నేడే బడ్జెట్‌: ఇవీ.. కోరికలు! ఏవి తీరుస్తారో!! | All you need to know about today's big event | Sakshi
Sakshi News home page

నేడే బడ్జెట్‌: ఇవీ.. కోరికలు! ఏవి తీరుస్తారో!!

Published Thu, Feb 1 2018 1:10 AM | Last Updated on Thu, Feb 1 2018 10:29 AM

All you need to know about today's big event - Sakshi

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

మరికొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే పలు వర్గాల నుంచి ఆయనకు వినతులు, డిమాండ్లు చాలా అందాయి. వాటిలో కొన్నిటికి ఈ బడ్జెట్లో చోటు కల్పించి ఉండొచ్చు కూడా. అయితే ఏ వర్గం ఏమాశిస్తోందో తెలిస్తేనే కదా... వాటికి ఈ బడ్జెట్లో స్థానమిచ్చారో లేదో తెలిసేది!! అందుకే... వివిధ పారిశ్రామిక వర్గాలు ఈ బడ్జెట్‌ నుంచి ఏమాశిస్తున్నాయనేది వారి మాటల్లోనే...

ఇన్వెస్ట్‌మెంట్లు, ప్రోత్సాహకాలపై దృష్టిపెట్టాలి.. 
కేంద్రం గతేడాది ప్రవేశపెట్టిన జీఎస్‌టీ సహా పలు ఇతర సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనవే. ఈసారి బడ్జెట్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలోని పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కొనసాగించాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చిన్న ఇన్వెస్టర్లకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. పవన, సౌర విద్యుత్‌కు... సంబంధించిన అన్ని టెండర్లలో 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి. విండ్‌ టర్బైన్‌ విడిభాగాలపై జీఎస్‌టీ సమస్యలను పరిష్కరించాలి. ఏడాదికి 10వేల మెగావాట్లకుపైగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా ఎగుమతి ప్రోత్సాహకాలు పెంచాలి. డిస్కమ్‌లకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (పీబీఐ) అమలు చేయాలి. వినియోగం పెరుగుదలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. తయారీ, నిర్మాణ రంగ ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రాధాన్యమివ్వాలి.
–తుల్సి తంతి, సుజ్లాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, సీఎండీ

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గాలి...
ఈ బడ్జెట్‌ గురించి మార్కెట్లు ఆత్రుతగా చూస్తున్నాయి. పన్నులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక రంగం, ఇన్‌ఫ్రాపై వ్యయాలు వంటి వాటికి సంబంధించిన ప్రకటనలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయి. జీఎస్‌టీ అమలు తర్వాత బడ్జెట్‌లో పరోక్ష పన్ను మార్పు అనేది కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు రూపంలో జరగొచ్చు. ఇదివరకటి బడ్జెట్లలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రణాళికలు ప్రకటించారు.  2022 నాటికి అందరికీ ఇల్లు లక్ష్యం సాకారం చేయటానికి ఈ విభాగానికి కేటాయింపులు కొనసాగొచ్చు. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం అనే అంశాల గురించి చాలా మంది మాట్లాడారు. వీటికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువగా కేటాయింపులివ్వాలి.  
– కుంజ్‌ బన్సాల్, సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈడీ

డబుల్‌ ట్యాక్సేషన్‌పై స్పష్టత కావాలి
‘పరిశ్రమలో అడ్వాన్స్‌ ప్రైసింగ్‌ అగ్రిమెంట్‌ (ఏపీఏ) విధానంలో ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్, డబుల్‌ ట్యాక్సేషన్‌ అంశంపై గందరగోళం ఉంది. దీనిపై మరింత స్పష్టత కోరుతున్నాం. డెవలప్‌మెంట్‌ సెంటర్లు సెక్షన్‌ 35 (2ఏబీ) కింద మరింత అనుకూలమైన మినహాయింపుల్ని కోరుతున్నాయి. ఏంజెల్‌ ట్యాక్స్‌ అనేది విదేశీ ఇన్వెస్టర్లతో పోలిస్తే దేశీ ఇన్వెస్టర్లపై ఎక్కువగా ఉంది. దీన్ని పరిష్కరించాలి. రి–స్కిల్లింగ్‌కు సంబంధించి ఐటీ అసోసియేషన్స్‌ అభ్యర్థనలను ప్రభుత్వం మన్నించాలి.
– సుమన్‌ రెడ్డి, ఎండీ, పెగాసిస్టమ్స్‌



పన్నుయేతర ఆదాయంపై దృష్టి పెట్టాలి
క్రమంగా, స్థిరంగా పన్నుయేతర ఆదాయాలు పెంచుకునేలా దీర్ఘకాలిక వ్యూహాన్ని బడ్జెట్‌లో ప్రకటించాలి. ప్రభుత్వాలు ఇన్నేళ్లుగా పన్నుయేతర ఆదాయాలను పెద్దగా పట్టించుకున్నది లేదు. ప్రత్యేక వ్యూహమంటూ లేదు. ఇకపై అలా కాకుండా.. పన్నుయేతర ఆదాయ పరిధిని మరింత విస్తృతం చేసేలా వ్యూహాలు అమలు చేయాలి. అసెట్స్‌ అమ్మకాలు, పన్నుయేతర వనరుల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. 
– రశేష్‌ షా, చైర్మన్, ఎడెల్వీస్‌ గ్రూప్‌

‘విద్య’లో ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం ఉండాలి
గత బడ్జెట్‌లలో మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్‌ కాలేజ్‌లకు అధిక మొత్తంలో కేటాయింపులు జరిగాయి. కానీ ప్రాథమిక విద్యకు అంత ప్రాధాన్యం  ఇవ్వలేదు. ప్రైవేట్‌ స్కూళ్లు మెరుగైన విద్యను అందిçస్తున్నామంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందుకే విద్యా రంగంలో ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం ఉండాలి. మేం దీన్నే కోరుతున్నాం. ఈఎస్‌ఐలోనూ పలు సంస్కరణలు రావాలి. 
– దినేశ్‌ అగర్వాల్, ఇండియామార్ట్‌.కామ్‌ వ్యవస్థాపకుడు

వన్‌ నేషన్‌–వన్‌ రేట్‌..
జీఎస్టీ వచ్చినా వర్తకుల్లో గందరగోళం నెలకొంది. పన్నుల సరళీకరణ జరగాలి. వన్‌ నేషన్‌–వన్‌ రేట్‌ కింద దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఒకే పన్ను రేటు అమలు కావాలి. రెడీమేడ్‌ దుస్తుల విషయంలో రూ.1,000 లోపు ధర ఉంటే 5 శాతం, రూ.1,000 దాటితే 12 శాతం జీఎస్టీ ఉంది. తయారీదారుగా విభిన్న పన్నులతో మార్జిన్‌ స్ట్రక్చర్‌ను మార్చాల్సి వస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా నగదు కొరత ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ సమస్య పెరిగింది. మనది సంప్రదాయ వ్యాపార విధానం. ఒకేరోజు మార్కెట్‌ అంతా ఆన్‌లైన్‌కు మళ్లడం కష్టం. వ్యాపారాలు వృద్ధి కావాలంటే లిక్విడిటీ కూడా పెరగాలి.
– జొన్నలగడ్డ కృష్ణమోహన్, రెడీమేడ్స్‌ ట్రేడర్‌.


కంపెనీలకు సులభ రుణాలు..
మధ్య, చిన్న, సూక్ష్మతరహా కంపెనీలకు బ్యాంకు రుణాల లభ్యత కష్టంగా ఉంది. మంచి ప్రాజెక్టుతో వచ్చే ఔత్సాహిక వ్యాపారులకు తగినంత రుణమిచ్చి  ప్రోత్సహించాలి. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్న స్టార్టప్స్‌కు సముచిత స్థానం కల్పించి నిధులు సమకూర్చాలి. పెద్ద నోట్ల రద్దతో వ్యాపారులకు సమస్యలు రెట్టింపయ్యాయి. జీఎస్టీ రిటర్నులు ఇంకా సరళం కావాలి. విదేశాల నుంచి చేసుకునే ముడిసరుకు దిగుమతులపై పన్నులు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు మరిన్ని ఉద్దీపనలు ప్రకటించాలి. 
– గుండుబోయిన శ్రీకాంత్, ప్రమోటర్, క్రివి ఫ్యాబ్స్‌

టెలికం, ఐటీ, బ్రాడ్‌కాస్టింగ్‌లను కలపాలి..
టెలికం, ఐటీ, బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ మధ్య  వ్యత్యాసం చెరిగిపోయింది. అందుకే ఈ రంగాల అనుసంధానం అవసరం. బడ్జెట్‌లో ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఉపాధి పెరుగుతుంది. టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్స్‌ ఏర్పాటు కోసం డీటీహెచ్, కేబుల్‌ సహా టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఆర్గనైజేషన్స్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి. అందువల్ల సాఫ్ట్‌వేర్, టెలికం రంగాల్లాగే బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీల విలీనాల్లోనూ నష్టాలను క్యారీఫార్వర్డ్‌ చేసుకునే వెసులుబాటునివ్వాలి. 
–పునీత్‌ గోయెంకా, ఐబీఎఫ్‌ ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement