Standards of living
-
ఇవన్నీ చూశాకే జీవిత బీమా..
పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో సామాన్యుల జీవన ప్రమాణాలు గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే యువత పనివేళలు, ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి జీవిత బీమా రక్షణ అనేది తప్పనిసరిగా మారింది. మనపై ఆధారపడి జీవించే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదే అసలు సమస్య. ప్రతీ బీమా పథకంలో ఉండే లాభ నష్టాలను పరిశీలించడం కష్టమే. కానీ పాలసీ తీసుకునేటప్పుడు కనీసం ఈ ఐదు అంశాలను పరిశీలిస్తే ఆ పాలసీకి మన అవసరాలను తీర్చే శక్తి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు ఇవీ.. ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక పథకంతో మరో పథకానికి పోలిక ఉండదు. కాబట్టి తీసుకునే పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలను తీర్చే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడం అత్యంత ప్రధానం. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. బీమా రక్షణ ఎంత కావాలన్న విషయం పరిశీలించేటప్పుడు అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని, అలాగే రుణాలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. కంపెనీ చరిత్ర... పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ చరిత్రను పరిశీలించండి. ఆ కంపెనీ ప్రమోటర్లు, వారి చరిత్రతో పాటు, బీమా కంపెనీ పనితీరును కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వివరాలు ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ బీమా కంపెనీ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ విధంగా ఉంది, పాలసీదారుల సమస్యలకు ఎలా స్పందిస్తోంది. ఆ కంపెనీ సేవలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా వంటివి చూడండి. క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి?... ఒక కంపెనీని ఎంచుకునేటప్పుటు క్లెయిమ్ రేషియో కూడా చాలా ముఖ్యం. వచ్చిన క్లెయిమ్స్‌లో ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటిని తిరస్కరించిందన్నది క్లెయిమ్ రేషియో తెలుపుతుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ పనితీరు బాగుందని లెక్క. మీరు కచ్చితమైన సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఉండదు. ఈ విషయంలో మన నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఫండ్ పనితీరు కూడా.. ఒక వేళ మీరు యులిప్ పాలసీని తీసుకుంటే కనుక ఆ పథకంలోని ఫండ్స్ పనితీరును కూడా పరిశీలించండి. మీ రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అన్ని బీమా కంపెనీలు ఎన్ఏవీలను వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో మంచి పనితీరు కనపరుస్తున్న ఫండ్‌ను మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోండి. పాలసీని అర్థం చేసుకోండి.. ఒకసారి పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ పథకంలోని ఇతర ఫీచర్స్‌ను పరిశీలించండి. పాలసీ కాలపరిమితి, ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి, మెచ్యూర్టీ తేదీ, మధ్యలో ఏమైనా ఇతర చార్జీలను చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలను అడిగి తెలుసుకోండి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత రెండో ఆలోచన వస్తే కనుక పాలసీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ బీమా కంపెనీ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ను ఇస్తాయి. తీసుకున్న పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా రద్దు చేసుకుంటే మీ ప్రీమియం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. - అంజలి మల్హోత్రా చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవైవా లైఫ్ -
టెక్నాలజీయే పరిష్కార మార్గం
* టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా * పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి * రాష్ట్రాభివృద్ధికి సలహాలిస్తానని హామీ సాక్షి, విజయవాడ బ్యూరో: దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు అధునాతన టెక్నాలజీయే పరిష్కార మార్గాలు చూపుతుందని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరి సరాల పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన అనే క ఇబ్బందులను టెక్నాలజీ ద్వారా అధిగమించవచ్చని ఆయన తెలిపారు. సోమవారం నగరంలోని ఒక హోటల్లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రతన్ టాటా, ఏపీ సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు రతన్‌టాటా సమాధానం చెప్పారు. టాటా ట్రస్ట్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే పలు సామాజిక ప్రాజెక్టుల ఎంఓయూకు తాను మద్దతిస్తానని తెలిపారు. తొలుత సీఎం మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి పరిశ్రమలకు రతన్‌టాటా సింబల్‌గా ఉన్నారని, ఆయన దేశానికి ఒక ఐకాన్ అని ప్రశంసించారు. జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం... రాష్ట్ర ప్రభుత్వంతో టాటా ట్రస్టు చేసుకున్న ఒప్పందం ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని రతన్‌టాటా అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియపాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్రామన్లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేను: రతన్ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని సీఎం చేసిన విజ్ఞప్తిని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా తిరస్కరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేర కు క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్రాని కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని బాబు టాటాను కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు. వ్యాపారాభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇస్తానని చెప్పారు. పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ పలువురు ఏపీలో టీసీఎస్ కంపెనీని ఏర్పాటు చేయాలని కోరగా ఇప్పుడు టాటా గ్రూపునకు తాను చైర్మన్‌ను కాదని, ఈ ప్రతిపాదనను గ్రూపునకు సూచిస్తానని చెప్పారు. -
చట్టాల గురించి తెలుసుకోండి
పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచన బెంగళూరు(బనశంకరి):చట్టాల గురించి తెలుసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచించా రు. బీబీఎంపీ కార్యాలయంలో పౌర కార్మికులకు శని వారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే వాటిపై సంపూర్ణంగా అవగాహన ఉండాలని, ఇది చట్టాల గురించి తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. పౌరకార్మికులకు సకాలంలో వేతనాలను కాంట్రాక్టర్లు అందించడం లేదని అన్నారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరకార్మికుల వేతనాలనున సకాలంలో అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేయడానికి యంత్రాలు వచ్చినా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సఫాయి కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని, ఫలితంగా వారు రోగాల బారిన పడుతుండడంతో వారి కుటుంబంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోందని ఆందోళన వ్యక్తతం చేశారు. ఈ దయనీయ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని అన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.