ముంబై: ఇటీవలి కాలంలో ఇళ్లకు పెరిగిన డిమాండ్ వ్యవస్థలో వాస్తవికంగా వచ్చిందే కానీ.. గతంలో నిలిచిన డిమాండ్ ఒక్కసారిగా తోడయ్యింది (పెంట్‌అప్) కాదన్నారు గృహ రుణాల అగ్రగామి సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్. ఈ డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని తాను బలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరలు.. గృహ రుణాలపై పన్ను పరమైన ప్రయోజనాలు గడిచిన కొన్ని నెలల్లో డిమాండ్‌కు తోడ్పడిన అంశాలుగా పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారు.. చిన్న ఇళ్ల నుంచి విశాలమైన ఇళ్లుకు మారే వారు.. మరో ప్రాంతంలో రెండో ఇళ్లను కొనుగోలు చేసే వారి రూపంలో డిమాండ్ విస్తృతమైనట్టు వివరించారు.
ప్రాపర్టీ టెక్నాలజీపై ఓ వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరేఖ్ మాట్లాడారు. ఇంటి నుంచే కార్యాలయ పని విధానం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునే ప్రాంతానికి సంబంధించి విస్తృతమైన ఆప్షన్లు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి తక్కువ డిజిటైజ్ అయిన ఏకైక రంగం నిర్మాణమేనన్నారు. ‘‘రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీపై 1.5 శాతంలోపే వెచ్చిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించి తాజా సమాచారం అందుబాటులో ఉండదని ఎవరైనా అంగీకరించాల్సిందే. రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని టెక్నాలజీ తీసుకొస్తుంది. అదే విధంగా వ్యయాల పరంగా సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని పరేఖ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment