ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే.. | To take any kind policy .. | Sakshi
Sakshi News home page

ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..

Published Sun, Apr 20 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..

ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..

 రాజేశ్ సూద్
 ఎండీ, సీఈఓ, మ్యాక్స్ లైఫ్

  జీవిత బీమా... ప్రతి ఒక్కరికీ ధీమా కలిగిస్తుంది. వ్యక్తి ఆర్థిక ప్రణాళికలకు స్థిరత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ ఇచ్చేదే బీమా. దీర్ఘకాలిక పొదుపును, రక్షణను, పన్ను ప్రయోజనాలను సమకూర్చే ఏకైక సాధనం జీవిత బీమా మాత్రమే. తొలిసారిగా ఇలాంటి పాలసీని కొనుగోలు చేసే వారికి ఏది మంచి పాలసీ అనే సందేహం ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందు చూడాల్సిన అంశాలను  తెలుసుకుందాం.

 వారో వీరో చెప్పారని వద్దు...
 మీ స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీని కొనవద్దు. వ్యక్తులకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా జీవిత బీమాను రూపొందించారు. మీ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే మీకు జీవిత బీమా చాలా అవసరం.

మీపై ఆధారపడిన వారు ప్రస్తుతానికి లేనప్పటికీ, భవిష్యత్తులో అలాంటి వారు మీకు ఉంటారని భావిస్తే చిన్న పాలసీతో ప్రారంభించాలి. ఎంత మొత్తానికి జీవిత బీమా అనేది మీ వార్షిక ఆదాయం, ఖర్చులు, మీ తదనంతరం  కుటుంబానికి అవసరమయ్యే సొమ్ము వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అవగాహనకు రావచ్చు.
 తగిన పాలసీ:  ఇప్పుడు అనేక రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరమైనవి ఎంచుకోవాలి. తొలిసారిగా కొనే వారికి తగినవి నాలుగు రకాలున్నాయి.

 అవి: 1. నిర్ణీత కాలవ్యవధిలో మరణానంతర ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) కల్పించే టర్మ్ పాలసీ. 2. పూర్తి జీవితకాల కవరేజీ కల్పించే హోల్ లైఫ్‌టైమ్ పాలసీ. 3. మరణం సంభవించినపుడు లేదా నిర్ణీత తేదీన బెనిఫిట్లను అందించే ఎండోమెంట్ పాలసీ. 4. బీమా చేయించుకున్న వారు నిర్ణీత వయస్సుకు చేరినపుడు (రిటైర్మెంట్ వంటివి) చెల్లింపులు చేసే యాన్యుయిటీ పాలసీ.

వీటిలో మీకు ఏది అన్ని విధాలుగా తగినదో తెలుసుకునేందుకు ఏజెంట్ అడ్వయిజర్‌ను సంప్రదించవచ్చు. జీవిత బీమా పాలసీని కొనడమంటే సదరు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లే. కనుక, బీమా ప్రొడక్టును కొనేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం ఏటా చేయాల్సిన పెట్టుబడులను మదింపు చేయండి.

 రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉందో గమనించండి. మీకు ఎక్కువ అనుకూలంగా ఉండే పాలసీని ఎంచుకోండి. ఇదే కసరత్తు ఏటా చేస్తుండాలి. ఎందుకంటే, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతుంటాయి కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement