Aegon Religare
-
ఇకపై అధిక రాబడికి చాన్స్
‘సాక్షి’తో ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్ తాజా నిబంధనలతో పాలసీదారులకు లాభం ఏటా ఏజెంట్ల సంఖ్యను 30% పెంచుతాం కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరుగుతాయ్ పెరుగుతున్న ఆన్లైన్ పాలసీల విక్రయాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీవిత బీమా మార్గదర్శకాల వలన కంపెనీల నిర్వహణా వ్యయం తగ్గి, పాలసీదారుల రాబడి పెరుగుతుందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ తెలిపింది. కొత్త పథకాలు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటమే కాకుండా గతంతో పోలిస్తే అధిక ప్రయోజనాలను కల్పిస్తుండటంతో వీటిపై పాలసీదారులకు ఆసక్తి పెరుగుతుందని, దీంతో కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరగడం ద్వారా ఏజెంట్లు ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటారని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్ అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త ఏజెంట్ల నియామకంలో బీమా కంపెనీలు ఒత్తిడికి గురవుతన్న విషయం వాస్తవమే అయినప్పటికీ మేము ముఖ్యంగా గృహిణులు, పదవీ విరమణ చేసిన వారిపై ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 6,000 మంది ఏజెంట్లు ఉన్నప్పటికీ అందులో 1,200 మంది చురుగ్గా పనిచేస్తున్నారని, ఏటా ఏజెంట్ల సంఖ్యను 30 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజల్లో బీమాపై అవగాహన పెరుగుతండటంతో ఆన్లైన్ ద్వారా బీమా పథకాల విక్రయం ఎక్కువతోందని, ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో 25 శాతం అన్లైన్ ద్వారా జరుగుతుంటే, 36 శాతం ఏజెంట్ల ద్వారా వస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఆన్లైన్ పాలసీల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్త నిబంధనల వలన పాలసీల సంఖ్య తగ్గదని, బీమా కంపెనీలు వాటి వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడతాయన్నారు. ప్రస్తుతం ఎగాన్ రెలిగేర్ మూడు రకాల పథకాలను అందిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆరోగ్య బీమాలో పోటీ అధికం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా కంటే జీవిత బీమా మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నట్లు ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను 24 సాధారణ బీమా కంపెనీలకు తోడు, నాలుగు ప్రత్యేక వైద్య బీమా కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు పోటీ పడి అందిస్తుండటంతో ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) యతీశ్ శ్రీవాత్సవ తెలిపారు. తమ ఖాతాదారుల కోసం వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా స్థిరమైన మొత్తాన్ని అందించే వైద్య బీమా పథకాన్ని అందిస్తున్నామని, కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. జీవిత బీమాలో ప్రవేశపెట్టనున్న నాలుగు కొత్త పథకాలకు ఐఆర్డీఏ అనుమతి లభించిందని వాటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు ఎనిమిది పాత పథకాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో గ్యారంటీ రాబడి కలిగిన తొలి ఆన్లైన్ పథకం ‘ఐగ్యారంటీ’ని శ్రీవాత్సవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ బీమా పాలసీల విక్రయంలో ఏటా 40 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నామని, వచ్చే రెండేళ్లు ఇదే స్థాయిలో వృద్ధిని కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం ప్రీమియంలో 30 శాతం ఆన్లైన్ పథకాల నుంచే వస్తోందన్నారు. ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 నుంచి 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగాన్ రెలిగేర్ రూ.400 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసింది. ఐ-గ్యారంటీ గురించి ఆరు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే మరో ఆరు సంవత్సరాలు కట్టిన ప్రీమియానికి 135 శాతం గ్యారంటీ రాబడిని అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సగటు రాబడి చూస్తే 5.2 శాతం వస్తుందని, దీనికి పన్ను ప్రయోజనాలు అదనమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన రాబడి కోరుకునే వారికోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. 12 ఏళ్ళ వారి నుంచి గరిష్టంగా 50 ఏళ్ళ వారి వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస ప్రీమియం రూ. 48,000, గరిష్ట ప్రీమియం రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. వార్షిక ప్రీమియానికి పదిరెట్లు బీమా రక్షణ లభిస్తుంది.