Max Life
-
ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయి. పట్టణవాసుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి బీమా రక్షణ ఉంటోంది. బీమాపై అవగాహన, జీవిత బీమా పాలసీ కలిగి ఉండటం, ఆర్థిక భద్రతను మెరుగుపర్చుకోవడంపై ఇక్కడి వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి బీమా సంస్థ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మార్కెటింగ్ డేటా కాంతార్ నిర్వహించిన 6వ విడత ఇండియా ప్రొటెక్షన్ కోషంట్ (ఐపీక్యూ) సర్వేలో దక్షిణాది 49 పాయింట్లు దక్కించుకుంది. దీని ప్రకారం 44 పీక్యూతో దక్షిణాది మెట్రోల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. దక్షిణ భారతంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక ప్రీమియం అనేది టర్మ్ ప్లాన్ కొనుగోలుకు అవరోధంగా ఉంటోందని పేర్కొన్నారు. దక్షిణాది వారు రిటైర్మెంట్ ప్లానింగ్‌కి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌వాసులు ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు పిల్లల భవిష్యత్‌పైనా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు వివరించింది. 25 నగరాల వ్యాప్తంగా 4,700 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
ఆర్థిక భద్రతకు మొదటి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: జీవిత బీమా పట్ల భారతీయుల్లో గత రెండు సంవత్సరాల్లో ఎంతో అవగాహన పెరిగినట్టు మ్యాక్స్ లైఫ్ ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్’ (ఐపీక్యూ) సర్వే తెలిపింది. ఈ సంస్థ వార్షికంగా సర్వే నిర్వహిస్తుంటుంది. ఇది నాలుగో ఎడిషన్ సర్వే. 2021 డిసెంబర్ 10 నుంచి 2022 జనవరి 14 వరకు ఆన్లైన్లో ఈ సర్వేను నిర్వహించింది. ► పట్టణ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ క్వొటెంట్ 3 పాయింట్లు పెరిగి 50కు చేరుకుంది. గతంతో పోలిస్తే ఇది క్రమంగా పెరుగుతోంది. ► కరోనా భయాలు తగ్గిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లోని పాలసీదారులు పిల్లల విద్య, రిటైర్మెంట్ వంటి ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. ► కరోనా వల్ల ఏర్పడిన ఆందోళనలు తగ్గినా, వ్యక్తిగత రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది. ► మెట్రోలు, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ప్రొటెక్షన్ ఇండెక్స్ పెరిగింది. అంటే రక్షణ పట్ల అవగాహన విస్తృతం అయింది. ► ముఖ్యంగా టైర్–2 ప్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహన 61 పాయింట్ల నుంచి 68 పాయింట్లకు ఎగిసింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహనను ఇది తెలియజేస్తోంది. ► టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి శాతం గతేడాది ఉన్న 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. ► పట్టణ ప్రాంతాల్లో సగానికంటే ఎక్కువ మంది తమకున్న టర్మ్ కవరేజీ సరిపడదన్న అభిప్రాయంతో ఉన్నారు. ► పాలసీదారులు కట్టాల్సిన ప్రీమియం కంటే కూడా, తమకు కావాల్సిన బీమా రక్షణపైనే దృష్టి పెడుతుండడం మార్పునకు నిదర్శనం. ► చివరి గమ్యం వరకు జీవిత బీమా పట్ల అవగాహన కలిగించే విషయంలో అడ్డంకులను అధిగమించాల్సి రావడం పరిశ్రమ ముందున్న సవాలుగా ఈ సర్వే పేర్కొంది. అవగాహన విస్తృతం ‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీవిత బీమా పట్ల అవగాహన పెరిగినట్టు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత అవగాహన గణనీయంగా పెరిగింది. కరోనా సమసిపోతున్నా గరిష్ట స్థాయిలో అవగాహన కొనసాగుతుండడం సంతోషకరం. ప్రజలు మరింత రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండడం అన్నది మంచిది. ఈ అవగాహన కొనుగోళ్లకు దారితీస్తోంది. టర్మ్, సేవింగ్స్, యూనిట్ లింక్డ్ పాలసీలు ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగుదల కనిపిస్తోంది. ఒకరు ఒకటికంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. -
గుడ్ న్యూస్.. భారీగా ఏజెంట్ల నియామకం చేపట్టిన మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్
ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు చేరాలని అనుకునే వారికి శుభవార్త. ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ఏజెంట్ల స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఏజెంట్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ ప్రకటించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎఫ్ వై 21లో 23,000 మందికి పైగా ఏజెంట్ సలహాదారులను నియమించుకోనుంది. మాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి. విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఇలా.. "మా ఏజెన్సీ శ్రామిక శక్తి డిజిటల్ నియామక ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి మాత్రమే కాదు, మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా, వేగంగా సమర్థవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించింది" అని అన్నారు. డిజిటల్ నియామక ప్రక్రియ కింద మాక్స్ లైఫ్ నాణ్యమైన ఏజెంట్ నియామకాన్ని ప్రారంభించడానికి సమగ్రమైన 'వెబ్-టు-రిక్రూట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 'మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్' ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయి. -
సంపాదనలో సగానికి పైగా ఆదా చేస్తున్న మహిళలు
న్యూఢిల్లీ: పట్టణ మహిళలు (ఉద్యోగం, ఆర్జనలో ఉన్నవారు) పొదుపునకు, పెట్టుబడులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్.. మహిళలను తమ విశ్రాంత జీవనం గురించి ఆలోచింపజేసినట్టు మ్యాక్స్‌లైఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. విచక్షణారహితంగా ఖర్చు పెట్టడానికి బదులు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు.. సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం మహిళా ఉద్యోగులు కేటాయిస్తున్నారు. కనీస అవసరాలకు వారు కేటాయిస్తున్న మొత్తం 39 శాతం మించడం లేదు. ఇక దుబారా, ఖరీదైన వాటి కోసం వారు చేస్తున్న ఖర్చు కేవలం 9 శాతంగానే ఉందని మ్యాక్స్‌లైఫ్ ఇండియా సర్వే స్పష్టం చేసింది. సర్వేలో అభిప్రాయం తెలిపిన మహిళల్లో.. 56 శాతం మంది తమ వృద్ధాప్య జీవన అవసరాలు, భద్రత కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 64 శాతం మంది పిల్లల విద్య కోసం పక్కన పెట్టగా.. అకాల మరణం చెందితే కుటుంబానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో 39 శాతం మంది రక్షణాత్మక చర్యలు తీసుకున్నారు. 40 శాతం మంది వైద్య అత్యవసరాల కోసం పొదుపు చేసినట్టు చెప్పారు. జన్ ధన్ అకౌంట్లలో మెజారిటీ ‘మహిళ’దే!: ఆర్థికశాఖ ప్రకటన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్లు కలిగివున్న వారిలో 55 శాతం మంది మహిళలేనని ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములుగా చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా లబ్దిదారులకు అందాలని లక్ష్యంగా 2014 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ ఒక ప్రకటన చేసింది. మహిళల సాధికారితను పెంచే క్రమంలో జన్ ధన్ యోజన కీలకమైనదని ఈ ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2018లో ఈ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమా రెట్టింపు, ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి పెంపు వంటి పలు కీలక ప్రయోజనాలు రెండవ వెర్షన్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి జన్ ధన్ యోజన కింద అకౌంట్ల సంఖ్య 41.93 కోట్లుగా పేర్కొంది. ఇందులో 23.21 కోట్లు మహిళలకు చెందినవని వివరించింది. ముద్రా యోజన ద్వారా మహిళలకు రూ.6.36 లక్షల కోట్లు కాగా, ప్రధానమంత్రి ముంద్ర యోజన (పీఎంఎంవై) అకౌంట్ల విషయంలో 68శాతం(19.04 కోట్లు)తో మహిళలే మందున్నారని ఆర్థికశాఖ ప్రకటన పేర్కొంది. 2021 ఫిబ్రవరి 26వ తేదీనాటికి రూ.6.36 లక్షల కోట్లను మహిళా పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసినట్లు తెలిపింది. 2015 ఏప్రిల్ 8వ తేదీన ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. లఘు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలవరకూ రుణం అందజేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను మంజూరుచేస్తాయి. స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌లోనూ అగ్రస్థానం స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌కు సంబంధించి 81 శాతానికిపైగా (91,109 అకౌంట్లు) అకౌంట్ల విషయంలో రూ.20,749 కోట్లను మహిళలకు మంజూరుచేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2016 ఏప్రిల్ 5వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. క్రింది స్థాయి మహిళలు, బలహీన వర్గాల ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన లక్ష్యంగా 2016 ఏప్రిల్ 5న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం బ్యాంక్ ద్వారా కింద రూ.10 లక్షల నుంచి కోటి వరకూ రుణ సౌలభ్యం పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకించి మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నది లక్ష్యం. -
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?
ముంబై : హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్ లు రెండూ జతకట్టి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ గా ఉద్భవించబోతున్నాయి. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో విలీనం అయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులు విలీన చర్చలు జరపడానికి ముంబైలో సమావేశం కాబోతున్నారని వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఈ సమావేశానికి అధ్యక్షత కాబోతున్నారని పేర్కొన్నారు. ఈ విలీన వార్త మార్కెట్లకి అందగానే శుక్రవారం ఉదయం ట్రేడింగ్ లో మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీస్ లిమిటెడ్ షేర్లు, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. మ్యాక్స్ ఫైనాన్సియల్ షేర్లు 20శాతం, హెచ్ డీఎఫ్ సీ షేర్లు 1.5శాతం పుంజుకున్నాయి. ఈ రెండు కంపెనీలు విలీనమై అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉన్న ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కంటే దూసుకుపోయేందుకు సన్నద్ధ మవుతున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ విలీనం గట్టి పోటీని ఇవ్వనుందని సమాచారం. మార్కెట్ షేర్ ను, లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు కొత్త మార్గాలను చేపడుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళిక గురించి కంపెనీలు అధికారికంగా ఇంకో కొన్ని రోజుల్లో వెల్లడించనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, దాదాపు దశాబ్దం తర్వాత లైఫ్ ఇన్సూరర్స్ లో జరగబోయే మొదటి విలీనం ఇదే కానుంది. ఈ రెండు కంపెనీలు విలీనమై ఒకటిగా సేవలు అందించేందుకు షేర్ హోల్డర్స్ సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హెచ్డీఎఫ్ లిమిటెడ్ కు, స్టాండర్డ్ లైఫ్ కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్. ఈ కంపెనీ 61శాతం యాజమాన్య వాటా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, 35శాతం యాజమాన్య వాటా స్టాండర్డ్ లైఫ్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మెజార్టి యాజమాన్య వాటా అంటే 68శాతం మ్యాక్స్ ఫైనాన్సియల్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ విలీనంపై స్పందించడానికి హెచ్డీఎఫ్సీ, మ్యాక్స్ లు తిరస్కరించాయి. -
ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..
రాజేశ్ సూద్ ఎండీ, సీఈఓ, మ్యాక్స్ లైఫ్ జీవిత బీమా... ప్రతి ఒక్కరికీ ధీమా కలిగిస్తుంది. వ్యక్తి ఆర్థిక ప్రణాళికలకు స్థిరత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ ఇచ్చేదే బీమా. దీర్ఘకాలిక పొదుపును, రక్షణను, పన్ను ప్రయోజనాలను సమకూర్చే ఏకైక సాధనం జీవిత బీమా మాత్రమే. తొలిసారిగా ఇలాంటి పాలసీని కొనుగోలు చేసే వారికి ఏది మంచి పాలసీ అనే సందేహం ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందు చూడాల్సిన అంశాలను తెలుసుకుందాం. వారో వీరో చెప్పారని వద్దు... మీ స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీని కొనవద్దు. వ్యక్తులకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా జీవిత బీమాను రూపొందించారు. మీ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే మీకు జీవిత బీమా చాలా అవసరం. మీపై ఆధారపడిన వారు ప్రస్తుతానికి లేనప్పటికీ, భవిష్యత్తులో అలాంటి వారు మీకు ఉంటారని భావిస్తే చిన్న పాలసీతో ప్రారంభించాలి. ఎంత మొత్తానికి జీవిత బీమా అనేది మీ వార్షిక ఆదాయం, ఖర్చులు, మీ తదనంతరం కుటుంబానికి అవసరమయ్యే సొమ్ము వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అవగాహనకు రావచ్చు. తగిన పాలసీ: ఇప్పుడు అనేక రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరమైనవి ఎంచుకోవాలి. తొలిసారిగా కొనే వారికి తగినవి నాలుగు రకాలున్నాయి. అవి: 1. నిర్ణీత కాలవ్యవధిలో మరణానంతర ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) కల్పించే టర్మ్ పాలసీ. 2. పూర్తి జీవితకాల కవరేజీ కల్పించే హోల్ లైఫ్‌టైమ్ పాలసీ. 3. మరణం సంభవించినపుడు లేదా నిర్ణీత తేదీన బెనిఫిట్లను అందించే ఎండోమెంట్ పాలసీ. 4. బీమా చేయించుకున్న వారు నిర్ణీత వయస్సుకు చేరినపుడు (రిటైర్మెంట్ వంటివి) చెల్లింపులు చేసే యాన్యుయిటీ పాలసీ. వీటిలో మీకు ఏది అన్ని విధాలుగా తగినదో తెలుసుకునేందుకు ఏజెంట్ అడ్వయిజర్‌ను సంప్రదించవచ్చు. జీవిత బీమా పాలసీని కొనడమంటే సదరు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లే. కనుక, బీమా ప్రొడక్టును కొనేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం ఏటా చేయాల్సిన పెట్టుబడులను మదింపు చేయండి. రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉందో గమనించండి. మీకు ఎక్కువ అనుకూలంగా ఉండే పాలసీని ఎంచుకోండి. ఇదే కసరత్తు ఏటా చేస్తుండాలి. ఎందుకంటే, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతుంటాయి కదా!