నేను మరో 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను. రూ.2.5 - 3 కోట్ల బడ్జెట్‌లో ఇల్లు కొనాలన్నది నా ఆలోచన. గృహ రుణం తీసుకునే విషయంలో నా వంతు డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవాలి కదా. వచ్చే 10 - 15 ఏళ్లలో గృహ రుణం డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? టాటా స్మాల్ క్యాప్ లేదా, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ ఫండ్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ పథకాలు నా డౌన్ పేమెంట్‌కు అనుకూలమైనా..? – ఆదిత్య బి
10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేద్దామన్న నిర్ణయం సరైన దారిలోనే ఉంది. మీ పెట్టుబడులు వృద్ధి చెందడానికి సరిపడా సమయం మీ చేతుల్లో ఉంది. ఈ కాలంలో ఈక్విటీ పథకాల నుంచి సహేతుక రాబడులు వస్తాయని ఆశించొచ్చు. తద్వారా గృహ కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొనుగోలు చేద్దామనుకుంటున్న ఇంటి బడ్జెట్ రూ.2.5 - 3 కోట్లు అని చెప్పారు కదా. ఇది నేటి ధరల ఆధారంగా అంచనా వేశారా? అయితే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. అప్పుడు 10 - 15 ఏళ్ల తర్వాత ఇల్లు కొనుగోలుకు అసలు ఎంత అవుతుందన్న వాస్తవ అంచనాకు రావడానికి ఉంటుంది.
ఆ తర్వాత నెలవారీ సిప్ మొత్తాన్ని రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి నుంచి రెండు వరకు మిడ్, స్మాల్‌క్యాప్ పథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే మిడ్, స్మాల్‌క్యాప్ అన్నవి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 25 - 30 శాతం మించి ఉండకూడదు. మీ పోర్ట్‌ఫోలియోలో ఏ పథకాలు ఉండాలన్నది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఈక్విటీ పెట్టుబడుల్లో మీకున్న అనుభవం కీలకంగా మారతాయి. ఇల్లు కొనుగోలు చేయడం అన్నది ఆర్థికంగా అతిపెద్ద నిర్ణయం. కనుక చాలా జాగ్రత్తగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలా కేసుల్లో నివాసం ఉండేట్టు అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం న్యాయమే అవుతుంది.
గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే రుణ బాధ్యత. అలాగే, గృహ రుణానికి మీరు చెల్లించే ఈఎంఐ అన్నది నెలవారీ నికరంగా చేతికి అందుకునే మొత్తంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. పెట్టుబడి కోణంలో అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాబోదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ తక్కువ. కొనుగోలు, విక్రయం వేగంగా సాధ్యపడదు. డబ్బులు కావాలంటే వెంటనే అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అధిక విలువ కలిగిన ఇంటిని అమ్మడం అంత సులభమైన విషయం కాదు.
నా వయసు 59 ఏళ్లు. వచ్చే నెలలో పదవీ విరమణ తీసుకోబుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత నా వద్ద రూ.కోటి నిధి ఉంటుంది. నెలవారీ ఖర్చులు రూ.లక్ష వరకు ఉంటాయి. కనుక నా వద్ద ఉండే రూ.కోటిని నెలనెలా రూ.లక్ష వచ్చేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. – భానుప్రకాశ్
మీరు రూ.కోటి పెట్టుబడిపై ప్రతి నెలా రూ.లక్ష ఆదాయం కోరుకుంటున్నారు. అంటే వార్షిక రాబడి 12 శాతం ఉండాలి. ఈ స్థాయి రాబడి అన్నది ఈక్విటీలలో, అదీ దీర్ఘకాలంలోనే (ఏడేళ్లకు మించి) సాధ్యపడతాయి. ఏటా ఇదే స్థాయిలో ఈక్విటీలు కూడా రాబడులు ఇస్తాయని గ్యారంటీ ఉండదు. అలాగే, ఒక ఏడాదిలో వచ్చిన రాబడులన్నింటినీ వినియోగించుకోకూడదు. మీ పెట్టుబడి నిధి ద్రవ్యోల్బణ ప్రభావం (5 - 6 శాతం) మేర ఏటా వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే కావాల్సినంత మొత్తం సమకూర్చుకోగలరు.
ఉదాహరణకు మీ రూ.కోటి నిధి.. ఐదు, ఏడేళ్ల తర్వాత కూడా అక్కడే ఉంటే.. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల అప్పటికి నెలవారీగా రూ.లక్ష ఆదాయం సరిపోదు. పెరిగే ధరలకు అనుగుణంగా మీకు మరింత మొత్తం ఆదాయం వచ్చేంత నిధి ఉండాలి. కనుక మీ పెట్టుబడిపై వచ్చే రాబడిలో కొంత మొత్తాన్ని అక్కడే వృద్ధి చెందేందుకు వీలుగా ఉంచేయాలి. మీ విషయంలో మీరు ఆశించే రాబడి రేటు ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకోండి. మీరు కోరుకున్నట్టు ప్రతి నెలా రూ.లక్ష చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే.. మీ వద్దనున్న పొదుపు నిధి కూడా తగ్గిపోతుంది.
ద్రవ్యోల్బణం అధిగమించి నిధి వృద్ధి చెందాలంటే.. పెట్టుబడి నుంచి రాబడి 6 శాతానికి మించి ఉపసంహరించుకోకూడదు. అంటే రూ.కోటి నిధిపై ఏటా రూ.6 లక్షల వరకే ఉపసంహరించుకోవాలి. పెట్టుబడి నిధిలో మూడింట ఒక వంతును ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన రెండు భాగాలకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు (డెట్) కేటాయించుకోవాలి. ప్రభుత్వ హామీ ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవో ఎంఐఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎం వీవీవై) పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో పీఎం వీవీవై, ఎస్‌సీఎస్‌ఎస్ 8 శాతం రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో పీఎం వీవీవై ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ఈ పథకాలకు కేటాయించుకోగా మిగిలే మొత్తాన్ని అధిక నాణ్యత కలిగిన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ధీరేంద్ర కుమార్
సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment