HDFC chairman
-
ఇళ్లకు డిమాండ్ వాస్తవమే
ముంబై: ఇటీవలి కాలంలో ఇళ్లకు పెరిగిన డిమాండ్ వ్యవస్థలో వాస్తవికంగా వచ్చిందే కానీ.. గతంలో నిలిచిన డిమాండ్ ఒక్కసారిగా తోడయ్యింది (పెంట్‌అప్) కాదన్నారు గృహ రుణాల అగ్రగామి సంస్థ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్. ఈ డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని తాను బలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరలు.. గృహ రుణాలపై పన్ను పరమైన ప్రయోజనాలు గడిచిన కొన్ని నెలల్లో డిమాండ్‌కు తోడ్పడిన అంశాలుగా పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారు.. చిన్న ఇళ్ల నుంచి విశాలమైన ఇళ్లుకు మారే వారు.. మరో ప్రాంతంలో రెండో ఇళ్లను కొనుగోలు చేసే వారి రూపంలో డిమాండ్ విస్తృతమైనట్టు వివరించారు. ప్రాపర్టీ టెక్నాలజీపై ఓ వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరేఖ్ మాట్లాడారు. ఇంటి నుంచే కార్యాలయ పని విధానం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునే ప్రాంతానికి సంబంధించి విస్తృతమైన ఆప్షన్లు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి తక్కువ డిజిటైజ్ అయిన ఏకైక రంగం నిర్మాణమేనన్నారు. ‘‘రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీపై 1.5 శాతంలోపే వెచ్చిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించి తాజా సమాచారం అందుబాటులో ఉండదని ఎవరైనా అంగీకరించాల్సిందే. రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని టెక్నాలజీ తీసుకొస్తుంది. అదే విధంగా వ్యయాల పరంగా సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని పరేఖ్ పేర్కొన్నారు. -
తగిన సమయంలో అనుబంధ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: జీవిత బీమా, బీమాయేతర సేవలకు సంబంధించి అనుబంధ సంస్థలను తగిన సమయంలో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. ఇటు ఒక్క ఉత్పత్తి మాత్రమే అందించే ఆర్థిక సంస్థగాను, అటు బహుళ ఉత్పత్తులు అందించే సంస్థలకు మాతృసంస్థగాను ఉన్న హెచ్డీఎఫ్సీ స్వరూపం చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అధికారాల వికేంద్రీకరణతో తమ అనుబంధ సంస్థలన్నీ కూడా స్వతంత్ర బోర్డుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయని, గ్రూప్ సీఈవోల పనితీరు.. వారసత్వ ప్రణాళికలు.. కొనుగోళ్లు.. పెట్టుబడులు మొదలైన వాటి ప్రాతిపదికనే గ్రూప్ కంపెనీల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని పరేఖ్ తెలిపారు. షేర్హోల్డర్లకు వార్షికంగా పంపే సందేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. గృహ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలైన లిస్టింగ్‌కు అనువైన సంస్థలు హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. మరోవైపు, గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడం ద్వారానే ఈ రంగం వృద్ధి చెందుతుంది తప్ప.. ఒక సంస్థ రుణాలను మరో సంస్థకు బదలాయించడం ద్వారా నమోదయ్యే ఎదుగుదలను వృద్ధి కింద పరిగణించజాలమని పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ లభ్యత, వాటి ధర పైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు.