హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఒకే పథకంలో మూడు రకాల బీమా రక్షణను కల్పించే విధంగా సరికొత్త బీమా పథకాన్ని ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా ప్రవేశపెట్టింది. జీవిత బీమా రక్షణతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా రక్షణను కల్పించే విధంగా దీన్ని రూపొందిచామని, ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్లు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసన్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే లక్ష రూపాయల బీమాతో పాటు, హాస్పిటలైజేషన్ అయితే రూ.20-30 వేలు వైద్య చికిత్సా వ్యయం కింద పొందవచ్చు. దీంతో పాటు ప్రమాద బీమా రక్షణ కూడా ఉంటుంది. ఈ మూడింటికి కలిపి వార్షిక ప్రీమియం రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ ప్రోడక్టును ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ స్వాగతించారు.