(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : ప్రతి కుటుంబానికీ జీవిత బీమా అంటే రక్షణ కవచం లాంటిదే. మరి ఆ కవచం తుప్పుపట్టకుండా ఉండాలంటే... పాలసీ తీసుకున్న వారు సకాలంలో ప్రీమియం చెల్లిస్తూ దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. ప్రీమియం చెల్లించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. ఒకవేళ మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఏదైనా కారణంతోఆపేద్దామనుకుంటే..!! అలా చేయటం చాలా ఈజీయే కానీ... అది మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయటమేననుకోవాలి.
సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే ఏ పాలసీ అయినా ల్యాప్స్ అయిపోతుంది. దీంతో ఏదైనా జరిగితే వ్యక్తి కుటుంబానికి పరిహారం అందకుండా పోతుంది. అందుకే... పాలసీ ల్యాప్స్ అయిందని వదిలేయకుండా ఓ సారి దాన్ని పరిశీలించి, అవకాశం ఉంటే పునరుద్ధరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ల్యాప్స్ అయితే ఏంటి పరిష్కారం
టర్మ్ పాలసీ తీసుకుంటే జీవితాంతం నిర్ణీత ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే అది యాక్టివ్‌గా (చెల్లుబాటు) ఉంటుంది. ఏవో కొన్ని కారణాల రీత్యా గడువులోపు ప్రీమియం చెల్లించలేదనుకోండి. అప్పుడు అదనపు గడువు (గ్రేస్ పీరియడ్) ఉంటుంది. ఆ లోగా కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అంటే మురిగిపోతుంది. ఇన్సూరెన్స్ పరిభాషలో నుంచి చూస్తే ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో అన్ని రకాల ప్రయోజనాలూ ముగిసిపోయినట్టే.
దాదాపు అన్ని బీమా కంపెనీలూ వార్షిక ప్రీమియానికైతే 30 రోజులు, అర్ధ సంవత్సరం, నెలవారీ ప్రీమియంలపై 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి. అంటే ఈ లోపైనా ప్రీమియం చెల్లించి పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవచ్చు. ఇక కంపెనీలను బట్టి గ్రేస్ పీరియడ్‌లో మార్పులుండొచ్చు. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, నియమ, నిబంధనలు చూడాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రేస్ పీరియడ్‌లోనూ బీమా రక్షణ కొనసాగుతుంది.
అంటే గ్రేస్ పీరియడ్‌లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థపై ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి గడువులోపు టర్మ్ పాలసీ ప్రీమియం చెల్లించకుండా, గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు ప్రమాదం కారణంగా మరణించాడనుకుంటే... ఈ సందర్భంలో బాధితుని కుటుంబం పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేస్తే బీమా కంపెనీ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రేస్ పీరియడ్ ముగిశాక ప్రమాదం జరిగి మరణం చోటు చేసుకుంటే పరిహారం చెల్లింపు బాధ్యత కంపెనీపై ఉండదు.
గ్రేస్ పీరియడ్ తర్వాత...?
గ్రేస్ పీరియడ్ లోపు కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అపుడు పాలసీదారుడికి ఏం జరిగినా అతనిపై ఆధారపడిన వారికి కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు. ఒకవేళ పాలసీని పునరుద్ధరించుకోవాలని భావిస్తే అందుకు వీలుంటుంది. ఒకవేళ బీమా సంస్థ పాలసీ పునరుద్ధరణకు అంగీకరిస్తే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పాలసీ పునరుద్ధరణ విషయంలో నిబంధనలన్నవి కంపెనీని బట్టి మారొచ్చు. సాధారణంగా టర్మ్ పాలసీలు ల్యాప్స్ అయితే, బకాయి ఉన్న ప్రీమియంను వడ్డీతో కలిపి చెల్లించడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే తమ ఆరోగ్య స్థితి బాగానే ఉందని ధ్రువీకరణ ఇవ్వడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు. అయితే, బీమా సంస్థ అంగీకరిస్తేనే పాలసీ పునరుద్ధరణ సాధ్యం. ఇందుకు నిర్ణీత ప్రక్రియ ఉంటుంది.
కీలకాంశాలివీ...
అన్ని కంపెనీలు సకాలంలో ప్రీమియం చెల్లించాలంటూ ముందు నుంచే ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేస్తుంటాయి. ప్రీమియం చెల్లించేందుకు ఎన్నో ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను పరిశీలించి... పాలసీదారుడు తన బ్యాంకుకు స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే సకాలంలో (నిర్ణీత తేదీన) బ్యాంకు నుంచి ప్రీమియం బీమా కంపెనీకి వెళ్లిపోతుంది.
ఇందుకోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. దీంతో పాలసీదారులు ప్రీమియంను బ్యాంకు ద్వారా చెల్లించొచ్చు. బీమా సంస్థ ఆఫీసుకు వెళ్లి చెల్లించొచ్చు. లేదా తన దగ్గరకే వచ్చి రెన్యువల్‌కు సంబంధించిన చెక్ తీసుకెళ్లాలని కోరొచ్చు. కొన్ని బ్యాంకులు ఏటీఎం నుంచే ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇపుడు ఆన్‌లైన్ చెల్లింపులూ అందుబాటులోకి వచ్చాయి.
చివరిగా చెప్పేదేమంటే బీమా పాలసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ కాకుండా చూసుకోవడమే మంచిది. పాలసీ కాల వ్యవధి ముగిసేదాకా ఏటా ప్రీమియం చెల్లించడం ద్వారా మీ కుటుంబానికి రక్షణ కల్పించడాన్ని మర్చిపోవద్దు. అలాగే, ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద పాలసీకి చెల్లించే ప్రీమియానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. పాలసీ ల్యాప్స్ అయితే ఈ ప్రయోజనం కోల్పోతారు. టర్మ్ పాలసీ అన్నది మీ కోసం కాదు. మీ కుటుంబం కోసం. ఆత్మీయుల సంరక్షణ దృష్ట్యా పాలసీ తీసుకుని దాన్ని మనుగడలో ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment