సీఐ బెనిఫిట్ ఉండాల్సిందే..
జీవిత బీమా గురించి, ఆరోగ్య బీమా గురించి చాలామందికి అవగాహన ఉంది. తీవ్ర అస్వస్థత (క్రిటికల్ ఇల్‌నెస్-సీఐ)కు కూడా బీమా ఉంది. క్రిటికల్ ఇల్‌నెస్ జాబితాలో ఉన్న అనారోగ్యం బారిన పడ్డారని పరీక్షల్లో వెల్లడికాగానే బీమా చేసిన మొత్తం చేతికి అందుతుంది. బీమా చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ చూడడానికి ఖరీదైనదిగా కన్పిస్తుంది గానీ ఇందులో ఉన్న ప్రయోజనాలను గమనిస్తే అదెంత ముఖ్యమైనదో అర్థమవుతుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ జాబితా ఇదీ..
హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కేన్సర్, అవయవ మార్పిడి, పక్షవాతం, అంధత్వం, అచేతనం (డిజెబిలిటీ), ప్రాణాం తక అనారోగ్యం (టెర్మినల్ ఇల్‌నెస్)జీవిత బీమా, ఆరోగ్య బీమా అందించలేని ప్రయోజనాలు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్సులో ఉన్నాయి. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారీమొత్తం అందుతుంది తప్ప అదే వ్యక్తి తీవ్ర అనారోగ్యంపాలై కోలుకున్నపుడు నయా పైసా కూడా రాదు. ఇక ఆరోగ్య బీమాలో చాలా రకాల తీవ్ర అస్వస్థతలను మినహాయిస్తుంటారు. గుండె పోటుకు గురైన వారిలో 95 శాతం మంది కోలుకుంటారు గానీ వారు ఆర్థికంగా కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది. కేన్సర్ బాధితుల పరిస్థితీ ఇంతే. వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం.
* సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ విభిన్నమైనది.
ఆరోగ్య బీమా
* బీమా చేయించుకున్న వ్యక్తి పలుమార్లు ఆస్పత్రి పాలైనప్పటికీ అన్ని సార్లూ బీమా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఆ మొత్తం బీమా చేయించిన మొత్తానికి మించకూడదు. క్లెయిమ్ చెల్లుబాటయ్యేదై ఉండాలి.
* కనీసం 24 గంటలకు పైగా ఆస్పత్రిలో ఉండాలి.
* హాస్పిటల్‌లో చేరడానికి ముందు, తర్వాత అయ్యే వ్యయాన్ని ఈ పాలసీ భరిస్తుంది.
* తీవ్ర అస్వస్థతలను హెల్త్ ప్లాన్ నుంచి మినహాయిస్తారు.
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్
* పాలసీ కాలపరిమితిలోపు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పరీక్షల్లో వెల్లడైన వెంటనే పాలసీదారుకు పూర్తి బీమా మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. పాలసీని మళ్లీ రెన్యువల్ చేయించుకునే వరకు తదుపరి ప్రయోజనాలు ఉండవు.
* ఆస్పత్రిలో చేరారా, లేదా అనే విషయంతో సంబంధం లేదు. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యపరీక్షల్లో తేలితే చాలు.
* ఆస్పత్రి, చికిత్స వ్యయాలతో పాటు అస్వస్థత కారణంగా కోల్పోయిన ఆదాయానికి కూడా కొంతమొత్తాన్ని చెల్లిస్తారు.
* తీవ్ర అస్వస్థతలను మాత్రమే కవర్ చేస్తారు.
* క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను విడిగా ఓ బీమా పాలసీగా తీసుకోవచ్చు. లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు రైడర్‌గానూ తీసుకోవచ్చు. మంచి హెల్త్‌ప్లాన్‌కు రైడర్‌గా క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను తీసుకోవడం ఉత్తమమని నిపుణుల సలహా.