తగిన సమయంలో అనుబంధ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: జీవిత బీమా, బీమాయేతర సేవలకు సంబంధించి అనుబంధ సంస్థలను తగిన సమయంలో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. ఇటు ఒక్క ఉత్పత్తి మాత్రమే అందించే ఆర్థిక సంస్థగాను, అటు బహుళ ఉత్పత్తులు అందించే సంస్థలకు మాతృసంస్థగాను ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ స్వరూపం చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అధికారాల వికేంద్రీకరణతో తమ అనుబంధ సంస్థలన్నీ కూడా స్వతంత్ర బోర్డుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయని, గ్రూప్ సీఈవోల పనితీరు.. వారసత్వ ప్రణాళికలు.. కొనుగోళ్లు.. పెట్టుబడులు మొదలైన వాటి ప్రాతిపదికనే గ్రూప్ కంపెనీల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని పరేఖ్ తెలిపారు.
షేర్‌హోల్డర్లకు వార్షికంగా పంపే సందేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. గృహ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదలైన లిస్టింగ్‌కు అనువైన సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. మరోవైపు, గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడం ద్వారానే ఈ రంగం వృద్ధి చెందుతుంది తప్ప.. ఒక సంస్థ రుణాలను మరో సంస్థకు బదలాయించడం ద్వారా నమోదయ్యే ఎదుగుదలను వృద్ధి కింద పరిగణించజాలమని పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ లభ్యత, వాటి ధర పైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు.