
న్యూఢిల్లీ: జీవిత బీమా పట్ల భారతీయుల్లో గత రెండు సంవత్సరాల్లో ఎంతో అవగాహన పెరిగినట్టు మ్యాక్స్ లైఫ్ ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్’ (ఐపీక్యూ) సర్వే తెలిపింది. ఈ సంస్థ వార్షికంగా సర్వే నిర్వహిస్తుంటుంది. ఇది నాలుగో ఎడిషన్ సర్వే. 2021 డిసెంబర్ 10 నుంచి 2022 జనవరి 14 వరకు ఆన్‌లైన్‌లో ఈ సర్వేను నిర్వహించింది.
► పట్టణ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ క్వొటెంట్ 3 పాయింట్లు పెరిగి 50కు చేరుకుంది. గతంతో పోలిస్తే ఇది క్రమంగా పెరుగుతోంది.
► కరోనా భయాలు తగ్గిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లోని పాలసీదారులు పిల్లల విద్య, రిటైర్మెంట్ వంటి ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది.
► కరోనా వల్ల ఏర్పడిన ఆందోళనలు తగ్గినా, వ్యక్తిగత రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది.
► మెట్రోలు, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ప్రొటెక్షన్ ఇండెక్స్ పెరిగింది. అంటే రక్షణ పట్ల అవగాహన విస్తృతం అయింది.
► ముఖ్యంగా టైర్–2 ప్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహన 61 పాయింట్ల నుంచి 68 పాయింట్లకు ఎగిసింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహనను ఇది తెలియజేస్తోంది.
► టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి శాతం గతేడాది ఉన్న 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది.
► పట్టణ ప్రాంతాల్లో సగానికంటే ఎక్కువ మంది తమకున్న టర్మ్ కవరేజీ సరిపడదన్న అభిప్రాయంతో ఉన్నారు.
► పాలసీదారులు కట్టాల్సిన ప్రీమియం కంటే కూడా, తమకు కావాల్సిన బీమా రక్షణపైనే దృష్టి పెడుతుండడం మార్పునకు నిదర్శనం.
► చివరి గమ్యం వరకు జీవిత బీమా పట్ల అవగాహన కలిగించే విషయంలో అడ్డంకులను అధిగమించాల్సి రావడం పరిశ్రమ ముందున్న సవాలుగా ఈ సర్వే పేర్కొంది.
అవగాహన విస్తృతం
‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీవిత బీమా పట్ల అవగాహన పెరిగినట్టు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత అవగాహన గణనీయంగా పెరిగింది. కరోనా సమసిపోతున్నా గరిష్ట స్థాయిలో అవగాహన కొనసాగుతుండడం సంతోషకరం. ప్రజలు మరింత రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండడం అన్నది మంచిది. ఈ అవగాహన కొనుగోళ్లకు దారితీస్తోంది. టర్మ్, సేవింగ్స్, యూనిట్ లింక్డ్ పాలసీలు ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగుదల కనిపిస్తోంది. ఒకరు ఒకటికంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment