ఎన్‌పీఎస్ ఉపసంహరణపై ట్యాక్స్ ఉంటుందా? | Is Tax apply on withdrawal of NPS ? | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్ ఉపసంహరణపై ట్యాక్స్ ఉంటుందా?

Published Mon, Dec 14 2015 9:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

Is Tax apply on withdrawal of NPS ?

నేను రూ.5 లక్షలు లిక్విడ్ ఫండ్‌లో ఏడాది పాటు  ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎంత మొత్తం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌గా నేను చెల్లించాల్సి ఉంటుంది? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పించుకునే మార్గాలున్నాయా?
 - రవి కుమార్, విజయవాడ
 
 మీరు స్వల్ప కాలానికే లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక. వాటిపై వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  ఈ బాదరబందీ ఏమీ లేకుండా ఉండాలంటే, లిక్విడ్ స్కీమ్‌కు సంబంధించి డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద లాభాలను డివిడెండ్‌గా పంపిణి చేస్తారు. ఫలితంగా ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు.
 
 డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీయే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్-డీడీటీ(28.8 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు మీ రాబడులపై ప్రభావం పడుతుంది. డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి ఆందోళన చెందక్కర లేదు. అయితే 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉండే వాళ్లకు డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
 
 నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) ఉపసంహరణలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎన్‌పీఎస్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తానికి పన్నులు చెల్లిం చాల్సి ఉంటుందా? లేకుంటే క్యాపిటల్ గెయిన్స్ మీదనే పన్ను చెల్లించాల్సి ఉంటుందా? యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ చార్జీ  ఉంటుందా ?
 - సరస్వతి, కడప
  మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్‌పీఎస్‌ను ఉపసంహరించుకుంటే, మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ 40 శాతం యాన్యుటీ వల్ల మీకు నెలా నెలా క్రమం తప్పకుండా కొంత పింఛన్ వస్తుంది. ఇక 60 శాతం మొత్తాన్ని ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.ఒకేసారి విత్‌డ్రా చేసుకున్న ఈ మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను  చెల్లించాల్సి ఉంటుంది.
 
 ఒకవేళ మీరు 60 సంవత్సరాలకు ముందే ఎన్‌పీఎస్‌ను ఉపసంహరించుకోవాలంటే, 80 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు యాన్యుటీని కొనుగోలు చేసినప్పటి రేట్ల ఆధారంగా ఈ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
 
 గత ఏడాది నుంచి ఐసీఐసీఐ ప్రు లైఫ్-మ్యాగ్జిమైజర్ ఫైవ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.50,000 చొప్పున రెండు వార్షిక ప్రీమియంలు చెల్లించాను. ఈ ఫండ్ వాల్యూ ప్రస్తుతం రూ.92,000గా ఉంది. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేకుంటే ఈ పాలసీని సరెండర్ చేయమంటారా?               
 - అర్జున్ రావు, వరంగల్
 
 యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు పేరుకు తగ్గట్టుగా బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలసిన ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు. ఈ పాలసీలు స్వల్పమైన బీమా కవర్‌ను మాత్రమే అందిస్తాయి. ఈ పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి కనుక రాబడులు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. మీ పాలసీలో అధిక చార్జీలు కారణంగా మీరు చెల్లించిన ప్రీమియం కంటే కూడా మీ పాలసీ విలువ తక్కువగా ఉంది. ఈ తరహా పాలసీల నుంచి వైదొలగడమే ఉత్తమం. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపకండి. ఇవి రెండూ పూర్తిగా వేర్వేరు. బీమా కోసమైతే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
 
 నా వయస్సు 32 సంవత్సరాలు. మూడేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి రాబడులు ఇస్తాయని మిత్రులంటున్నారు. డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తే, పన్ను భారం కూడా ఉండదని చెబుతున్నారు. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా లేక న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ?   
 - నందిని, హైదరాబాద్
 
కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీలలో 65%, మిగిలినది డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్ కొంత ఒడిదుడుకులకు గురవుతాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోనక్కరలేదు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిపైగా కొనసాగిస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మీరు చెల్లించాల్సిన పనిలేదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డివిడెండ్ ఆప్షన్ సరైనది కాదని చెప్పవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్ పనితీరు ఎలా ఉం టుందో తెలియదు కదా. అప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
 - ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement