ఐపీఓకు ఎస్‌బీఐ లైఫ్ దరఖాస్తు
రూ.6,500–రూ.7,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదన
ముంబై: జీవిత బీమా రంగంలోని ప్రముఖ కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ తొలి పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్లను సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం జారీ మూలధనంలో 12 శాతానికి సమానం. ఎస్‌బీఐ 8 కోట్ల షేర్లు, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్ ఎస్‌ఏ 4 కోట్ల షేర్లను జారీ చేస్తాయి. ఈ రెండు సంస్థలు ఎస్‌బీఐ ప్రమోటర్లుగా ఉన్నాయి.
20 లక్షల షేర్లను ఎస్‌బీఐ ఉద్యోగులకు, 1.2 కోట్ల షేర్లను ఎస్‌బీఐ వాటాదారులకు రిజర్వ్ చేస్తారు. జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, బీఎన్‌పీ పారిబా, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిష్ సెక్యూరిటీస్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తర్వాత ఐపీవోకి రానున్న రెండో బీమా కంపెనీ ఇది.