మార్పును ఆహ్వానిద్దాం..! | Sakshi Special Story About liquid assets | Sakshi
Sakshi News home page

మార్పును ఆహ్వానిద్దాం..!

Published Mon, Jun 14 2021 4:29 AM | Last Updated on Mon, Jun 14 2021 4:29 AM

Sakshi Special Story About liquid assets

జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేసింది కరోనా. మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాయుతంగా నిర్వహించే వారు పెద్దగా ఇబ్బంది పడలేదు.. కానీ, ముందుచూపు లేని వారికి జీవితం పట్ల వాస్తవం బోధపడింది. నగదు కోసం కష్టాలు ఎదుర్కొన్న వారు ఎందరో.. ఆస్తులు ఉన్నా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం అన్ని వేళలా సాధ్యపడుతుందని భావించలేము.

దీంతో అప్పుతో గట్టెక్కే ప్రయత్నం చేసిన వారున్నారు. విల్లు రాయకుండా అకాల మరణం పాలైతే.. వారి పేరిట ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యులు వెంటనే పొందలేని పరిస్థితి. డబ్బుకు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి మన ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవాలన్న సందేశాన్ని ఈ మహమ్మారి ఇచ్చింది. మార్పు దిశగా అడుగులు వేసేందుకు ఏం చేయాలన్నదే ఈ వారం ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ కథనం.

అన్ని కాలాల్లోనూ అందుబాటులో కొంత మేర నిధిని ఉంచుకోవడం అవసరమని కరోనా మహమ్మారితో ఎక్కువ మందికి తెలిసొచ్చింది. చాలా మంది అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలేనన్న ఆలోచనతో ఉంటారు. కానీ, ముందు సన్నద్ధత లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగదుకు బదులు ఆస్తులు ఉండొచ్చు. కానీ, అవసరం ఏర్పడితే వెంటనే ఆదుకునేది నగదు బ్యాలన్సే. ఇల్లు లేదా ఫ్లాట్‌ లేదా ప్లాట్‌ ఉందనుకోండి. వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కష్టసాధ్యం. అందుకే లిక్విడ్‌ ఆస్తుల రూపంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల సౌలభ్యం ఉండాలి. అలా అని లిక్విడిటీ లేని ఆస్తులు సమకూర్చుకోవద్దని కాదు.

అవసరమైనంత మేర లిక్విడ్‌ ఆస్తులను సైతం కలిగి ఉండాలి. ‘‘పొదుపు చేస్తున్న మొత్తాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్‌ ఆప్షన్‌ లేని (కాల వ్యవధి మధ్యలో పెట్టుబడులను వెనక్కి తీసుకోలేనివి) సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అవసరం ఏర్పడినప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని వీఆర్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ సీఈవో వివేక్‌ రెగే పేర్కొన్నారు.  కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంతకంటే ఎక్కువే సమకూర్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు, ఆదాయాలకు దీర్ఘకాలం పాటు సమస్యలు ఏర్పడిన తరుణంలో కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలని ఫిన్‌ఫిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలైటిక్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ప్రబ్లీన్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. ఉద్యోగ భద్రత అంతగా లేని వారికి ఎక్కువ నిధి అవసరం పడుతుంది.

ఒకే బుట్టలో పెట్టొద్దు
ఉదాహరణకు నెలసరి అవసరాలకు రూ.50,000 కావాలనుకోండి.. ఏడాది కోసం రూ.6లక్షలు అవసరమవుతాయి. అప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. నెలసరి అవసరాలంటే ఈఎంఐలు, సిప్‌లు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఖర్చులు అన్నీ కలసి ఉండాలి.

► మొదటి రెండు నెలల అవసరాల కోసం రూ.లక్షను స్వీప్‌ఇన్‌ ఎఫ్‌డీ ఖాతాలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడిన వెంటనే నిమిషాల్లోనే ఈ నిధిని వెనక్కి తీసుకోగల వెసులుబాటు ఉంటుంది.
► తదుపరి నాలుగు నెలల అవసరాలకు గాను రూ.2లక్షలు తీసుకెళ్లి డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఆర్బిట్రేజ్, లిక్విడ్‌ ఫండ్స్‌ను ఇందుకు పరిశీలించొచ్చు. ఈ పెట్టుబడులను నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెనక్కి పొందొచ్చు.
► తదుపరి ఆరు నెలల కోసం రూ.3లక్షలను ఇతర డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ఊహల ఆధారంగా అడుగులు వేయొద్దు
‘ఇప్పుడు కొనేద్దాం.. తర్వాత చెల్లించొచ్చు’ ఈ విధానం మంచిది కాదు. వేతన కోతలు, ఆశావహంగా లేని వ్యాపారాలు.. ఫలితంగా భారీగా అప్పులు చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. కొందరు అయితే రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే.. మరికొందరు ఉన్నదంతా అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల సామర్థ్యానికి మించి అప్పులు చేసి చాలా మంది ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది చేసే సాధారణ తప్పిదం.. భవిష్యత్తులో పెరిగే ఆదాయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో ముందుగానే రుణంగా తీసుకోవడం. 2బీహెచ్‌కే ఇల్లు చాలినా.. కొన్ని రూ.లక్షలు అదనంగా చెల్లిస్తే 3బీహెచ్‌కే వస్తుంటే దానివైపే మొగ్గుచూపే వారే ఎక్కువ.

తక్కువ బడ్జెట్‌లో వస్తున్న కారుకు బదులు ఖరీదైన సెడాన్‌ను ఈఎంఐలపై కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తు ఆదాయంపై అంచనాలతో తçప్పటడుగులు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలతో జీవన వ్యయం పెరిగిపోయి.. మళ్లీ వెనక్కి దిగిరాలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నెలవారీ చేతికి అందే నికర ఆదాయం నుంచి చేసే రుణ చెల్లింపులు (ఈఎంఐలు) 50% మించకూడదన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన సూత్రం. రుణం వస్తుంది కదా అని తీసుకోవద్దు. దీనివల్ల రుణఊబిలోకి చిక్కుకుపోవచ్చు. ఫలితంగా భవిష్యత్తు లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడుల్లో రాజీ పడా ల్సి వస్తుంది. సాధారణంగా జీవన వ్యయాలు అన్నవి ఏటేటా పెరుగుతుంటాయి. దీనికి తగ్గ ట్టు ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. లేదంటే ఈఎంఐలకు చేసే చెల్లింపులతో జీవన వ్యయాల్లో రాజీపడాల్సి వస్తుంది.

హెల్త్‌ ప్లాన్‌ ఒక్కటీ సరిపోదు..
సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాల వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే బిల్లులు భారంగా అనిపించకపోవచ్చు. కానీ, పెద్ద ప్రమాదాలు, క్లిష్టమైన అనారోగ్య సమస్యలు.. కరోనా వంటి వైరస్‌ల బారిన పడిన సందర్భాల్లో బిల్లు ఎంతొస్తుందన్నది ఊహించలేము. అందుకే నామమాత్రపు కవరేజీతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం అన్ని విధాలా రక్షణ అనిపించుకోదు. పైగా బీమా ప్లాన్‌లో కవర్‌ కానివి చాలా ఉంటాయి. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం వినియోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇలా ఎన్నింటికో కంపెనీలు చెల్లింపులు చేయకుండా కోతలు విధిస్తున్నాయి. కోపేమెంట్, సబ్‌లిమిట్స్‌ వంటి షరతులున్న ప్లాన్‌లు తీసుకున్న వారు బిల్లులో నిర్ణీత మొత్తాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో సొంత నిధుల నుంచి చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే హెల్త్‌ప్లాన్‌కు అదనంగా కొంత వైద్యనిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.

విల్లు రాయాలి.. సవరించాలి
కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎందరినో కరోనా ఉన్నట్టుండి బలితీసుకుంది. అటువంటి కుటుంబాలు చాలా వరకు నిధుల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు తమ పేరిట ఆస్తులకు భవిష్యత్తు హక్కుదారులను విల్లు రూపంలో చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆయా ఆస్తులను వారసులు చట్టపరంగా తమ పేరిట మార్చుకుంటే కానీ విక్రయించుకోలేరు. విల్లు లేని సందర్భాల్లో వారసులమని, హక్కుదారులమని నిరూపించుకున్న తర్వాతే వాటి విక్రయానికి వీలవుతుంది. అందుకే కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి విల్లు రాసుకుని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పెట్టుబడులకు నామినీగా ఒకరిని నమోదు చేయించుకోవాలి. ‘‘ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులను ప్రస్తావిస్తూ విల్లు రాసుకోవాలి. అదనపు ఆస్తులు సమకూరిన ప్రతీ సందర్భంలోనూ విల్లును అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వారసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు తరుణ్‌ బిరానీ సూచించారు. అలాగే, కుటుంబంలో బాధ్యతాయుతమైన ఒకరికి డాక్యుమెంట్లు, అన్ని ఆధారాలను ఎక్కడ ఉంచేదీ తెలియజేయాలని పేర్కొన్నారు.

రుణాలకు రక్షణ ఉండాల్సిందే
కుటుంబం కోసం అప్పులు చేసి అకాల మరణం చెందితే.. అప్పుడు కుటుంబ సభ్యులపై చెల్లింపుల భారం పడుతుంది. మీ సామర్థ్యాల పరిధిలోనే రుణాలు తీసుకోవడమే కాదు.. ఆ రుణ విలువకు సరిపడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ రుణం పూర్తిగా చెల్లించకుండానే రుణగ్రహీత మరణించినట్టయితే.. బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం రుణాన్ని తీరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులపై అదనపు ఆర్థిక భారం పడదు. సాధారణంగా గృహరుణాలకు టర్మ్‌ కవర్‌ అనుసంధానంగా వస్తుంది. అదే వ్యక్తిగత రుణాల్లో ఇలా ఉండదు.

కనుక వ్యక్తిగత రుణానికి సమాన మొత్తంతో బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. అప్పటికే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఉంది కదా అనుకోవద్దు. కుటుంబ జీవన అవసరాల కోసం రక్షణగా తీసుకునేదే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. వ్యక్తి మరణం తర్వాత టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రూపంలో వచ్చేదంతా రుణ చెల్లింపులకే పోతే ఆ కుటుంబం ఎలా జీవించాలి? అందుకే ప్రతీ రుణానికి విడిగా టర్మ్‌ కవర్‌ తప్పకుండా ఉండాలి. రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్‌ ప్లాన్లలో.. తగ్గుతున్న రుణానికి అనుగుణంగా  కవరేజీ కూడా క్షీణిస్తుంటుంది. అయితే రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్‌ ప్లాన్ల ప్రీమియం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. కనుక రుణం ఇచ్చే సంస్థ నుంచి కాకుండా విడిగా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన.

విదేశీ ఈక్విటీలు..
ఈక్విటీ ఇన్వెస్టర్లలో 99 శాతానికి పైగా దేశీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారే ఉన్నారు. ఆర్థికంగా రానున్న రోజుల్లో భారత్‌ దిగ్గజంగా మారుతుందన్న అంచనాలతో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పేమీ కాదు. అయితే, నూరు శాతం పెట్టుబడులను దేశీయంగానే ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి బదులు వైవిధ్యం కోసం కొంత మొత్తాన్ని విదేశీ ఈక్విటీలకూ కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూసేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరి అస్సెట్‌ అలోకేషన్‌లో విదేశీ ఈక్విటీలకూ చోటు ఉండాలన్నది సూచన. ఎందుకంటే భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లలో ఎక్కువగా అస్థిరతలు ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈక్విటీలు బలంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

కరోనా రెండు దశల తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు భారీ ప్యాకేజీల మద్దతుతో వేగంగా కోలుకుంటున్నాయి. ‘‘ప్రతికూల పరిస్థితులను వివిధ దేశాలు భిన్నంగా ఎదుర్కొంటాయన్నది కరోనా చూపించింది. భౌగోళికంగా వైవిధ్యం అన్నది (వివిధ దేశాల ఈక్విటీల్లో పెట్టుబడులు) దేశం ఆధారిత రిస్క్‌లను తట్టుకునేందుకు అవసరం. పైగా ఒక్కో దేశానికి భిన్నమైన బలాలు, అవకాశాల దృష్యా అక్కడి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. తమ పెట్టుబడుల్లో 15–20 శాతం నిధులను విదేశీ ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఇది రాత్రికి రాత్రి కాకుండా క్రమంగా నిర్ణీత కాల వ్యవధిలో చేసుకోవాలి’’ అని గ్లోబలైజ్‌ ఇండియా సీఈవో విరాజ్‌నందా సూచించారు. అయితే ఆయా అంశాల్లో నిపుణుల సలహా అవసరం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement