How long will your EPF account earn interest after retirement - Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ తరువాత పీఎఫ్‌ వడ్డీ ఎన్ని సంవత్సరాలు జమవుతుందంటే?

Published Mon, Jul 17 2023 7:31 AM | Last Updated on Mon, Jul 17 2023 8:57 AM

when i am retiring how many years it will add pf interest - Sakshi

నా వయసు 59 ఏళ్లు. నేను పదవీ విరమణ తీసుకున్నప్పటికీ, నా పీఎఫ్‌ ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోలేదు. అయినప్పటికీ నా పీఎఫ్‌ బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుందా?  – నానీ పార్థీ

పదవీ విరమణ అనంతరం, పీఎఫ్‌ ఖాతాకు వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి చందాలు జమ అవ్వకపోతే, అప్పుడు ఆ ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారిపోతుంది. అక్కడి నుంచి ఇక వడ్డీ జమ అవ్వడం కూడా నిలిచిపోతుంది. అంటే పదవీ విరమరణ తర్వాత మూడేళ్ల పాటే వడ్డీ జమ అవుతుంది. పదవీ విరమణ అనంతరం భవిష్యనిధి ఖాతాలోని బ్యాలన్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు.

ఐదేళ్లు సర్వీసు నిండిన తర్వాత ఉపసంహరించుకునే పీఎఫ్‌ బ్యాలన్స్‌ మొత్తంపై పన్ను ఉండకపోవడం అదనపు ప్రయోజనం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, రిటైర్మెంట్‌ తర్వాత పీఎఫ్‌ బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోకపోతే, జమయ్యే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. కనుక పీఎఫ్‌ బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుని, మీ లక్ష్యాలు, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిది.

ఏదైనా ఒక కంపెనీ షేరు ముఖ విలువ రూపాయి ఉంటే దాన్ని ఎలా విభజిస్తారు? వారి ముందున్న ఆప్షన్లు ఏంటి?  – అరుణ్‌ పాలస్‌
 
మన దేశంలో ఒక షేరు కనిష్ట ముఖ విలువ రూ.1గా ఉంది. దీని ప్రకారం ఒక షేరు ముఖ విలువ రూపాయిగా ఉంటే, దాన్ని విభజించడానికి అవకాశం ఉండదు. ఒక కంపెనీ ముఖ విలువను విభజించడం వెనుక ఉద్దేశ్యం ఆయా కంపెనీ షేర్ల లిక్విడిటీని (అందుబాటు) పెంచడమే. షేరు ధరను విభజించడం వల్ల మూలధనంలో ఎలాంటి మార్పు ఉండదు. కనుక ఒక ఇన్వెస్టర్‌గా ముఖ విలువను విభజించే విషయంలో పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే, నష్టపోయేదీ ఉండదు.

ఉదాహరణకు ఎక్స్‌వైజెడ్‌ అనే కంపెనీ షేరు మార్కెట్‌ ధర రూ.100 ఉందనుకుందాం. మార్కెట్లో 50,000 వేల షేర్లు ఉన్నాయి. మిస్టర్‌ ఏ రూ.5,000 పెట్టి ఈ కంపెనీలో 50 షేర్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కంపెనీ 5:1 స్టాక్‌ స్లి్పట్‌ను ప్రకటించింది. అంటే ప్రతి ఒక్క షేరు ఐదు షేర్లుగా విభజించనున్నారు. విభజన తర్వాత మిస్టర్‌ ఏ వద్దనున్న 50 షేర్ల స్థానంలో 250 షేర్లు జమ అవుతాయి. అప్పటి వరకు రూ.10గా ఉన్న ముఖ విలువ రూ.2గా మారుతుంది.

(ఇదీ చదవండి: 7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్‌ త‍్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్‌ ఉన్నాయా?)

విభజన తర్వాత షేరు మార్కెట్‌ ధర కూడా రూ.100 నుంచి రూ.20కు సవరణ అవుతుంది. 250 షేర్లు, రూ.20 చొప్పున వాటి మొత్తం మార్కెట్‌ విలువలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒక కంపెనీ షేరు ముఖ విలువను విభజిస్తుందా, లేదా? అన్నది ముఖ్యం కాదు. స్టాక్‌ ముఖ విలువ విభజన అంచనా ఆధారంగా పెట్టుబడులు పెట్టకూడదు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తగినంత సమయం, కృషి అవసరం. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు వ్యాపార నమూనా, ఆర్థిక మూలాలు, యాజమాన్యం సమర్థత, కార్యకలాపాలను నైతికంగా నిర్వహిస్తున్నారా? వృద్ధి అవకాశాలు, వ్యాల్యూషన్‌ సహేతుక స్థాయిలోనే ఉందా? పోటీ కంపెనీలతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించగలదా? తదితర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం సూచనీయం.


ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement