జీవిత బీమా.. ఎంపిక ఇలా..
ఎప్పుడేం జరుగుతుందో తెలియని ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో జీవిత బీమా పాలసీ తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమైన నిర్ణయమే. కుటుంబం మొత్తానికి ఆర్థికపరమైన భరోసానిచ్చే పాలసీని తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలను పాటిస్తే మెరుగైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వివిధ రకాల పాలసీలు, కవరేజీలు తదితర అంశాల గురించి తెలియజెప్పేందుకే ఈ కథనం.
బీమా ఎందుకంటే..
ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కాకుండా భరోసా కల్పిస్తుంది జీవిత బీమా పాలసీ. సాధ్యమైనంత తక్కువ వయసులోనే పాలసీని తీసుకుంటే ప్రీమియం భారం తక్కువగా ఉంటుంది. పైగా యువ ప్రొఫెషనల్స్‌కి పన్ను ప్రయోజనాలిచ్చే సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే, పెళ్లి, పిల్లల చదువు, రిటైర్మెంట్ వంటి వివిధ లక్ష్యాల సాధనలోనూ భరోసాగా ఉంటుంది. సాధారణంగానైతే జీవిత బీమా పాలసీలు కేవలం లైఫ్ కవర్‌కి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుతం అత్యవసర వైద్యం, ప్రమాదాల్లో అంగవైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి వాటికి కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.
కవరేజీ ఎంత ఉండాలి..
పాలసీదారు అనంతరం నామినీకి లభించే మొత్తాన్ని కవరేజీగా వ్యవహరిస్తారు. దీన్ని లెక్కించేందుకు సులభమైన సూత్రం ఒకటుంది. మీ వార్షిక జీతాన్ని 8తో గుణిస్తే ఎంత వస్తుందో అంత కవరేజీకి పాలసీని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మరింత వివరంగా కావాలంటే పాలసీదారు తదనంతరం కూడా కొనసాగే కుటుంబం నెలవారీ ఖర్చులన్నీ కొన్నాళ్ల దాకా పరిగణనలోకి తీసుకుంటే.. ఎంత మొత్తం అవసరమవుతుందనేది ఒక అంచనాకు రావచ్చు. దానికి తగ్గట్లు కాస్త అటూ ఇటుగా లెక్కవేసుకుని తక్కువ ప్రీమియంతో మెరుగైన కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చు.
ఏ పాలసీ తీసుకోవచ్చు ..
వ్యక్తిగత పరిస్థితులను బట్టి జీవిత బీమా పాలసీని ఎంపిక చేసుకోవడం ఉంటుంది. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు.. టర్మ్ ప్లాన్, సంప్రదాయక ఎండోమెంట్ ప్లాను, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను (యులిప్), రిటైర్మెంట్ లేదా పింఛను ప్లాన్ల తరహాల్లో ఉంటాయి. వీటన్నింటిలోకెల్లా టర్మ్ ప్లాన్ అనేది అచ్చంగా పాలసీదారు మరణానంతర కవరేజీకి మాత్రమే ఉద్దేశించినది. దీనికి కట్టిన ప్రీమియంలు పాలసీదారు జీవితకాలంలో తిరిగి రావు. మరణానంతరం కుటుంబానికి పెద్ద మొత్తం లభిస్తుంది. మిగతా పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. మరోవైపు, ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే ఇవి పొదుపు, బీమా రక్షణ కల్పించే సాధనాలుగా ఉంటాయి.
పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత లేదా పాలసీదారు మరణానంతరం కవరేజీ మొత్తం లభిస్తుంది. ఇక, యులిప్‌లనేవి మార్కెట్ ఆధారిత దీర్ఘకాలిక సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ పథకాల్లాంటివి. ఈ పథకాలు షేర్లు, డెట్ సాధనాల్లో నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం ఇన్వెస్ట్ చేసి రాబడులు అందిస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్లనేవి సంప్రదాయ పాలసీల రూపంలోనైనా ఉండొచ్చు లేదా యులిప్స్ రూపంలోనైనా ఉండొచ్చు. వీటిల్లో మెచ్యూరిటీ అనంతరం తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
పాలసీ ప్రీమియం..
మనం ఎంచుకునే కవరేజీ, వయసు తదితర అంశాలను బట్టి ప్రీమియం మారుతుంటుంది. సిగరెట్లు తాగేవారు, అధిక బరువున్న వారు, ప్రమాదకరమైన వృత్తుల్లోనివారు.. హాబీలు ఉన్నవారికి ప్రీమియం అధికంగా ఉంటుంది. కనుక జీవన విధానానికి అనువైన రైడర్లను ఎంచుకోవడం మంచిది. స్థూలంగా చెప్పాలంటే.. మన రిస్కు సామర్థ్యం, నిర్దిష్ట లక్ష్యాన్ని బట్టి పాలసీ తీసుకోవాలి. కావాలనుకుంటే అదనపు రిస్క్ కవరేజీ వంటివి కూడా ఎంచుకోవచ్చు.
- పంకజ్ రజ్దాన్
సీఈవో, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్