టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్..?
నా ప్రజా భవిష్యనిధి ఖాతా(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)ను రెండు సార్లు పొడిగించాను. ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ములు విత్‌డ్రా చేసుకుంటే నేను ఏమైనా పన్నులు చెల్లించాలా ?
- సీతారామ్, వైజాగ్
పొడిగించిన తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించక్కర లేదు. పన్నుల పరంగా చూస్తే పీపీఎఫ్ ఖాతాను ‘మూడు మినహాయింపులు’(ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఈఈఈ)గా పరిగణిస్తారు. అంటే పీపీఎఫ్ ఖాతాకు మూడు దశల్లో మినహాయింపు లభిస్తుందని అర్థం.
పెట్టుబడులు పెట్టేటప్పుడు. వడ్డీ విలువలపై, పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు.. ఇలా ఈ మూడు దశల్లో పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడులకు రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పెట్టుబడుల వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక పీపీఎఫ్ సొమ్ములను ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఖాతాను పొడిగించినా కూడా విత్‌డ్రాయల్ అప్పుడు ఎలాంటి పన్ను పోటు ఉండదు.
డెట్ ఫండ్ అంటే ఏమిటి ?
- ప్రసన్న, విజయవాడ
బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రిస్క్ తక్కువ. రాబడులు కూడా తక్కువగానే ఉంటాయి. పెట్టుబడి వ్యూహాలు, ఇన్వెస్ట్ చేసే బాండ్ల రకాలను బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రకాలు ఉన్నాయి. మీడియమ్, లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ఫ్లాన్‌లు.. ఇలా రకరకాల డెట్ ఫండ్‌లు ఉన్నాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి 3, 4 ఏళ్ల క్రితం కొన్ని బీమా పాలసీలు తీసుకున్నాను. అవి సంతృప్తికరమైన రాబడులివ్వడం లేదు. వీటిలో కొనసాగమంటారా? వైదొలగమంటారా?
- కమలాకర్, గుంటూరు
పెట్టుబడులు లక్ష్యంగా జీవిత బీమా పాలసీలు ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, మదుపునకు వేర్వేరుగా పెట్టుబడులు పెట్టాలి. రెండింటిని కలగలపకూడదు. మీకేదైనా జరిగితే ఆర్థిక భరోసా కల్పించడమే బీమా పాలసీల లక్ష్యంగా ఉండాలి. జీవిత బీమాపాలసీల విషయానికొస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే సరైనది. రాబడులనిచ్చే యులిప్‌లు, మనీ-బ్యాక్, ఎండోమెంట్ వంటి బీమాపాలసీలు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా, బీమాపరంగా మంచి ప్రయోజనాలనిస్తాయని ఏజెంట్లు ఊరిస్తారు. కానీ అవి మీకు తగిన జీవిత బీమాను, అలాగే తగినంత రాబడులను ఇవ్వలేవు. పైగా అధిక ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి హైబ్రిడ్ ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పాలసీల నుంచి వైదొలగడం మంచిది. తగినంత బీమా ఉన్న టర్మ్ ప్లాన్‌ను తీసుకోండి. మీ మదుపు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలి? పాలసీబజార్, కోవర్‌ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా తీసుకోవాలా లేక కంపెనీ వెబ్‌సైట్ నుంచి నేరుగా తీసుకోవాలా?
- నందిని, హైదరాబాద్
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. బీమా సంస్థ వెబ్‌సైట్ నుంచే నేరుగా పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆ బీమా సంస్థ ఏజెంట్ ద్వారా కూడా పాలసీ తీసుకోవచ్చు. లేదంటే పాలసీబజార్‌డాట్‌కామ్, కోవర్ ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఈ పాలసీలు తీసుకోవడం ఇప్పుడు అత్యంత సులభం, పైగా రెండు కీలకమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొదటిది వివిధ కంపెనీలు ఆఫర్ చేసే వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూసే వెసులుబాటు ఉంటుంది.
ఇలా పోల్చి చూసి, ఏది మంచి ప్లాన్ అది ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ పాలసీలు చౌకగా లభిస్తాయి. ఈ ఆన్‌లైన్ పాలసీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. అగ్రిగేటర్ వెబ్‌సైట్‌లో పాలసీలను పోల్చిచూసుకుని, మీ అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోండి. తర్వాత ఆ బీమా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ పాలసీని తీసుకోండి. చెల్లించాల్సిన ప్రీమియమ్, క్లెయిమ్స్ రేషియో వంటి అంశాల ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేముందు పాలసీ ఫీచర్లను, షరతులను,తప్పనిసరిగా చదవాలి.
పన్ను ఆదా కోసం యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాను. గత కొన్నేళ్లుగా ఈ ఫండ్ మంచి రాబడులను ఇచ్చింది. పన్ను ఆదా కోసం కాకుండా మంచి రాబడుల కోసం 3-5 ఏళ్ల కాలానికి ఈ ఫండ్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా?
- క్రాంతి, కరీంనగర్
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లు పన్ను ప్రయోజనాలనే కాకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులను కూడా ఇస్తాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మాదిరిగా వీటి పనితీరు ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫలితంగా వీటిల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగే క్రమశిక్షణ ఇన్వెస్టర్లకు అలవడుతుంది. ఈ ఫండ్‌లోనే మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మరో ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌ను పరిశీలించండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటికి మించి ఫండ్స్ ఉండడం ఎప్పుడూ మంచిదే.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్