Nielsen Company
-
టీసీఎస్-నీల్సన్ భారీ డీల్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) భారీ ఆర్డర్‌ను సాధించింది. టెలివిజన్ రేటింగ్ మేనేజ్మెంట్ సంస్థ నీల్సన్ తో అతి భారీ విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. టిసిఎస్-నీల్సన్ ఒప్పందం పునరుద్ధరణలో భాగంగగా ఈ భారీ డీల్ కుదిరింది. 2.25 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14,కోట్లు) అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును గెలుచుకుంది. టీసీఎస్‌తో ఈ కాంట్రాక్టును ఐదు సంవత్సరాల వరకు (2025) పొడిగించామని, ఈ డీల్ డిసెంబర్ 31, 2025 న ముగుస్తుందని నీల్సన్ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ (అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన వివరాలను అందించింది. ఇండియన్ ఐటీలోనే బిగ్గెస్ట్ డీల్ తాజా డీల్ ప్రకారం నీల్సన్ నుంచి 2017నుంచి 2020వరకు ప్రతి సంవత్సరం 320 మిలియన్ డాలర్లు ఆదాయాన్ని, 2021 నుంచి 2024 వరకు 139.5 మిలియన్ డాలర్లు, 2025 నాటికి 186 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని టీసీఎస్ పొందనుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ కు ఇది ఒక కీలక మైన ఒప్పందంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమలోనే ఇది అతి పెద్ద డీల్‌గా నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు పోటీగా భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా టీసీఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఆర్ఐఎల్ మొదటిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంతో రాబోయే సంవత్సరాల్లో అత్యధిక విలువైన భారతీయ కంపెనీలను అధిగమిస్తుందని భావిస్తున్నారు. కాగా 2007 లో టీసీఎస్-నీల్సన్ మధ్య1.2 బిలియన్ డాలర్ల మేర , 2013లో దాదాపు రెట్టింపు విలువతో 10 సంవత్సరాలకుగాను 2.5బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదిరింది. దీన్ని మరో మూడేళ్ల పాటు 2020వరకు పొడిగించింది. -
పిల్లల భవితకు ఆర్థిక భరోసా
♦ ముందు నుంచే దీర్ఘకాల ప్రణాళిక ముఖ్యం ♦ విద్యావసరాలు తీర్చటానికి చైల్డ్ ప్లాన్స్ తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషాల కోసం, వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం అనేక ప్రణాళికలు వేస్తారు. నీల్సన్ సంస్థ నిర్వహించిన ‘లైఫ్– 2015’ సర్వే ప్రకారం .. అత్యధిక శాతం మంది జీవిత బీమా తీసుకోవడానికి ముఖ్య కారణం వారి పిల్లల భవిష్యత్‌పై ఆలోచనే. మరో అధ్యయనం ప్రకారం చైల్డ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన స్థాయి 99 శాతం మేర ఉంటోంది. కానీ తీసుకునే వారి సంఖ్య కేవలం 16 శాతంగాను.. తీసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య 12 శాతంగా మాత్రమే ఉంటోంది. అంటే చైల్డ్ ప్లాన్‌పై అవగాహన ఉన్నవారి సంఖ్యకు .. నిజంగానే తీసుకుంటున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేదు. సరే.. దాన్నలా పక్కన పెడితే.. అనేకానేక ఆర్థిక సాధనాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు పిల్లల బీమా పథకాలు, జీవిత బీమా పథకాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఎందుకున్నాయి? ఎందుకంటే పిల్లలు తగిన ప్రొఫెషన్లో చేరేందుకు కీలకమైన చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశమే. పెరిగిపోతున్న విద్యా వ్యయాలు, ప్రొఫెషనల్ విద్య ఖర్చులు, సింపుల్ పెళ్లి ఖర్చులన్నింటికి కూడా చైల్డ్ ప్లాన్ సమగ్రమైన కవరేజి ఇస్తుంది. ఇది బేసికల్‌గా పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ఒక పొదుపు సాధనం. ఒకవేళ పేరెంట్‌కి ఏదైనా అనుకోనిది జరిగినా.. లబ్ధిదారుకు నిర్దేశిత సమ్ అష్యూర్డ్ మొత్తం తక్షణం లభిస్తుంది. పైగా తదుపరి ప్రీమియంలు కట్టకపోయినా.. (వెయివర్ ఆఫ్ ప్రీమియం) పాలసీ మాత్రం మెచ్యూరిటీ దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రీమియంలను.. పాలసీ మెచ్యూర్ అయ్యే దాకా బీమా కంపెనీయే పాలసీదారు తరఫున కడుతుంది. ఇలాంటి పథకాల్లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడి పెడుతూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో పొదుపు మొత్తాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. పిల్లల చదువు లక్ష్యాలు, ప్రొఫెషనల్ కెరియర్, మొత్తమ్మీద ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడతాయి. పిల్లల చదువుకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధుల్లో కొంత మొత్తం చేతికి అందుకునే విధంగా ఈ ప్లాన్స్‌లో కొంత వెసులుబాటూ ఉంటుంది. ప్రణాళిక ఇలా... పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలను సాధ్యమైనంత ముందునుంచే ప్రారంభించాలి. పెట్టుబడులను వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి. నిర్ధిష్ట కాలవ్యవధుల్లో కొంత కొంత మొత్తం పొదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిధి పోగవుతుంది. అలాగే కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు (అసలుకు వడ్డీ కూడా తోడవుతూ పెరుగుతూ ఉంటుంది కనుక). చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని.. ♦ నిర్ధిష్ట మొత్తం పోగవడానికి అవసరమైన కాల వ్యవధి ♦ సదరు డబ్బు ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది ♦ నిధిని సమకూర్చుకోవడానికి ఎంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది. మరీ భయం వద్దు... స్థూలంగా.. చదువు ఖర్చులు రేసుగుర్రాల్లా పరుగెట్టేస్తున్నాయి. అయితే మరీ భయపడకుండా.. ఒక సముచిత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఎంత మొత్తం డబ్బు అవసరమవుతుందో లెక్కేసేటప్పుడు.. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. వీలైనంత త్వరగా పొదుపు చేయడం మొదలుపెట్టండి. ఎంత నిధి సమకూర్చుకున్నా ఆఖర్లో ఎంతో కొంత తగ్గవచ్చేమో. కానీ విద్యా రుణాల్లాంటివి తీసుకుని దాన్ని భర్తీ చేయొచ్చు. అయితే అన్ని వేళలూ ఒకే రకంగా ఉండవు కదా. ఒకవేళ ఇంటిపెద్దకేదైనా జరిగినా.. ఆర్థిక స్థితి గాడి తప్పినా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది కనుక.. పూర్తిగా రుణాల మీదే ఆధారపడటం శ్రేయస్కరం కాదు. కేవలం ప్రణాళికలతో నే కాకుండా.. వివేచనతో సత్వరం అమలు చేసేస్తే సరి. -
ప్చ్.. ఈ ఏడాది కష్టమే!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో అధ్వానంగా ఉంటుందని 48 శాతం భారతీయ కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి. సరుకులు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రానున్న 12 నెలల్లో ఆకాశాన్ని అంటుతాయని దాదాపు 75 శాతం కుటుంబాలవారు భావిస్తున్నారు. ప్రిన్సిపల్ రిటైర్మెంట్ అడ్వైజర్స్ (ఇండియా) మొట్టమొదటి దేశ ఆర్థిక సంక్షేమ సూచీ నివేదిక ఈ విషయాలను పేర్కొంది. ఈ ఏడాదిపై భారతీయ కుటుంబాలు ఆందోళనకరమైన దృక్పథంతో ఉన్నట్లు అడ్వైజర్స్ గ్రూప్ కంట్రీ హెడ్ (ఇండియా) రాజన్ ఘట్గాల్కర్ అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంధన ధరలు తీవ్ర ఆందోళనకు కారణాలని వివరించారు. మరిన్ని ముఖ్యాంశాలు... 2012 డిసెంబర్‌తో పోల్చితే 2013 డిసెంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఐదు నెలల కనిష్ట స్థాయిలో 6.16%గా నమోదయినప్పటికీ, రానున్న ఏడాది కాలంలో ధరల పెరుగుదల ఖాయమని సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది అభిప్రాయంగా ఉంది. ఆహారోత్పత్తులు, పానీయాలు, రవాణా వంటి అంశాల్లో వ్యయాల పెరుగుదల కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వచ్చే ఏడాదిలో గృహ రుణ వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉందన్నది 78% మంది ఆందోళన. అయితే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని నియంత్రణలోనే ఉంచుకుంటున్నామని, ఆర్థిక లక్ష్యాల సాధనలో పురోగతిని సాధిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారు పేర్కొనడం విశేషం. ఇళ్లు లేదా ఆస్తి కొనుగోలు.. అలాగే విద్య, పెళ్లిళ్ల వంటి అంశాలకు సంబంధించి పిల్లలపై జరిపే వ్యయాలు 2014లో భారంగా మారవచ్చన్నది సర్వేలో మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం. 11 నగరాల్లోని 1,664 మంది అభిప్రాయాలను తమ పరిశోధనకు సంస్థలు ప్రాతిపదికగా తీసుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారి వయసు 25-60 ఏళ్ల శ్రేణిలో ఉంది. వార్షికంగా రూ.5 లక్షలకు పైగా కుటుంబ ఆదాయం ఉన్నవారి అభిప్రాయాలను సంస్థలు తీసుకున్నాయి. 2013 చివరి క్వార్టర్లో నీల్సన్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రిన్సిపల్ రిటైర్మెంట్ అడ్వైజర్స్ భారత్‌లో ఈ అధ్యయనం నిర్వహించింది. అమెరికాలో 12 సంవత్సరాలుగా సంస్థ ఈ తరహా అధ్యయనాన్ని నిర్వహిస్తోంది.