నాకు ఇటీవలే బోనస్ వచ్చింది. మరో నాలుగు నెలల దాకా ఈ మొత్తం నాకు అవసరం లేదు. నాలుగు నెలల కాలానికైతే లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు సలహా ఇస్తున్నారు. మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? – స్రవంతి, విజయవాడ
లిక్విడ్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, టర్మ్ డిపాజిట్లు వంటి మనీ మార్కెట్ సాధనాల్లో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణంగా 91 రోజుల మెచ్యూరిటీ ఉన్న సాధనాల్లో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. నెల రోజుల నుంచి మూడు నెలల కాలానికి ఇన్వెస్టర్లు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
సాధారణంగా ఈ లిక్విడ్ ఫండ్స్ 6.56 శాతం వరకూ రాబడిని ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో అత్యంత తక్కువ నష్టభయం, తక్కువ ఒడిదుడుకులు ఈ లిక్విడ్ ఫండ్స్‌లోనే ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ ఎంచుకునే విషయంలో మీకు ఎవరి సలహా అవసరం లేదు. మంచి లిక్విడ్ ఫండ్‌కు, సాధారణ లిక్విడ్ ఫండ్‌కు రాబడుల్లో పెద్దగా తేడా ఉండదు. అందుకని, గత ఏడాది లేదా రెండేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకొని లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకోండి.
తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. రాబడులను కరెక్ట్‌గా అంచనా వేయలేము. కానీ వ్యయాలపై అవగాహన ఉంటుంది. కాబట్టి తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌ను ఎంచుకోండి. సాధారణంగా తక్కువ వ్యయాలున్న ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి.
నేను ఈ మధ్య ఉద్యోగంలో చేరాను. నాకు వచ్చే జీతంలో ఖర్చులు పోను రూ. 10,000 వరకూ మిగులుతాయి. దీంట్లో రూ.8,000 మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత మా చెల్లి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పటివరకూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తాన్ని చెల్లి పెళ్లి కోసం వినియోగించాలనేది నా ఆలోచన. దీని కోసం మూడు మ్యూచువల్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. అవి.. డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మైక్రో క్యాప్‌ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ మల్టీప్లయిర్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్.. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ?
– సికిందర్, హైదరాబాద్
తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ముందుగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ముందుగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌తో మొదలు పెట్టండి. ఇక గత ఏడాది పనితీరు ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేయడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాగే 2–3 ఏళ్ల పనితీరు ఆధారంగా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేయడం సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
2008–2013 కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి స్వల్ప లాభాలే వచ్చాయి. ఐదేళ్లు అంతకు మించిన కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, 1 లేదా 2 మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మైక్రోక్యాప్ ఫండ్స్ మంచి రాబడులే ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో 30–40 శాతం వరకూ తగ్గవచ్చు. దీంతో తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు నిరాశే మిగులుతుంది. ఆర్థిక ప్రణాళికలు అన్నీ తల్లకిందులవుతాయి.
నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ఇటీవల తగ్గింది. ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ఫోర్‌స్టార్ నుంచి త్రీస్టార్‌కు పడిపోయింది. ఈ కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. సరైన సూచన ఇవ్వండి. – అరవింద్, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్ రేటింగ్ తగ్గడం పట్ల ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ రేటింగ్ ఫైవ్ స్టార్ నుంచి ఫోర్ స్టార్‌కు పడిపోయిందనుకోండి. ఈ విషయం పట్టించుకోవలసిన పనిలేదు. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ రేటింగ్ ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు పడిపోయిందనుకోండి. మీ ఫండ్ పనితీరుపై ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని గమనించండి. మీరు ఫండ్ నుంచి వైదొలగడానికి రేటింగ్ పడిపోవడం ఒక్కటే ప్రాధాన్యతా అంశంగా పరిగణించవద్దు. రేటింగ్ పడిపోయినప్పుడు ఫండ్ వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు మీ ఫండ్ వయస్సు నాలుగు లేదా ఐదేళ్లు అనుకోండి. ఈ ఫండ్ రేటింగ్ ఫైవ్ స్టార్ నుంచి ఫోర్ట్ స్టార్‌కు, ఆ తర్వాత ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు ఏడాది కాలంలోనే రేటింగ్ పడిపోతే, అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగే విషయాన్ని ఆలోచించాలి. మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో ఫండ్ పనితీరును మదింపు చేసి, మరీ అధ్వానంగా ఉంటే అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ గత 15–20 సంవత్సరాల్లో మంచి పనితీరు కనబరిచి, గత ఏడాది కాలంలో ఆ ఫండ్ రేటింగ్ తగ్గిందనుకోండి.
ఈ ఫండ్ పనితీరును 1–2 ఏళ్ల పాటు గమనించాలి. ఈ కాలంలో ఫండ్ పనితీరు మెరుగుపడకపోతే, అప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మరోవైపు ఫండ్ మేనేజర్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ నుంచి వైదొలగాడా ? లేదా అదే ఫండ్‌లో కొనసాగుతున్నాడా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫండ్ నుంచి బయటకు రావాలా ? వద్దా ? అనే విషయాన్ని ఆలోచించాలి కానీ, రేటింగ్ తగ్గిందన్న ఒకే కారణంతో వైదొలగడం సరైన నిర్ణయం కాదు.
- ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment