సంపాదించామా.. ఖర్చు చేశామా.. చాలా మంది ధోరణి ఇదే. ఆర్థిక సూత్రాలకు ఇది పూర్తి విరుద్ధం. ఆర్థిక భద్రతనూ ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఇది. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. సంక్షోభ సమయాల్లో ఆర్థిక సన్నద్ధత అవసరాన్ని మరోసారి అందరికీ తెలియజేసింది. ఆ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు, ఎదురైన సవాళ్లను పరిశీలిస్తే ఎన్నో ఆర్థిక అంశాలు, పాఠాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అత్యవసర నిధి ఎంతో అవసరమని ఇది తెలియజేసింది. అంతేకాదు, ప్రభుత్వపరమైన లేదా కనీసం వ్యక్తిగతమైన ఆరోగ్య బీమా రక్షణ అయినా ఉండి తీరాల్సిన అవసరాన్ని అర్థమయ్యేలా చేసింది. గతేడాది సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు...
రిస్క్ నిర్వహణ
కరోనా నామ సంవత్సరం తెలియజేసిన మరో పాఠం రిస్క్ నిర్వహణ. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఇది కూడా ఒక అంశం. ‘‘నా కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేయించేందుకు సరిపడా బీమా కవరేజీ ఉందా?.. నేను అకాల మరణం చెందితే నాపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు ఉన్నాయా?’’ అని ప్రతీ ఒక్కరు ప్రశ్నించుకోవాలి. సామాన్య, మధ్యతరగతి వాసులు అందరూ ఈ తరహా రిస్క్‌లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికాయుతంగా అనుసరించాలని కరోనా తెలియజేసింది. ఎందుకంటే హెల్త్ కవరేజీ లేని వారు చికిత్స కోసం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితిని చూశాము. ఎటువంటి లైఫ్ కవరేజీ లేకుండా కరోనాతో మరణించిన వారి కుటుంబాల కష్టాలు చూశాము. బీమా రక్షణ ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. అయితే రిస్క్ అంటే ఇదే కాదు.. పెట్టుబడుల నిర్వహణలోనూ రిస్క్ ఉంటుంది. గుడ్లన్నింటినీ తీసుకువెళ్లి ఒకే బాక్స్‌లో పెట్టడం ఎలా మంచిది కాదో.. పెట్టుబడులు అన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. తమ సామర్థ్యం, అవసరాలకు తగిన రిస్క్ నిర్వహణ ప్రణాళిక అవసరం. సంక్షోభం ఏదైనా కానీ, తమ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్న విధంగా అస్సెట్ అలొకేషన్‌ను కొనసాగించాలి.
ఆర్థిక క్రమశిక్షణ అవసరం
ఆర్థిక క్రమశిక్షణ ఏంటో కూడా కరోనా మహమ్మారి తెలియజేసింది. ప్రయాణాలు, బయట ఆహార పదార్థాలపై ఆంక్షలు అమలయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు రెండు నెలలకుపైగా తెరుచుకోలేదు. సినిమా థియేటర్ల తలుపులు తెరుచుకునేందుకు ఆరు నెలలకు పైనే సమయం పట్టింది. దీంతో వీటి రూపేణా తాము ఎంత ఖర్చు చేస్తున్నామన్న ఆలోచన కలిగింది. పొదుపులను పెంచుకుని, ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలనూ నేర్పింది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకునే నమ్మకాన్ని, మనో ధైర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారు, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్న వారు కరోనా సంక్షోభంలో ధైర్యంగానే ఉన్నారు. ముఖ్యంగా ఆదాయాన్ని ఏ రూపంలో ఎలా ఖర్చు చేయాలన్న విషయమై మరింత అవగాహనకు కరోనా దారి చూపిందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ అనుభవ పాఠాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితం ఒనగూరుతుంది.
బాండ్లకూ ఉంది సత్తా..
ఈక్విటీల ర్యాలీ చూసి, బాండ్ల రాబడుల పట్ల నిర్లిప్తత తగదని 2020 ఉదంతం తెలియజేస్తోంది. కరోనా సవాళ్లతో ఈక్విటీల పతనం మొదలైంది. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లు మంచి ర్యాలీ చేశాయి. దీనివల్ల బాండ్లలో లాభాల స్వీకరణతో స్టాక్స్‌ను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసుకోవడం ద్వారా రెండు విధాల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొత్తం ఈక్విటీల్లోనే కాకుండా.. కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది.
విల్లు ప్రాధాన్యం..
ప్రతీ కుటుంబ పెద్దకు విల్లు అవసరం. అకాల మరణానికి గురైతే.. ఆస్తుల పంపకాన్ని విల్లు ఎంతో సులభతరం చేస్తుంది. నామినేషన్ అన్నది సంబంధిత ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసే అర్హతనిస్తుంది. కానీ, విల్లు హక్కునిస్తుంది. బీమా ప్లాన్‌కు ఒకరిని నామినీగా ఏర్పాటు చేసి.. బీమా ప్లాన్ క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో దాన్ని ఎవరికి ఏ మేరకు పంపకం చేయాలన్నది విల్లులో పేర్కొంటే.. చట్ట ప్రకారం అదే నెరవేరుతుంది.
రిటైర్మెంట్ ప్రాధాన్యం..
కోట్ల మంది భారతీయుల రిటైర్మెంట్‌పై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. కరోనా కారణంగా గతంలో వేసుకున్న ప్రణాళికతో పోలిస్తే రిటైర్మెంట్ నిధి ఏర్పాటుకు తాము ఎక్కువ కాలమే కష్టపడాల్సి వస్తుందని ఇంత మంది భావిస్తున్నట్టు ఓ సర్వే రూపంలో తెలిసింది. కారణం.. కరోనా మాదిరి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వీరు తగిన సన్నద్ధులుగా లేకపోవడం వల్ల.. రిటైర్మెంట్ సేవింగ్‌ను సగటున మూడేళ్లపాటు పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘విలువ’ తెలిసొచ్చింది
కాలం విలువను కూడా కరోనా తెలియజేసింది. కుటుంబ సభ్యులతో ఎంత సమయం వెచ్చించాలి, అందులోని ప్రయోజనాలు, కుటుంబ అవసరాల కోసం ఏ మేరకు కష్టపడాలి, ముఖ్యమైనవి ఏవి? అనవసరాలు ఏవి ఈ విషయాలన్నీ చాలా మందికి అవగాహనలోకి వచ్చాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఆర్థిక విజయంలో మొదటి సూత్రం.
మూడు బకెట్ల విధానం
ప్రతీ ఇన్వెస్టర్‌కు కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తగిన పెట్టుబడుల ప్రణాళిక, విధానం అవసరమని కరోనాతో అర్థమయ్యింది. అందుకే ప్రతీ ఇన్వెస్టర్‌కు మూడు బకెట్ల విధానం అవసరం. ఇందులో మొదటి బకెట్ అన్నది ఏడాది, రెండేళ్ల కాల అవసరాల కోసం ఉద్దేశించినది. లిక్విడ్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఉంచుకోవాలి. మధ్యకాలిక బకెట్‌ను రెండు నుంచి ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం పక్కన పెట్టుకోవాలి. ఈ నిధిని మీడియం టర్మ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక అవసరాల కోసం మూడో బకెట్‌ను కేటాయించుకోవాలి. ఈ నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఇటువంటి విధానంతో ఏ కాలంలో ఎదురయ్యే అవసరాలను అయినా సులభంగా అధిగమించొచ్చు.
సంక్షోభాలే సంపదకు దారులు..
అందరూ భయపడుతున్న వేళే పెట్టుబడులకు అనుకూల సమయం అన్నది మరోసారి 2020 రుజువు చేసింది. గతేడాది మార్చిలో ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్ల ఆందోళనతో కూడిన అమ్మకాలతో కుప్పకూలాయి. నిఫ్టీ 7,500 మార్క్ వరకు పడిపోయింది. కానీ, ఏప్రిల్ నుంచి మళ్లీ రికవరీ మొదలుపెట్టి దాదాపు తొమ్మిది నెలల్లో రెట్టింపయింది. అందరూ భయపడుతున్న సమయంలో ధైర్యం చేసి కొన్న కొద్ది మంది పెట్టుబడి రెట్టింపు, రెండింతలు అయ్యింది. మార్కెట్లు పడిపోతున్న సమయంలో అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు.. వాటిని విక్రయించకుండా, ధైర్యంగా నిలబడిన వారి మొహాల్లోనూ ఇప్పుడు లాభాల కాంతులు కనిపిస్తాయి. చారిత్రకంగా చూస్తే మార్కెట్లు 30 శాతానికి మించి పడిపోయిన ప్రతీసారీ పెట్టుబడులపై మంచి లాభాల వర్షం కురిపించాయి.
రీబ్యాలన్స్ అవసరం
ఇక అస్సెట్ అలోకేషన్‌లో భాగంగా రీబ్యాలన్స్ కూడా ముఖ్యం. గతేడాది మార్చిలో స్టాక్స్ పెట్టుబడుల విలువ పడిపోయి, డెట్ పోర్ట్‌ఫోలియో, బంగారం విలువ పెరిగి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీలకు 50% అని నిర్ణయించుకుని ఉంటే, మార్కెట్లు పడిపోవడం కారణంగా ఈక్విటీల విలువ 30 శాతానికి తగ్గి ఉంటుంది. దాంతో ఇతర బకెట్ల నుంచి ఈక్విటీలకు మరో 20 శాతాన్ని భర్తీ చేసుకోవాలి.
సంక్షోభాలను తట్టుకునేదెలా?
Published Mon, Feb 1 2021 12:15 AM | Last Updated on Mon, Feb 1 2021 4:08 AM
Comments
Please login to add a commentAdd a comment