పిల్లల భవితకు ఆర్థిక భరోసా
♦ ముందు నుంచే దీర్ఘకాల ప్రణాళిక ముఖ్యం
♦ విద్యావసరాలు తీర్చటానికి చైల్డ్ ప్లాన్స్
తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషాల కోసం, వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం అనేక ప్రణాళికలు వేస్తారు. నీల్సన్ సంస్థ నిర్వహించిన ‘లైఫ్– 2015’ సర్వే ప్రకారం .. అత్యధిక శాతం మంది జీవిత బీమా తీసుకోవడానికి ముఖ్య కారణం వారి పిల్లల భవిష్యత్‌పై ఆలోచనే. మరో అధ్యయనం ప్రకారం చైల్డ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన స్థాయి 99 శాతం మేర ఉంటోంది. కానీ తీసుకునే వారి సంఖ్య కేవలం 16 శాతంగాను.. తీసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య 12 శాతంగా మాత్రమే ఉంటోంది. అంటే చైల్డ్ ప్లాన్‌పై అవగాహన ఉన్నవారి సంఖ్యకు .. నిజంగానే తీసుకుంటున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేదు. సరే.. దాన్నలా పక్కన పెడితే.. అనేకానేక ఆర్థిక సాధనాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు పిల్లల బీమా పథకాలు, జీవిత బీమా పథకాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఎందుకున్నాయి?
ఎందుకంటే పిల్లలు తగిన ప్రొఫెషన్‌లో చేరేందుకు కీలకమైన చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశమే.
పెరిగిపోతున్న విద్యా వ్యయాలు, ప్రొఫెషనల్ విద్య ఖర్చులు, సింపుల్ పెళ్లి ఖర్చులన్నింటికి కూడా చైల్డ్ ప్లాన్ సమగ్రమైన కవరేజి ఇస్తుంది. ఇది బేసికల్‌గా పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ఒక పొదుపు సాధనం. ఒకవేళ పేరెంట్‌కి ఏదైనా అనుకోనిది జరిగినా.. లబ్ధిదారుకు నిర్దేశిత సమ్ అష్యూర్డ్ మొత్తం తక్షణం లభిస్తుంది. పైగా తదుపరి ప్రీమియంలు కట్టకపోయినా.. (వెయివర్ ఆఫ్ ప్రీమియం) పాలసీ మాత్రం మెచ్యూరిటీ దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రీమియంలను.. పాలసీ మెచ్యూర్ అయ్యే దాకా బీమా కంపెనీయే పాలసీదారు తరఫున కడుతుంది. ఇలాంటి పథకాల్లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడి పెడుతూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో పొదుపు మొత్తాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. పిల్లల చదువు లక్ష్యాలు, ప్రొఫెషనల్ కెరియర్, మొత్తమ్మీద ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడతాయి. పిల్లల చదువుకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధుల్లో కొంత మొత్తం చేతికి అందుకునే విధంగా ఈ ప్లాన్స్‌లో కొంత వెసులుబాటూ ఉంటుంది.
ప్రణాళిక ఇలా...
పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలను సాధ్యమైనంత ముందునుంచే ప్రారంభించాలి. పెట్టుబడులను వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి. నిర్ధిష్ట కాలవ్యవధుల్లో కొంత కొంత మొత్తం పొదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిధి పోగవుతుంది. అలాగే కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు (అసలుకు వడ్డీ కూడా తోడవుతూ పెరుగుతూ ఉంటుంది కనుక). చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని..
♦ నిర్ధిష్ట మొత్తం పోగవడానికి అవసరమైన కాల వ్యవధి
♦ సదరు డబ్బు ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది
♦ నిధిని సమకూర్చుకోవడానికి ఎంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది.
మరీ భయం వద్దు...
స్థూలంగా.. చదువు ఖర్చులు రేసుగుర్రాల్లా పరుగెట్టేస్తున్నాయి. అయితే మరీ భయపడకుండా.. ఒక సముచిత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఎంత మొత్తం డబ్బు అవసరమవుతుందో లెక్కేసేటప్పుడు.. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. వీలైనంత త్వరగా పొదుపు చేయడం మొదలుపెట్టండి. ఎంత నిధి సమకూర్చుకున్నా ఆఖర్లో ఎంతో కొంత తగ్గవచ్చేమో. కానీ విద్యా రుణాల్లాంటివి తీసుకుని దాన్ని భర్తీ చేయొచ్చు. అయితే అన్ని వేళలూ ఒకే రకంగా ఉండవు కదా. ఒకవేళ ఇంటిపెద్దకేదైనా జరిగినా.. ఆర్థిక స్థితి గాడి తప్పినా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది కనుక.. పూర్తిగా రుణాల మీదే ఆధారపడటం శ్రేయస్కరం కాదు. కేవలం ప్రణాళికలతో నే కాకుండా.. వివేచనతో సత్వరం అమలు చేసేస్తే సరి.