జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలంటే..ఇప్పుడే తీసేసుకోండి.. అక్టోబర్ దాకా ఆగకండంటూ ఈమధ్య కొన్నాళ్లుగా ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ హోరెత్తుతున్నాయి. అక్టోబర్ తర్వాత నుంచీ ప్రవేశపెట్టే కొత్త పాలసీల్లో ప్రయోజనాలు తక్కువగా ఉంటాయన్నది వీటి సారాంశం. ఇలాంటివి మీకు వస్తే.. తొందరపడిపోకుండా.. మరో రెండు రోజులు ఆగడమే మంచిది. ఎందుకంటే.. అక్టోబర్ తర్వాత నుంచి బీమా పాలసీలు మరింత ప్రయోజనకరంగా, ఆకర్షణీయంగా మారనున్నాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఆదేశాల ప్రకారం బీమా సంస్థలు .. లైఫ్, హెల్త్ పాలసీల్లో మార్పులు, చేర్పులు చేసి కొత్త పాలసీలను సమర్పించడానికి గడువు అక్టోబర్ 1న తీరిపోతోంది. ఆ తర్వాత నుంచి వచ్చే పాలసీలు.. పాలసీదారులకు మరింత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండనున్నాయి.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాకా.. బీమా సంస్థలు పాలసీలపై ఏజెంటుకు ఇచ్చే క మీషన్ తగ్గిపోతుంది. దీనివల్ల సదరు పాలసీపై వచ్చే రాబడులు కూడా పెరిగే అవకాశముంది. తద్వారా అంతిమంగా పాలసీదారుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇక, కొత్త పాలసీల్లో చెల్లించే ప్రీమియం కన్నా సమ్ అష్యూర్డ్ పది రెట్లు ఎక్కువగా ఉండాలి. దీనివల్ల పన్నుపరమైన మినహాయింపులు మరికాస్త ఎక్కువగా పొందడానికి వీలవుతుంది. ప్రస్తుతం చాలా మటుకు పాలసీల్లో సమ్ అష్యూర్డ్.. ప్రీమియం కన్నా అయిదు నుంచి 8 రెట్లు దాకా మాత్రమే ఉంటోంది. వీటన్నింటి రూపు రేఖలు మారిపోతాయి.
అధిక సరెండర్ వేల్యూ..
పాలసీ గడువులోగా పాలసీని ఉపసంహరించుకునే పక్షంలో బీమా సంస్థలు తిరిగి చెల్లించే మొత్తానికి (సరెండ ర్ వేల్యూ) సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా మూడేళ్లయినా ప్రీమియంలు కట్టకుండా పాలసీని సరెండర్ చేస్తే ప్రస్తు తం వెనక్కి కొంత డబ్బు కూడా రావడం లేదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం పాలసీని గడువులోగా సరెండరు చేస్తే వచ్చే ప్రయోజనాలు కూడా మరింత మెరుగ్గా ఉంటాయి. గతంలో లేని విధంగా రెండో ఏడాదిలో కూడా పాలసీని సరెండర్ చేసే అవకాశం లభించనుంది. అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం పాలసీదారు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిని బట్టి సరెండర్ విలువ కూడా మారుతుంది. ఉదాహరణకు ప్రీమియం చెల్లింపు వ్యవధి పదేళ్ల కన్నా తక్కువైన పక్షంలో రెండేళ్లకే సరెండరు విలువ పొందవచ్చు. అదే పదేళ్లపైబడిన గడువున్న పాలసీలకైతే.. మూడేళ్ల తర్వాత సరెండరు చేసే వీలుంటుంది. ఇలాంటి సందర్భంలో చెల్లించిన ప్రీమియం మొత్తంలో సుమారు 30 శాతం కనీస సరెండరు విలువ లభిస్తుంది. అదే నాలుగో ఏడాది నుంచి ఏడో సంవత్సరం దాకా కనీస సరెండరు విలువ చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 50 శాతం దాకా లభిస్తుంది.
మీరేం చేయొచ్చు..
ఒకవైపు బీమా ప్రయోజనంతో పాటు మరోవైపు పెట్టుబడి ప్రయోజనాలు కూడా పాలసీలోనే పొందాలనుకునే వారు వచ్చే నెల దాకా వేచి చూస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సురక్షితమైన రాబడులు పొందాలనుకునే వారు ఎప్పుడైనా సరే.. టర్మ్ ప్లాన్ లాంటిది తీసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు. ఏదేమైతేనేం.. నిబంధనలు సరళతరం అయ్యాయని తీసుకోవడం కాకుండా.. మన అవ సరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవడం మంచిది.
1 నుంచి మరింత ప్రయోజనకరమైన పాలసీలు
Published Sun, Sep 29 2013 1:02 AM | Last Updated on Tue, Aug 21 2018 8:07 PM
Advertisement