Liquid fund
-
లిక్విడ్ ఫండ్స్ రాబడులు తగ్గాయెందుకు?
ఇటీవలి కాలంలో లిక్విడ్ ఫండ్స్ మంచి పనితీరు చూపించడం లేదు ఎందుకని? ఈ కారణంగా స్వల్పకాలం కోసం నా పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్ నుంచి ఇతర విభాగాలకు బదిలీ చేసుకోవాలా? – భాస్కర్ మీ పెట్టుబడులను మరో విభాగానికి తరలించడం ద్వారా అధిక రాబడులు సమకూర్చుకోవడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. తక్కువ రిస్క్, ఊహించిన రాబడులు పొందాలంటే లిక్విడ్ ఫండ్స్ అనుకూలం. లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం అధిక మెచ్యూరిటీ కాలంతో ఉంటాయి. కనుక కొంత అదనపు రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు క్షీణించడమే లిక్విడ్ ఫండ్స్‌లో రాబడులు తగ్గడానికి కారణం. ద్రవ్యోల్బణం వచ్చే కొన్ని నెలల్లో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దాంతో రాబడులు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ ఫండ్స్ మంచి పనితీరు చూపిస్తాయి. 91 రోజులకు గడువు తీరే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలానికే గడువు తీరడం వల్ల మళ్లీ పెట్టుబడులకు ఆ నిధి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కాస్త మెరుగైన రాబడులను ఇవ్వగలవు. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం డెట్ ఫండ్స్ కంటే హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుందా? ఎటువంటి హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి? – కృష్ణకుమార్ త్రిపాఠి ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుని, ఉపసంహరణ 4–6 శాతం మధ్య లేదా 7 శాతం ఉంటుందని అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం నయం. ఎందుకంటే అదే డెట్ ఫండ్స్ అయితే మీరు ఉపసంహరించుకున్నంత మేరే రాబడి కూడా ఉంటుంది. కనుక ద్రవ్యోల్బణం మించి మెరుగైన రాబడులు డెట్ ఫండ్స్ ఇస్తాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అందుకు హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. అప్పుడు ఉపసంహరణ రేటు 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. లేదంటే మీ రిస్క్ సామర్థ్యం అనుమతిస్తే ఈక్విటీ ఫథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడే మీరు ఉపసంహరించుకునే మొత్తానికంటే మీ పెట్టుబడి అధికంగా వృద్ధి చెందుతుంటుంది. క్రమానుగత పెట్టుబడి ఉపసంహరణ కోసం పెద్దగా రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లకు హైబ్రిడ్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే, మంచి హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం కూడా కీలకం అవుతుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ఫండ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ మధ్య సరైన ఎంకిక కీలకమన్నది మర్చిపోవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బ్యాలన్స్డ్ ఫండ్ లేదా అగ్రెస్సివ్ ఫండ్ అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరే ప్రవర్తిస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరతలకు దూరంగా ఉండలేవు. అయినప్పటికీ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే మరింత నిలకడగా వీటి పనితీరు ఉంటుంది. పెట్టుబడి నుంచి 4–5 శాతం మేర ఉపసంహరించుకోవాలంటే అగ్రెస్సివ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంతకుమించి వెనక్కి తీసుకోవాలంటే అప్పుడు బ్యాలన్స్డ్ ఫండ్‌కు వెళ్లాలి. అంతకంటే మరింతగా 6.5–7 శాతం మేర వెనక్కి తీసుకోవాలంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌కు వెళ్లాలి. ఎందుకంటే అస్థిరతలు ఎక్కువగా ఉండే (అధిక ఈక్విటీ కేటాయింపులు) చోటు నుంచి ఎక్కువ మొత్తంలో వెనక్కి తీసుకునేట్టు అయితే.. మార్కెట్ల పతనాల సమయంలో పెట్టుబడి తగ్గిపోతుంటుంది. అందుకనే ఉపసంహరణ రేటు ఎక్కువగా ఉంటే కన్జర్వేటివ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం సరైనది. ఇక పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అందుకని ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనంలో పెట్టుకోవాలి. మిగిలిన మొత్తాన్ని హైబ్రిడ్ లేదా ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏడాది తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని మొదలు పెట్టుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
మార్పును ఆహ్వానిద్దాం..!
జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేసింది కరోనా. మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాయుతంగా నిర్వహించే వారు పెద్దగా ఇబ్బంది పడలేదు.. కానీ, ముందుచూపు లేని వారికి జీవితం పట్ల వాస్తవం బోధపడింది. నగదు కోసం కష్టాలు ఎదుర్కొన్న వారు ఎందరో.. ఆస్తులు ఉన్నా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం అన్ని వేళలా సాధ్యపడుతుందని భావించలేము. దీంతో అప్పుతో గట్టెక్కే ప్రయత్నం చేసిన వారున్నారు. విల్లు రాయకుండా అకాల మరణం పాలైతే.. వారి పేరిట ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యులు వెంటనే పొందలేని పరిస్థితి. డబ్బుకు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి మన ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవాలన్న సందేశాన్ని ఈ మహమ్మారి ఇచ్చింది. మార్పు దిశగా అడుగులు వేసేందుకు ఏం చేయాలన్నదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. అన్ని కాలాల్లోనూ అందుబాటులో కొంత మేర నిధిని ఉంచుకోవడం అవసరమని కరోనా మహమ్మారితో ఎక్కువ మందికి తెలిసొచ్చింది. చాలా మంది అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలేనన్న ఆలోచనతో ఉంటారు. కానీ, ముందు సన్నద్ధత లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగదుకు బదులు ఆస్తులు ఉండొచ్చు. కానీ, అవసరం ఏర్పడితే వెంటనే ఆదుకునేది నగదు బ్యాలన్సే. ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉందనుకోండి. వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కష్టసాధ్యం. అందుకే లిక్విడ్ ఆస్తుల రూపంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల సౌలభ్యం ఉండాలి. అలా అని లిక్విడిటీ లేని ఆస్తులు సమకూర్చుకోవద్దని కాదు. అవసరమైనంత మేర లిక్విడ్ ఆస్తులను సైతం కలిగి ఉండాలి. ‘‘పొదుపు చేస్తున్న మొత్తాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్ ఆప్షన్ లేని (కాల వ్యవధి మధ్యలో పెట్టుబడులను వెనక్కి తీసుకోలేనివి) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవసరం ఏర్పడినప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని వీఆర్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో వివేక్ రెగే పేర్కొన్నారు. కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంతకంటే ఎక్కువే సమకూర్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు, ఆదాయాలకు దీర్ఘకాలం పాటు సమస్యలు ఏర్పడిన తరుణంలో కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ సూచించారు. ఉద్యోగ భద్రత అంతగా లేని వారికి ఎక్కువ నిధి అవసరం పడుతుంది. ఒకే బుట్టలో పెట్టొద్దు ఉదాహరణకు నెలసరి అవసరాలకు రూ.50,000 కావాలనుకోండి.. ఏడాది కోసం రూ.6లక్షలు అవసరమవుతాయి. అప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. నెలసరి అవసరాలంటే ఈఎంఐలు, సిప్‌లు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఖర్చులు అన్నీ కలసి ఉండాలి. ► మొదటి రెండు నెలల అవసరాల కోసం రూ.లక్షను స్వీప్ఇన్ ఎఫ్డీ ఖాతాలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడిన వెంటనే నిమిషాల్లోనే ఈ నిధిని వెనక్కి తీసుకోగల వెసులుబాటు ఉంటుంది. ► తదుపరి నాలుగు నెలల అవసరాలకు గాను రూ.2లక్షలు తీసుకెళ్లి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రేజ్, లిక్విడ్ ఫండ్స్‌ను ఇందుకు పరిశీలించొచ్చు. ఈ పెట్టుబడులను నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెనక్కి పొందొచ్చు. ► తదుపరి ఆరు నెలల కోసం రూ.3లక్షలను ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఊహల ఆధారంగా అడుగులు వేయొద్దు ‘ఇప్పుడు కొనేద్దాం.. తర్వాత చెల్లించొచ్చు’ ఈ విధానం మంచిది కాదు. వేతన కోతలు, ఆశావహంగా లేని వ్యాపారాలు.. ఫలితంగా భారీగా అప్పులు చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. కొందరు అయితే రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే.. మరికొందరు ఉన్నదంతా అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల సామర్థ్యానికి మించి అప్పులు చేసి చాలా మంది ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది చేసే సాధారణ తప్పిదం.. భవిష్యత్తులో పెరిగే ఆదాయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో ముందుగానే రుణంగా తీసుకోవడం. 2బీహెచ్‌కే ఇల్లు చాలినా.. కొన్ని రూ.లక్షలు అదనంగా చెల్లిస్తే 3బీహెచ్‌కే వస్తుంటే దానివైపే మొగ్గుచూపే వారే ఎక్కువ. తక్కువ బడ్జెట్లో వస్తున్న కారుకు బదులు ఖరీదైన సెడాన్‌ను ఈఎంఐలపై కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తు ఆదాయంపై అంచనాలతో తçప్పటడుగులు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలతో జీవన వ్యయం పెరిగిపోయి.. మళ్లీ వెనక్కి దిగిరాలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నెలవారీ చేతికి అందే నికర ఆదాయం నుంచి చేసే రుణ చెల్లింపులు (ఈఎంఐలు) 50% మించకూడదన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన సూత్రం. రుణం వస్తుంది కదా అని తీసుకోవద్దు. దీనివల్ల రుణఊబిలోకి చిక్కుకుపోవచ్చు. ఫలితంగా భవిష్యత్తు లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడుల్లో రాజీ పడా ల్సి వస్తుంది. సాధారణంగా జీవన వ్యయాలు అన్నవి ఏటేటా పెరుగుతుంటాయి. దీనికి తగ్గ ట్టు ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. లేదంటే ఈఎంఐలకు చేసే చెల్లింపులతో జీవన వ్యయాల్లో రాజీపడాల్సి వస్తుంది. హెల్త్ ప్లాన్ ఒక్కటీ సరిపోదు.. సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాల వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే బిల్లులు భారంగా అనిపించకపోవచ్చు. కానీ, పెద్ద ప్రమాదాలు, క్లిష్టమైన అనారోగ్య సమస్యలు.. కరోనా వంటి వైరస్ల బారిన పడిన సందర్భాల్లో బిల్లు ఎంతొస్తుందన్నది ఊహించలేము. అందుకే నామమాత్రపు కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్ని విధాలా రక్షణ అనిపించుకోదు. పైగా బీమా ప్లాన్‌లో కవర్ కానివి చాలా ఉంటాయి. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం వినియోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇలా ఎన్నింటికో కంపెనీలు చెల్లింపులు చేయకుండా కోతలు విధిస్తున్నాయి. కోపేమెంట్, సబ్‌లిమిట్స్ వంటి షరతులున్న ప్లాన్లు తీసుకున్న వారు బిల్లులో నిర్ణీత మొత్తాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో సొంత నిధుల నుంచి చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే హెల్త్‌ప్లాన్‌కు అదనంగా కొంత వైద్యనిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. విల్లు రాయాలి.. సవరించాలి కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎందరినో కరోనా ఉన్నట్టుండి బలితీసుకుంది. అటువంటి కుటుంబాలు చాలా వరకు నిధుల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు తమ పేరిట ఆస్తులకు భవిష్యత్తు హక్కుదారులను విల్లు రూపంలో చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆయా ఆస్తులను వారసులు చట్టపరంగా తమ పేరిట మార్చుకుంటే కానీ విక్రయించుకోలేరు. విల్లు లేని సందర్భాల్లో వారసులమని, హక్కుదారులమని నిరూపించుకున్న తర్వాతే వాటి విక్రయానికి వీలవుతుంది. అందుకే కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి విల్లు రాసుకుని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పెట్టుబడులకు నామినీగా ఒకరిని నమోదు చేయించుకోవాలి. ‘‘ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులను ప్రస్తావిస్తూ విల్లు రాసుకోవాలి. అదనపు ఆస్తులు సమకూరిన ప్రతీ సందర్భంలోనూ విల్లును అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వారసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ సూచించారు. అలాగే, కుటుంబంలో బాధ్యతాయుతమైన ఒకరికి డాక్యుమెంట్లు, అన్ని ఆధారాలను ఎక్కడ ఉంచేదీ తెలియజేయాలని పేర్కొన్నారు. రుణాలకు రక్షణ ఉండాల్సిందే కుటుంబం కోసం అప్పులు చేసి అకాల మరణం చెందితే.. అప్పుడు కుటుంబ సభ్యులపై చెల్లింపుల భారం పడుతుంది. మీ సామర్థ్యాల పరిధిలోనే రుణాలు తీసుకోవడమే కాదు.. ఆ రుణ విలువకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ రుణం పూర్తిగా చెల్లించకుండానే రుణగ్రహీత మరణించినట్టయితే.. బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం రుణాన్ని తీరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులపై అదనపు ఆర్థిక భారం పడదు. సాధారణంగా గృహరుణాలకు టర్మ్ కవర్ అనుసంధానంగా వస్తుంది. అదే వ్యక్తిగత రుణాల్లో ఇలా ఉండదు. కనుక వ్యక్తిగత రుణానికి సమాన మొత్తంతో బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. అప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకోవద్దు. కుటుంబ జీవన అవసరాల కోసం రక్షణగా తీసుకునేదే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. వ్యక్తి మరణం తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేదంతా రుణ చెల్లింపులకే పోతే ఆ కుటుంబం ఎలా జీవించాలి? అందుకే ప్రతీ రుణానికి విడిగా టర్మ్ కవర్ తప్పకుండా ఉండాలి. రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్లలో.. తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ కూడా క్షీణిస్తుంటుంది. అయితే రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్ల ప్రీమియం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. కనుక రుణం ఇచ్చే సంస్థ నుంచి కాకుండా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. విదేశీ ఈక్విటీలు.. ఈక్విటీ ఇన్వెస్టర్లలో 99 శాతానికి పైగా దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే ఉన్నారు. ఆర్థికంగా రానున్న రోజుల్లో భారత్ దిగ్గజంగా మారుతుందన్న అంచనాలతో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు. అయితే, నూరు శాతం పెట్టుబడులను దేశీయంగానే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు వైవిధ్యం కోసం కొంత మొత్తాన్ని విదేశీ ఈక్విటీలకూ కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూసేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరి అస్సెట్ అలోకేషన్‌లో విదేశీ ఈక్విటీలకూ చోటు ఉండాలన్నది సూచన. ఎందుకంటే భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో ఎక్కువగా అస్థిరతలు ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈక్విటీలు బలంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా రెండు దశల తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు భారీ ప్యాకేజీల మద్దతుతో వేగంగా కోలుకుంటున్నాయి. ‘‘ప్రతికూల పరిస్థితులను వివిధ దేశాలు భిన్నంగా ఎదుర్కొంటాయన్నది కరోనా చూపించింది. భౌగోళికంగా వైవిధ్యం అన్నది (వివిధ దేశాల ఈక్విటీల్లో పెట్టుబడులు) దేశం ఆధారిత రిస్క్‌లను తట్టుకునేందుకు అవసరం. పైగా ఒక్కో దేశానికి భిన్నమైన బలాలు, అవకాశాల దృష్యా అక్కడి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. తమ పెట్టుబడుల్లో 15–20 శాతం నిధులను విదేశీ ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఇది రాత్రికి రాత్రి కాకుండా క్రమంగా నిర్ణీత కాల వ్యవధిలో చేసుకోవాలి’’ అని గ్లోబలైజ్ ఇండియా సీఈవో విరాజ్నందా సూచించారు. అయితే ఆయా అంశాల్లో నిపుణుల సలహా అవసరం. -
లిక్విడ్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?
