జీవిత బీమాతో రెండిందాల మేలు
ఇటీవలి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. ఆదాయ పన్ను చట్టంలోని 80సీ కింద మినహాయింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల దాకా పెంచారు. దీర్ఘకాలిక పొదుపును, జీవిత బీమాను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సమగ్రమైన బీమా కవరేజీ తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను సమర్ధంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అదెలా చేయొచ్చన్నది వివరించే ప్రయత్నమే ఈ కథనం. సాధారణంగా ప్రీమియానికి పది రెట్లు కవరేజీతో పాటు బీమా పాలసీల్లో పన్నుల పరంగా పలు ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. అవేంటంటే..
మనం ఉన్నా లేకపోయినా కూడా మనం ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడే ఏకైక ఆర్థిక సాధనం జీవిత బీమా. ఇదే దీని ప్రత్యేకత. యుక్తవయస్సులో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినప్పటికీ.. పెళ్లి చేసుకున్నాక.. కుటుంబం అంటూ ఏర్పడ్డాక జీవిత బీమా ప్రాధాన్యం ఏమిటన్నది, ఆర్థిక ప్రణాళికకు ఇదెంత కీలకమన్నది అర్థమవుతుంది. చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే జీవిత బీమా పథకాలు భవిష్యత్‌లో మెరుగైన రాబడులు అందించే అద్భుతమైన పొదుపు సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇదెలాగన్నది అజయ్ అనే ఉద్యోగికి ఇచ్చిన సూచనల ద్వారా తెలుసుకుందాం. ముప్పై అయిదేళ్ల అజయ్‌కి భార్య, మూడేళ్ల కూతురు నేహ ఉన్నారు. వార్షికాదాయం దాదాపు రూ. 8 లక్షలు కాగా, భార్య గృహిణి. ఇటు కుటుంబానికి, అటు రిటైర్మెంట్ సమయానికి తనకు ఆర్థికపరమైన భరోసా లభించేలా అజయ్ పాటించాల్సిన ప్రణాళిక ఇలా ఉంటుంది.
1. కుటుంబానికి భరోసా..
ఇంట్లో సంపాదించేది అజయ్ ఒక్కరే కావడంతో కుటుంబం అంతా అతనిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి రేప్పొద్దున్న తనకేదైనా జరిగినా కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇలాంటప్పుడే జీవిత బీమా అక్కరకొస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, జీవిక కోసం పూర్తిగా తనపైనే ఆధారపడిన జీవిత భాగస్వామి ఉన్న వారికి ఈ పాలసీ చాలా ముఖ్యం. అంతే గాదు అజయ్ తన పిల్లల భవిష్యత్ చదువుల ఫీజుల కోసం, రుణాలేమైనా ఉంటే వాటి చెల్లింపుల కోసం, కుటుంబ ఖర్చుల కోసం కూడా తగినంత కవరేజి ఉండేలా చూసుకోవాలి.
ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి.. అలాగే ఖర్చులూ పెరిగిపోతుంటాయి. ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కవరేజీని నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఇలాంటివాటన్నింటి కోసం అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. కవరేజీ ఎంత ఉండాలన్న విషయానికొస్తే.. ఒకటే బండగుర్తు. రిటైర్మెంట్‌కి ఎంత కాలం ఉంది, ఈ వ్యవధిలో ఎంత ఆర్జించే అవకాశం ఉందన్నది లెక్క వేసుకోగలిగితే ఎంత కవరేజీ తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఉదాహరణకు, అజయ్ అరవై ఏళ్లకు రిటైర్ అవుతారనుకుంటే.. అతనికి ఇంకా 25 ఏళ్ల సర్వీసు ఉంది. దీన్ని బట్టి చూస్తే 20-25 సంవత్సరాల పాటు వార్షికాదాయాన్ని లెక్కించుకుంటే తీసుకోవాల్సిన కవరేజీ తెలుస్తుంది. అజయ్ విషయంలో సుమా రు రూ. 1.6 కోట్లు - 2 కోట్ల దాకా అవసరమవుతుంది.
2. కూతురు చదువు కోసం
అజయ్ తన కుమార్తె చదువు కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయి ప్రస్తుత వ యస్సును పరిగణనలోకి తీసుకుంటే కాలేజీలో చేరేందుకు ఇంకా 15 ఏళ్ల వ్యవధి ఉంది. ప్రస్తుతం 4 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చవుతోంది. ధరలు ఏటా 6% పెరుగుతాయనుకుంటే 15 ఏళ్ల తర్వాత ఈ ఖర్చు రూ. 12 లక్షలయి కూర్చుంటుంది. ఇంత మొత్తం సమకూర్చుకోవాలంటే అజయ్ ప్రతి ఏడాది సేవింగ్స్ ఆధారిత జీవిత బీమా పథకంలో రూ. 45,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.
3. రిటైర్మెంట్ కోసం..
వీటితో పాటు తాను రిటైరయిన తర్వాత తలెత్తే అవసరాల కోసం పింఛను పథకం రూపంలో అజయ్ ప్లాన్ చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే నిధులకు ఈ పింఛన్ పథకం రాబడి కూడా తోడయితే రిటైర్మెంట్ తర్వాత ఖర్చులను జాగ్రత్తగా ఎదుర్కొనవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ ప్రీమియం కోసం ఏటా రూ. 50,000 కడితే రిటైరయ్యే సమయానికి రూ. 34 లక్షల మేర నిధి సమకూరుతుంది. పదవీ విరమణ తర్వాత దీన్ని యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. ఎంచుకున్న చాయిస్‌ని బట్టి ఆదాయాన్ని అందుకోవచ్చు.
4. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు..
జీవితం అంటే .. మనం క న్న కలలను సునిశితమైన ప్లానింగ్, క్రమశిక్షణ, అంకితభావంతో సాకారం చేసుకోవడం. క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లాన్‌తో అజయ్ కూడా ఏడాదికోసారి హాలిడేలు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడు విదేశీ టూర్లు సైతం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా జరగాలంటే.. ముందుగా భవిష్యత్‌లో తలెత్తే ఖర్చులను ఎలా ఎదుర్కోనాలనేది ప్లాన్ చేసుకోవాలి. తగిన బీమా పాలసీ తీసుకోవాలి.