Deepak Parekh
-
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్‌ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్‌ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. అలాగే తప్పుడు సమాచారంపై కీలక హెచ్చరిక చేశారు. ‘వాట్సాప్ యూనివర్శిటీ’ విస్తరణ, మార్కెట్లలో డబ్బు సంపాదించడంపై వస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలని , HDFC AMC . HDFC లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించి, ఆ తరువాత కొన్ని చిట్కాలతో నేరుగా మార్కెట్లలో పెట్టుబడులతో భారీ లాభాలు పొందవచ్చని భావించి నష్టపోయిన పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. (నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్) ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
హెచ్‌డీఎఫ్‌సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు. 1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్ హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్లైన్లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా హెచ్డీఎఫ్సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్డ్ డియర్నెస్ అలవెన్స్ రూ. 500. అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ ఆఫర్ లెటర్లో పేర్కొంది. కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్‌ను నిజమైన టైటాన్‌గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్‌కు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది. -
హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం
న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్గేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనంతో భారతీయ కంపెనీ తొలిసారి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది. దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్‌కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్కుగల డిజిటైజేషన్ ప్లాట్ ఫామ్‌లతో పాటు.. భారీ పంపిణీ నెట్వర్క్ గృహ రుణాలతోపాటు గ్రూప్ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీనానికి బోర్డుల గ్రీన్‌సిగ్నల్ ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) కాగా, బీమా రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో మార్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్డీఎఫ్సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. వారాంతాన బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది. -
హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్‌ల భేటీ
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తితో కలిసి ఆర్థికమంత్రితో సమావేశమయినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. రెండు ఆర్థిక దిగ్గజ సంస్థల 40 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం పలు రంగాలకు రుణ లభ్యత సౌలభ్యతను మెరుగుపరుస్తుందని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్బీఐ నిబంధనల వల్ల నాన్ బ్యాంకింగ్ కంపెనీలు తగిన ప్రయోజనాలు పొందలేకపోతున్నాయని, ఈ కారణంగానే విలీన ప్రతిపాదన ముందుకు వచ్చిందని పరేఖ్ వ్యాఖ్యానించారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బడా బ్యాంకింగ్ యేతర సంస్థలు మారుతున్న నిబంధనలను అనుగుణంగా నడుచుకోవడమో లేక తమకుతాము పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
భారత్ ఎకానమీపై హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఎకానమీ పురోగమిస్తోందని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా భారత్‌కు కీలక సవాలుగా కొనసాగుతుందని కూడా అభిప్రాయపడ్డారు. హెచ్డీఎఫ్సీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి పరేఖ్ ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ మొదటి వేవ్‌లో నష్టపోయినంత రెండవ వేవ్‌లో నష్టపోలేదని పేర్కొన్నారు. దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు (600 బిలియన్ డాలర్లపైన) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పటిష్టంగా ఉన్నాయన్నారు. క్యాపిటల్ మార్కెట్లు బులిష్ ధోరణిని కొనసాగిస్తున్నాయని, వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఎకానమీ పురోభివృద్ధికి కేంద్రం ఒకపక్క పలు సంస్కరణాత్మక చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరమైన పటిష్ట చర్యలను కొనసాగిస్తోందన్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఎదురుకాకుండా ఆర్బీఐ సమర్థవంతమైన విధానాలను అనుసరిస్తోందన్నారు. దేశంలో ఇంకా రుణ వృద్ధి రేటు మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సవాళ్లు కొనసాగుతున్నాయని, రికవరీ ఒడిదుడుకులకు గురవుతోందని పేర్కొన్నారు. గృహ రుణాలు, కమర్షియల్ రియల్టీ, గోడౌన్లు, ఈ-కామర్స్ విభాగాల నుంచి దేశంలో రుణాలకు డిమాండ్ ఉందని ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా రంగం కూడా పురోగమిస్తోందన్నారు. కాగా హెచ్డీఎఫ్సీ ఈఆర్జీఏ జనరల్ ఇన్సూరెన్స్ లిస్టింగ్ ప్రణాళికలు తక్షణం ఏమీ లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఇళ్లకు డిమాండ్ వాస్తవమే
