని అర్థం చేసుకోండి..
ఒకసారి పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ పథకంలోని ఇతర ఫీచర్స్‌ను పరిశీలించండి. పాలసీ కాలపరిమితి, ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి, మెచ్యూర్టీ తేదీ, మధ్యలో ఏమైనా ఇతర చార్జీలను చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలను అడిగి తెలుసుకోండి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత రెండో ఆలోచన వస్తే కనుక పాలసీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ బీమా కంపెనీ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ను ఇస్తాయి. తీసుకున్న పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా రద్దు చేసుకుంటే మీ ప్రీమియం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు.
- అంజలి మల్హోత్రా
చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవైవా లైఫ్