ఆరోగ్య బీమాలో పోటీ అధికం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా కంటే జీవిత బీమా మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నట్లు ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను 24 సాధారణ బీమా కంపెనీలకు తోడు, నాలుగు ప్రత్యేక వైద్య బీమా కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు పోటీ పడి అందిస్తుండటంతో ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) యతీశ్ శ్రీవాత్సవ తెలిపారు. తమ ఖాతాదారుల కోసం వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా స్థిరమైన మొత్తాన్ని అందించే వైద్య బీమా పథకాన్ని అందిస్తున్నామని, కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు.
జీవిత బీమాలో ప్రవేశపెట్టనున్న నాలుగు కొత్త పథకాలకు ఐఆర్‌డీఏ అనుమతి లభించిందని వాటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు ఎనిమిది పాత పథకాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో గ్యారంటీ రాబడి కలిగిన తొలి ఆన్‌లైన్ పథకం ‘ఐగ్యారంటీ’ని శ్రీవాత్సవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ బీమా పాలసీల విక్రయంలో ఏటా 40 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నామని, వచ్చే రెండేళ్లు ఇదే స్థాయిలో వృద్ధిని కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం ప్రీమియంలో 30 శాతం ఆన్‌లైన్ పథకాల నుంచే వస్తోందన్నారు. ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 నుంచి 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగాన్ రెలిగేర్ రూ.400 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసింది.
ఐ-గ్యారంటీ గురించి
ఆరు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే మరో ఆరు సంవత్సరాలు కట్టిన ప్రీమియానికి 135 శాతం గ్యారంటీ రాబడిని అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సగటు రాబడి చూస్తే 5.2 శాతం వస్తుందని, దీనికి పన్ను ప్రయోజనాలు అదనమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన రాబడి కోరుకునే వారికోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. 12 ఏళ్ళ వారి నుంచి గరిష్టంగా 50 ఏళ్ళ వారి వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస ప్రీమియం రూ. 48,000, గరిష్ట ప్రీమియం రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. వార్షిక ప్రీమియానికి పదిరెట్లు బీమా రక్షణ లభిస్తుంది.