ముంబై: ఇటీవలి కాలంలో ఇళ్లకు పెరిగిన డిమాండ్ వ్యవస్థలో వాస్తవికంగా వచ్చిందే కానీ.. గతంలో నిలిచిన డిమాండ్ ఒక్కసారిగా తోడయ్యింది (పెంట్‌అప్) కాదన్నారు గృహ రుణాల అగ్రగామి సంస్థ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్. ఈ డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని తాను బలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరలు.. గృహ రుణాలపై పన్ను పరమైన ప్రయోజనాలు గడిచిన కొన్ని నెలల్లో డిమాండ్‌కు తోడ్పడిన అంశాలుగా పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారు.. చిన్న ఇళ్ల నుంచి విశాలమైన ఇళ్లుకు మారే వారు.. మరో ప్రాంతంలో రెండో ఇళ్లను కొనుగోలు చేసే వారి రూపంలో డిమాండ్ విస్తృతమైనట్టు వివరించారు. ప్రాపర్టీ టెక్నాలజీపై ఓ వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరేఖ్ మాట్లాడారు. ఇంటి నుంచే కార్యాలయ పని విధానం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునే ప్రాంతానికి సంబంధించి విస్తృతమైన ఆప్షన్లు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి తక్కువ డిజిటైజ్ అయిన ఏకైక రంగం నిర్మాణమేనన్నారు. ‘‘రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీపై 1.5 శాతంలోపే వెచ్చిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించి తాజా సమాచారం అందుబాటులో ఉండదని ఎవరైనా అంగీకరించాల్సిందే. రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని టెక్నాలజీ తీసుకొస్తుంది. అదే విధంగా వ్యయాల పరంగా సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని పరేఖ్ పేర్కొన్నారు. -
బంధన్ చేతికి గృహ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తాజాగా గృహ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది. ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేశాయి. రెండు పక్షాలకు ఇది ప్రయోజనకరమైన ఒప్పందంగా హెచ్డీఎఫ్సీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు గృహ్ ఫైనాన్స్‌కి, మరింత వైవిధ్యమైన సెక్యూర్డ్ రుణాల పోర్ట్‌ఫోలియో దక్కడం ద్వారా బంధన్ బ్యాంక్‌కు ఇది లాభించగలదన్నారు. విలీన సంస్థలో 15 శాతం దాకా వాటాలను అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరతామని, అనుమతి లభించని పక్షంలో నిబంధనల ప్రకారం 10 శాతం లోపునకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల్లో భాగంగా డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు, ఇందులో భాగంగానే గృహ్ ఫైనాన్స్ కొనుగోలు చేస్తున్నట్లు బంధన్ బ్యాంక్ సీఈవో చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. విలీనానంతరం బంధన్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో అన్సెక్యూర్డ్ రుణాల వాటా 86 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందన్నారు. విలీన బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,182 బ్యాంకింగ్ అవుట్‌లెట్స్, 476 ఏటీఎంలు ఉంటాయి. రుణ పోర్ట్‌ఫోలియోలో 58 శాతం మైక్రో ఫైనాన్స్ రుణాలు, 28 శాతం రిటైల్ హోమ్ లోన్స్, 14 శాతం ఇతరత్రా రుణాలు ఉంటాయి. తగ్గనున్న బంధన్ హోల్డింగ్స్ వాటాలు .. ప్రస్తుతం బంధన్ బ్యాంక్‌లో మాతృ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు (బీఎఫ్హెచ్ఎల్) 82.28 శాతం వాటాలు ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.83% వాటాలు ఉన్నాయి. విలీనానంతరం బంధన్ బ్యాంక్‌లో బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటా 60.27%కి తగ్గుతుంది. అటు హెచ్‌డీఎఫ్‌సీకి 15% వాటాలు దక్కుతాయి. ఆ తర్వాత కొన్ని వాటాలను పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు లేదా సెకండరీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దీన్ని క్రమంగా 10% లోపునకు తగ్గించుకుంటుంది. ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ తన వాటాలు 82.3% నుంచి 40%కి తగ్గించుకోవాలి. కానీ అది జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో బంధన్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటికీ ఇటీవల సడలించింది. తాజా డీల్ పూర్తయినా బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ వాటా 60.27% స్థాయికి మాత్రమే తగ్గుతుంది. దీంతో.. వాటాలను మరింత తగ్గించుకోవడానికి బీహెచ్ఎఫ్ఎల్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండనుంది. ఇక, అటు హెచ్‌డీఎఫ్‌సీకి విలీన బ్యాంకులో ప్రమోటరు హోదా లభిస్తుంది.ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీకి.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 19.72% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాంకులో ప్రమోటరుగా ఉన్న సంస్థ మరో బ్యాంకులో ప్రమోటరుగా 10%కి మించి వాటాలు ఉండకూడదు దీంతో విలీన సంస్థలో ప్రారంభ దశలో 15.44% వాటాలు ఉన్నప్పటికీ.. హెచ్డీఎఫ్సీ కూడా క్రమంగా దీన్ని పది శాతం లోపునకు తగ్గించుకోవాల్సి రానుంది. సోమవారం బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్లు 5.21 శాతం క్షీణించి రూ. 501.10 వద్ద క్లోజయ్యాయి. గృహ్ ఫైనాన్స్ షేరు 3.9 శాతం క్షీణించి రూ. 306.20 వద్ద క్లోజయ్యింది. గృహ్ ఫైనాన్స్.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో ఆగా ఖాన్ ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ కలిసి గృహ్ ఫైనాన్స్ ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ దాదాపు రూ. 2,738 కోట్ల రుణాలు ఇచ్చింది. మొత్తం లోన్ బుక్ పరిమాణం రూ. 16,663 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిటైల్ విభాగంపై దృష్టి పెడుతున్న గృహ్ ఫైనాన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 220 కోట్ల నికర లాభం ఆర్జించింది. బంధన్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్‌కు.. 938 శాఖలు, 30,431 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లు రూ. 33,869 కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 33,373 కోట్లుగా ఉన్నాయి. బంధన్ బ్యాంక్ ప్రధానంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా మైక్రోఫైనాన్స్ లోన్సే ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్ పశ్చిమాది రాష్ట్రాల్లో .. గృహ రుణాల కేటగిరీలో కార్యకలాపాలు సాగిస్తోంది. షేర్ల మార్పిడి ఇలా.. డీల్ ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బంధన్ బ్యాంక్‌కి చెందిన 568 షేర్లు లభిస్తాయి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రమోటర్ హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవడానికి బంధన్ బ్యాంక్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లుగా ఉంటుంది. బంధన్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 59,800 కోట్లుగా ఉండగా, గృహ్ ఫైనాన్స్ విలువ రు. 23,224 కోట్లుగా ఉంది. -
తగిన సమయంలో అనుబంధ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: జీవిత బీమా, బీమాయేతర సేవలకు సంబంధించి అనుబంధ సంస్థలను తగిన సమయంలో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. ఇటు ఒక్క ఉత్పత్తి మాత్రమే అందించే ఆర్థిక సంస్థగాను, అటు బహుళ ఉత్పత్తులు అందించే సంస్థలకు మాతృసంస్థగాను ఉన్న హెచ్డీఎఫ్సీ స్వరూపం చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అధికారాల వికేంద్రీకరణతో తమ అనుబంధ సంస్థలన్నీ కూడా స్వతంత్ర బోర్డుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయని, గ్రూప్ సీఈవోల పనితీరు.. వారసత్వ ప్రణాళికలు.. కొనుగోళ్లు.. పెట్టుబడులు మొదలైన వాటి ప్రాతిపదికనే గ్రూప్ కంపెనీల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని పరేఖ్ తెలిపారు. షేర్హోల్డర్లకు వార్షికంగా పంపే సందేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. గృహ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలైన లిస్టింగ్‌కు అనువైన సంస్థలు హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. మరోవైపు, గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడం ద్వారానే ఈ రంగం వృద్ధి చెందుతుంది తప్ప.. ఒక సంస్థ రుణాలను మరో సంస్థకు బదలాయించడం ద్వారా నమోదయ్యే ఎదుగుదలను వృద్ధి కింద పరిగణించజాలమని పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ లభ్యత, వాటి ధర పైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. -
ఐదుగురిలో నలుగురు పనికిరానివారే
► ఇంజనీర్ పట్టభద్రుల్లో నైపుణ్యాల కొరత ► హెచ్డీఎఫ్సీ చీఫ్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు చెన్నై: ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. విద్యార్ధులు కాలేజీల నుంచి పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దేశంలో 3,300కు పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, సగటున ప్రతీ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, అయితే వీరిలో తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల ప్రతి ఐదుగురిలో నలుగురు ఉద్యోగాలు చేయడానికి పనికిరావడం లేదని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్‌లో దీపక్ పరేఖ్ ఇన్స్టిట్యూట్ చెయిర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులకు తగిన శిక్షణనివ్వాలని పేర్కొన్నారు. -
రిటైల్ రుణాలకు భారీ అవకాశాలు: దీపక్ పరేఖ్
లండన్: రిటైల్ రుణాల వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలున్నాయని ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. ఈ విషయంలో సంస్థల మధ్య పోటీ సహేతుకంగా లేకపోతే మాత్రం భారీ నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. నిధుల సమీకరణ వ్యయాల కంటే తక్కు వకే రుణాలు ఇచ్చే విషయంలో ఆయనీ హెచ్చరిక చేశారు. రుణాలిచ్చేందుకు భారీ స్థాయి సంస్థలున్నప్పటికీ దేశంలో రిటైల్ రుణాల వ్యాప్తి తక్కువగా ఉండడంతో ఈ విభాగంలో మంచి అవకాశాలున్నాయని పరేఖ్ లండన్‌లో ఆర్థిక సంస్కరణలపై జరిగిన ఓ సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. ‘‘పోటీ తీవ్రతరమైతే తక్కువ రేటుకే రుణాలను జారీ చేయడం ద్వారా మార్కెట్ వాటాను సులభంగా పెంచుకోవచ్చు. కానీ, ఇతర సంస్థలు కూడా ఈ దిశగా అడుగులు వేసేందుకు ఇది ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో తమకు నిధులు సేకరించడానికి అయిన వ్యయానికంటే తక్కువకే రుణాలు ఇవ్వడం ద్వారా సంస్థలు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని పరేఖ్ వివరించారు. జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి దేశంలో 9 శాతమే ఉండగా, ఆసియాలోని ఇతర ప్రముఖ దేశాల్లో ఇది 20–30 శాతంగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘భారత్‌లో కేవలం 2 శాతం మందే ఈక్విటీల్లో మదుపు చేస్తుంటే, అదే చైనాలో 10 శాతం, అమెరికాలో 18 శాతం మంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. -
మనమూ రక్షణాత్మక వైఖరి అమలు చేద్దాం
⇒ దేశీ సంస్థలను కాపాడుకునేందుకు ఇదే మార్గం ⇒ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ముంబై: అమెరికా, బ్రిటన్ తదితర పెద్ద దేశాల తరహాలో భారత్ కూడా రక్షణాత్మక వైఖరి అమలు చేయాల్సిన అవసరం ఉందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. దేశీ సంస్థల ప్రయోజనాలు కాపాడేందుకు ఇదే తగిన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మనం కూడా రక్షణాత్మక ధోరణి పాటించాలి. అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాలు కూడా రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నప్పుడు మనం కూడా అలా చేయడంలో తప్పేముంది. మనది చాలా పెద్ద దేశం.. పెద్ద మార్కెట్. మనం సైతం మన పరిశ్రమలను కాపాడుకోవాలి కదా‘ అని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. చైనా నుంచి చౌక ఉక్కు దిగుమతులపై పరిమితులు విధించిన తర్వాత దేశీ ఉక్కు రంగం మళ్లీ కోలుకుంటుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ‘చైనా నుంచి చౌకగా ఉత్పత్తులు వెల్లువెత్తుతుండటంతో మన ఉక్కు సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస దిగుమతి ధరలు విధిస్తే గానీ పరిస్థితి చక్కబడలేదు. ప్రభుత్వ జోక్యానికి ముందు 50 శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో పనిచేసిన మన సంస్థలు ప్రస్తుం 80 శాతం మేర పనిచేస్తున్నాయి. తీసుకున్న రుణాలనూ సక్రమంగా చెల్లించగలుగుతున్నాయి‘ అని పరేఖ్ వివరించారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రభుత్వం ప్రతీ ఉత్పత్తిపై యాంటీ–డంపింగ్ సుంకాలు విధించడం సాధ్యం కాదు కనుక.. దేశీ కంపెనీలను కాపాడటానికి రక్షణాత్మక వైఖరులు పాటించక తప్పదని ఆయన చెప్పారు. ’బీ ఇండియన్.. బై ఇండియన్ (భారతీయులుగా జీవిద్దాం.. భారతీయ ఉత్పత్తులే కొందాం)’ అంటూ పరేఖ్ పిలుపునిచ్చారు. మరోవైపు, భారత ఐటీ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలేమీ కొల్లగొట్టడం లేదని, పైపెచ్చు అక్కడ ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అమెరికాతో సహా 80 దేశాల్లోని 200 పైగా నగరాల్లో భారత ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో గతేడాది 20 బిలియన్ డాలర్ల పైగా పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చాయని, సుమారు 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయని ప్రసాద్ చెప్పారు. ద్వితీయార్ధం నుంచి ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణ.. కీలకమైన వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి రానుండటం, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టమవుతుండటం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ప్రైవేట్ పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని పరేఖ్‌తో పాటు సదస్సులో పాల్గొన్న ఆది గోద్రెజ్ తదితర వ్యాపార దిగ్గజాలు చెప్పారు. మరోవైపు చైనాతో వాణిజ్య అసమతౌల్యత కూడా దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు తక్కువగా ఉండటానికి కారణమని పరేఖ్ చెప్పారు. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం 70 బిలియన్ డాలర్ల మేర ఉండగా.. అందులో 60 బిలియన్ డాలర్ల దిగుమతులే ఉంటున్నాయని, చైనాకు ఎగుమతులు 10 బిలియన్ డాలర్లే ఉంటున్నాయన్నారు. అటు గోద్రెజ్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్నాళ్లుగా ప్రైవేట్ వినియోగం మందగించడంతో కార్పొరేట్ల పెట్టుబడులూ తగ్గాయని వివరించారు. బ్లాక్‌మనీపై పోరును ప్రస్తావిస్తూ నల్లకుబేరులపై కొరడా ఝుళిపించడం దీనికి పరిష్కారం కాదని, ప్రత్యక్ష పన్నుల ను తగ్గించడం ద్వారా వ్యాపార సంస్థలను పన్నులు కట్టేలా ప్రోత్సహించడమే సరైన మార్గమని చెప్పారు. పన్నులు అధికంగా ఉండటమే ప్రజలు, కంపెనీలు తమ వాస్తవా దాయాలు తక్కువ చేసి చూపించడానికి కారణమన్నారు. -
సవాళ్లున్నాయ్... పరిష్కరించాలి..!
⇒ భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణలు ⇒ మొండిబకాయిల సమస్య తక్షణ పరిష్కారం ఆవశ్యకత: దీపక్ పరేఖ్ ⇒ గణాంకాల్లో మరింత స్పష్టత కావాలన్న క్రిసిల్ ⇒ ఇకపై భారత్ వృద్ధికి దేశీయ అంశాలే కారణమవుతాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమించడానికి ఇకపై దేశీయ అంశాలే కారణమవుతాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును 0.25–0.50 శాతం నుంచి 0.75– 1 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్తలు తాజా పరిస్థితులపై చేసిన విశ్లేషణల ఇదీ... మొండి బాకాయిల సమస్య తీవ్రం: పరేఖ్ ‘‘దేశంలో మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి పెట్టాలి. అయితే దీనికి ప్రభుత్వ బెయిలవుట్ తరహా చర్యలు పనికిరావు. ఇక్కడ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా కాకూడదన్నది నా అభిప్రాయం. మౌలిక రంగంపై రీఫైనాన్షింగ్, రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునే విధంగా రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చొరవల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అలాగే బ్యాంకింగ్‌కు తగిన మూలధనం అందుబాటులో ఉంచే చర్యలను కేంద్రం తీసుకోవాలి’’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఎల్ఎస్ఈ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా ఫోరంలో ఆర్థిక సంస్కరణలపై జరిగిన సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ విలీనాలపై మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక సందర్భాలో ఇలాంటి చొరవలు అవసరమేనన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐలో ఐదు బ్యాంకుల విలీనం తగిన నిర్ణయమేనని ఆయన అన్నారు. గణాంకాల మధ్య పొంతన ఉండడం లేదు: క్రిసిల్ భారత్‌లో పలు కీలక గణాంకాల మధ్య పొందన కుదరడం లేదని రేటింగ్, విశ్లేషణా సంస్థ– క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మాదికారి జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు, క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల గణాంకాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి చూస్తే... జీడీపీలో తయారీ రంగం వాటా గణాంకాలకు, నెలవారీగా విడుదలవుతున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీకీ (ఐఐపీ) మధ్య వ్యత్యాసం కనబడుతోందని చెప్పారు. దేశీయ అంశాలే వృద్ధికి ఊతం: అరవింద్ సుబ్రమణ్యం అమెరికా ఫెడ్ నిర్ణయాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ ముందే డిస్కౌంట్ చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 5–6 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాలపై ఈ ప్రభావం పడబోదనీ వారు విశ్లేషిస్తున్నారు. రేట్లు పెంపు ఇకపై ఉండబోదని క్రితం పాలసీ సందర్భంగానే ఆర్బీఐ సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఫెడ్ రేటు పెంపు అంశంపై మాట్లాడుతూ, భారత్‌పై ఈ ప్రభావం స్వల్పమేనని అన్నారు. దేశీయంగా తీసుకునే నిర్ణయాలే మున్ముందు దేశాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. స్థిరత్వం, అన్ని విభాగాల్లో వృద్ధి పరిస్థితులు బాగుండడం వంటి అంశాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని అన్నారు. కాగా స్వల్పకాలంలో రూపాయి భారీగా బలపడినా, 2017 చివరినాటికి 66.50–67.50 శ్రేణికి చేరుతుందన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ ఇకోవ్రాప్ అంచనావేసింది. అయితే ఫెడ్ రేటు పెంపునకు సంబంధించి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు అనుసరించే విధానాలపై ఇది ఆధారపడి ఉంటుందనీ పేర్కొంది. -
మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోంది!