నాకు ఇటీవలే బోనస్ వచ్చింది. మరో నాలుగు నెలల దాకా ఈ మొత్తం నాకు అవసరం లేదు. నాలుగు నెలల కాలానికైతే లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు సలహా ఇస్తున్నారు. మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? – స్రవంతి, విజయవాడ లిక్విడ్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, టర్మ్ డిపాజిట్లు వంటి మనీ మార్కెట్ సాధనాల్లో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణంగా 91 రోజుల మెచ్యూరిటీ ఉన్న సాధనాల్లో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. నెల రోజుల నుంచి మూడు నెలల కాలానికి ఇన్వెస్టర్లు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సాధారణంగా ఈ లిక్విడ్ ఫండ్స్ 6.56 శాతం వరకూ రాబడిని ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో అత్యంత తక్కువ నష్టభయం, తక్కువ ఒడిదుడుకులు ఈ లిక్విడ్ ఫండ్స్‌లోనే ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ ఎంచుకునే విషయంలో మీకు ఎవరి సలహా అవసరం లేదు. మంచి లిక్విడ్ ఫండ్‌కు, సాధారణ లిక్విడ్ ఫండ్‌కు రాబడుల్లో పెద్దగా తేడా ఉండదు. అందుకని, గత ఏడాది లేదా రెండేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకొని లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. రాబడులను కరెక్ట్‌గా అంచనా వేయలేము. కానీ వ్యయాలపై అవగాహన ఉంటుంది. కాబట్టి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌ను ఎంచుకోండి. సాధారణంగా తక్కువ వ్యయాలున్న ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి. నేను ఈ మధ్య ఉద్యోగంలో చేరాను. నాకు వచ్చే జీతంలో ఖర్చులు పోను రూ. 10,000 వరకూ మిగులుతాయి. దీంట్లో రూ.8,000 మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత మా చెల్లి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పటివరకూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తాన్ని చెల్లి పెళ్లి కోసం వినియోగించాలనేది నా ఆలోచన. దీని కోసం మూడు మ్యూచువల్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. అవి.. డీఎస్పీ బ్లాక్‌రాక్ మైక్రో క్యాప్‌ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీప్లయిర్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్.. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – సికిందర్, హైదరాబాద్ తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్స్‌తో మొదలు పెట్టండి. ఇక గత ఏడాది పనితీరు ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేయడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాగే 2–3 ఏళ్ల పనితీరు ఆధారంగా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేయడం సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 2008–2013 కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి స్వల్ప లాభాలే వచ్చాయి. ఐదేళ్లు అంతకు మించిన కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, 1 లేదా 2 మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మైక్రోక్యాప్ ఫండ్స్ మంచి రాబడులే ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో 30–40 శాతం వరకూ తగ్గవచ్చు. దీంతో తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు నిరాశే మిగులుతుంది. ఆర్థిక ప్రణాళికలు అన్నీ తల్లకిందులవుతాయి. నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ఇటీవల తగ్గింది. ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ఫోర్స్టార్ నుంచి త్రీస్టార్కు పడిపోయింది. ఈ కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. సరైన సూచన ఇవ్వండి. – అరవింద్, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ రేటింగ్ తగ్గడం పట్ల ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ రేటింగ్ ఫైవ్ స్టార్ నుంచి ఫోర్ స్టార్‌కు పడిపోయిందనుకోండి. ఈ విషయం పట్టించుకోవలసిన పనిలేదు. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ రేటింగ్ ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు పడిపోయిందనుకోండి. మీ ఫండ్ పనితీరుపై ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని గమనించండి. మీరు ఫండ్ నుంచి వైదొలగడానికి రేటింగ్ పడిపోవడం ఒక్కటే ప్రాధాన్యతా అంశంగా పరిగణించవద్దు. రేటింగ్ పడిపోయినప్పుడు ఫండ్ వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీ ఫండ్ వయస్సు నాలుగు లేదా ఐదేళ్లు అనుకోండి. ఈ ఫండ్ రేటింగ్ ఫైవ్ స్టార్ నుంచి ఫోర్ట్ స్టార్‌కు, ఆ తర్వాత ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు ఏడాది కాలంలోనే రేటింగ్ పడిపోతే, అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగే విషయాన్ని ఆలోచించాలి. మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో ఫండ్ పనితీరును మదింపు చేసి, మరీ అధ్వానంగా ఉంటే అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ గత 15–20 సంవత్సరాల్లో మంచి పనితీరు కనబరిచి, గత ఏడాది కాలంలో ఆ ఫండ్ రేటింగ్ తగ్గిందనుకోండి. ఈ ఫండ్ పనితీరును 1–2 ఏళ్ల పాటు గమనించాలి. ఈ కాలంలో ఫండ్ పనితీరు మెరుగుపడకపోతే, అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మరోవైపు ఫండ్ మేనేజర్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ నుంచి వైదొలగాడా ? లేదా అదే ఫండ్‌లో కొనసాగుతున్నాడా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫండ్ నుంచి బయటకు రావాలా ? వద్దా ? అనే విషయాన్ని ఆలోచించాలి కానీ, రేటింగ్ తగ్గిందన్న ఒకే కారణంతో వైదొలగడం సరైన నిర్ణయం కాదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎన్పీఎస్ ఉపసంహరణపై ట్యాక్స్ ఉంటుందా?
నేను రూ.5 లక్షలు లిక్విడ్ ఫండ్‌లో ఏడాది పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎంత మొత్తం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌గా నేను చెల్లించాల్సి ఉంటుంది? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పించుకునే మార్గాలున్నాయా? - రవి కుమార్, విజయవాడ మీరు స్వల్ప కాలానికే లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక. వాటిపై వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాదరబందీ ఏమీ లేకుండా ఉండాలంటే, లిక్విడ్ స్కీమ్‌కు సంబంధించి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద లాభాలను డివిడెండ్‌గా పంపిణి చేస్తారు. ఫలితంగా ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు. డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీయే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్-డీడీటీ(28.8 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు మీ రాబడులపై ప్రభావం పడుతుంది. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి ఆందోళన చెందక్కర లేదు. అయితే 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉండే వాళ్లకు డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ఉపసంహరణలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎన్పీఎస్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తానికి పన్నులు చెల్లిం చాల్సి ఉంటుందా? లేకుంటే క్యాపిటల్ గెయిన్స్ మీదనే పన్ను చెల్లించాల్సి ఉంటుందా? యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ చార్జీ ఉంటుందా ? - సరస్వతి, కడప మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ను ఉపసంహరించుకుంటే, మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ 40 శాతం యాన్యుటీ వల్ల మీకు నెలా నెలా క్రమం తప్పకుండా కొంత పింఛన్ వస్తుంది. ఇక 60 శాతం మొత్తాన్ని ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.ఒకేసారి విత్‌డ్రా చేసుకున్న ఈ మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 60 సంవత్సరాలకు ముందే ఎన్పీఎస్ను ఉపసంహరించుకోవాలంటే, 80 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు యాన్యుటీని కొనుగోలు చేసినప్పటి రేట్ల ఆధారంగా ఈ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది నుంచి ఐసీఐసీఐ ప్రు లైఫ్-మ్యాగ్జిమైజర్ ఫైవ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.50,000 చొప్పున రెండు వార్షిక ప్రీమియంలు చెల్లించాను. ఈ ఫండ్ వాల్యూ ప్రస్తుతం రూ.92,000గా ఉంది. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేకుంటే ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? - అర్జున్ రావు, వరంగల్ యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు పేరుకు తగ్గట్టుగా బీమా, ఇన్వెస్ట్మెంట్స్ కలగలసిన ఇన్వెస్ట్మెంట్ పాలసీలు. ఈ పాలసీలు స్వల్పమైన బీమా కవర్‌ను మాత్రమే అందిస్తాయి. ఈ పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి కనుక రాబడులు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. మీ పాలసీలో అధిక చార్జీలు కారణంగా మీరు చెల్లించిన ప్రీమియం కంటే కూడా మీ పాలసీ విలువ తక్కువగా ఉంది. ఈ తరహా పాలసీల నుంచి వైదొలగడమే ఉత్తమం. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపకండి. ఇవి రెండూ పూర్తిగా వేర్వేరు. బీమా కోసమైతే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 32 సంవత్సరాలు. మూడేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి రాబడులు ఇస్తాయని మిత్రులంటున్నారు. డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే, పన్ను భారం కూడా ఉండదని చెబుతున్నారు. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా లేక న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? - నందిని, హైదరాబాద్ కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీలలో 65%, మిగిలినది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్ కొంత ఒడిదుడుకులకు గురవుతాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోనక్కరలేదు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిపైగా కొనసాగిస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మీరు చెల్లించాల్సిన పనిలేదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డివిడెండ్ ఆప్షన్ సరైనది కాదని చెప్పవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్ పనితీరు ఎలా ఉం టుందో తెలియదు కదా. అప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్