పిల్లలకు బీమాతోనే ధీమా..!
చదువు నుంచి అత్యవసరం దాకా చైల్డ్ప్లాన్లు పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి పెట్టుబడి సాధనాలు చాలా ఉన్నాయి. కానీ జీవిత బీమా కంపెనీలందించే చైల్డ్ ప్లాన్ల ఆకర్షణే వేరు. నిర్దిష్ట లక్ష్యం దిశగా ఒక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి దోహదపడతాయి. వీటిలో ఉండే మరికొన్ని విశిష్టతలేమిటంటే.. నిరాటంకంగా చదువుకు తోడ్పాటు.. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తోడయ్యే చైల్డ్ ప్లాన్ల వల్ల పాలసీదారున్నా, లేకున్నా.. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అవసరమైతే పిల్లలకు కూడా బీమా కవరేజీని పెంచుకోవచ్చు.
కావాలంటే వైకల్యం, క్రిటికల్ ఇల్నెస్, ప్రీమియం రద్దు వంటి రైడర్లు కూడా తీసుకుంటే మరింత భద్రత లభించినట్లవుతుంది. చైల్డ్ ప్లాన్లతో పిల్లలకు లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. సహజంగానే వాటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. తద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించి, పిల్లలకు అవసరమయ్యే నాటికి చెప్పుకోతగ్గ మొత్తాన్ని కూడబెట్టవచ్చు.
పెద్ద మొత్తానికి దీర్ఘకాలిక పెట్టుబడే కీలకం..
పిల్లల విదేశీ చదువులు కావొచ్చు.. వివాహ శుభకార్యాలు కావొచ్చు.. ప్రస్తుతం అన్నీ భారీ ఖర్చులతోనే ముడిపడి ఉంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోయే ఫీజులను చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో ఏ స్థాయిలో కట్టాల్సి వస్తుందో అర్థమవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత ముందు నుంచీ, వీలైనంత వరకూ క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితేనే పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది.
ఈక్విటీల్లో దీర్ఘకాలం.. అంటేపదేళ్లు పైగా పెట్టుబడులు పెడుతూ వెడితే, స్థిరమైన రాబడి అందించే సాధనాలకన్నా మెరుగైన రాబడులే వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే ధోరణి ఉండొచ్చని చెప్పడానికి లేదు కానీ.. 2014 డిసెంబర్ దాకా బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏటా సుమారు 15.29 శాతం రాబడులు అందించింది.
అత్యవసర పరిస్థితుల కోసం..
పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాల కోసం చైల్డ్ ప్లాన్ రూపంలో లైఫ్ కవరేజీ కూడా ఉన్నప్పుడు.. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా మళ్లీ భారీ మొత్తాల్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం స్వల్పకాలిక ఫిక్సిడ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్ వంటి సాధనాల్లో చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల రిటైర్మెంట్ వంటి మరింత పెద్ద లక్ష్యాల పెట్టుబడుల కోసం అధిక మొత్తం కేటాయించడం సాధ్యపడుతుంది.
క్రమపద్ధతిలో పెట్టుబడి సౌలభ్యం..
ఇతరత్రా బీమా పథకాల తరహాలోనే ప్రీమియం చెల్లింపునకు సంబంధించి చైల్డ్ ప్లాన్లలో కూడా నెలవారీగా, మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి కట్టే వెసులు బాటు ఉంటుంది. వేతనజీవులైతే నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటే సులువుగా కట్టుకుంటూ వెళ్లొచ్చు. అదే ప్రతీ నెలా స్థిరమైన ఆదాయం ఉండని వ్యాపారస్తుల్లాంటి వాళ్లు వార్షిక విధానాన్ని ఎంచుకుంటే.. ఒక క్రమ పద్ధతిలో బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభించి, మెచ్యూర్ అయిన మొత్తాన్ని ప్రీమియం చెల్లింపునకు ఉపయోగించవచ్చు.
ఇక ప్రీమియం చెల్లించడానికి కూడా పలు మార్గాలు ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు తేదీ నాటికి మన బ్యాంకు ఖాతా నుంచి సదరు మొత్తం డెబిట్ అయ్యేలా ఈసీఎస్, ఆటో డెబిట్ వంటి మార్గాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు వాడుతుంటే కార్డు కంపెనీకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వొచ్చు.
లాకిన్ వ్యవధి ప్రయోజనం..
చైల్డ్ ప్లాన్లు కూడా మిగతా జీవిత బీమా పథకాల్లానే దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణులను అలవరిచేవే. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అంత ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. సంప్రదాయ ప్లాన్లయితే 2-3 ఏళ్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్స్) అయితే అయిదేళ్ల దాకా లాకిన్ వ్యవధి ఉంటుంది. కనీసం కొన్నాళ్ల పాటైనా పెట్టుబడిని కొనసాగించేలా చేసేందుకు ఈ నిబంధన పెట్టడం జరిగింది. ఒకవేళ ముందుగా వైదొలగాలంటే ఎంతో కొంత పెనాల్టీ కింద వదులుకోవాల్సి వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే .. పిల్లల భవిష్యత్‌కు ఎటువంటి సమస్యలు ఉండకుండా భద్రతనివ్వాలనుకునే వారు ఎంచుకోతగిన సాధనాల్లో చైల్డ్ ప్లాన్లు చాలా కీలకమైనవనడంలో సందేహం లేదు.