పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ గతేడాది ప్రారంభించింది.
ఈ-రిపాజిటరీ ఏమిటంటే...
ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్‌లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట.
ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు.
అంతా ఉచితమే...
బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్‌డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్‌డేట్ చేస్తుంటుంది.
ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది.
స్నేహిల్ గంభీర్
సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్