♦ ఇప్పుడున్నంత పటిష్టంగా ఎన్నడూలేదు.. ♦ వృద్ధిరేటు మరింత దూసుకెళ్తుంది... ♦ ఇదంతా కేంద్రంలో పటిష్ట నాయకత్వం, ♦ కీలక సంస్కరణల ఫలితమే... ♦ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేనంత పటిష్టంగా ఉందని, రాబోయే కాలంలో వృద్ధి రేటు మరింతగా పరుగులు తీసే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. ప్రధానంగా కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ జోరుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. సోమవారమిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ‘రిస్క్ సమిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరేఖ్ మోదీ సర్కారు పనితీరుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే... మన ఎకానమీ ఇప్పుడున్నంత బలమైన స్థాయిలో ఇదివరకెన్నడూ లేదు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో భారీస్థాయి అవినీతి అనేది పూర్తిగా తొలగింది. 7.5 శాతం పైగా వార్షిక జీడీపీ వృద్ధిరేటు అంచనాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన ఎకానమీ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు అద్భుతమైన వృద్ధి సామర్థ్యం కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఎనానమీకి తోడ్పాటునందిస్తోంది’ అని పరేఖ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యయం ఆసరా... ప్రైవేటు రంగ కంపెనీల పెట్టుబడులు ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా మౌలికసదుపాయాల కల్పనపై చేస్తున్న పెట్టుబడులు పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘పోర్టులు, జల మార్గాలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీస్ ఇలా ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కార్యకలాపాలు చకచకా జరుగుతున్నాయి. అంతేకాదు పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్యాల పెంపు కూడా వేగవంతమైంది. సేవల మెరుగుదల కోసం రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ టెండర్లు, బిడ్డింగ్ ప్రక్రియల్లో ఈ-వేలాన్ని పూర్తిగా ప్రవేశపెట్టడం దేశంపై విశ్వసనీయత పెరిగేలా చేస్తోంది. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక రాబడులను ఆశించే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించడంపై దృష్టిసారించాలి.’ అని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లపట్ల అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. యూరోపియన్ బ్యాంకుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతుండటం... ఇతరత్రా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. పలు కీలక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకడం లేదా దానికి దరిదాపుల్లో కదలాడుతున్నాయి. వర్థమాన మార్కెట్లలో అధిక రాబడులకు ఆస్కారం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిసారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 3-4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోవడంతో రూపాయి విలువ తీవ్ర కుదుపులకు గురైంది. అయితే, ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లలో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలపట్ల సెంటిమెంట్ మెరుగుపడింది. గడిచిన వారంలో విదేశీ ఈక్విటీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించాయి. అంతేకాదు 20 బిలియన్ డాలర్లను బాండ్లలో పెట్టుబడి పెట్టారు. అయితే, రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి అంచనాల మేరకు వర్ధమాన దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. పెంపు దిశగా స్పష్టత వచ్చేకొద్దీ విదేశీ నిధులు మళ్లీ భారీగా వెనక్కివెళ్లేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ కరెన్సీ విలువలు, స్టాక్స్‌లో తీవ్ర హెచ్చు తుగ్గులు ఉండొచ్చు. -
10 శాతం వృద్ధి సాధ్యమే: దీపక్ పరేఖ్
ముంబై: దేశం 10 శాతం వృద్ధి రేటును సాధించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ఫండమెంటల్స్ ఇందుకు అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఐఎస్బీ కేపిటల్ మార్కెట్ల సదస్సులో పరేఖ్ మాట్లాడుతూ, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, చమురు ధరల పతనం, స్థిరమైన, మెజారిటీ ప్రభుత్వం ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూలమైనవని వివరించారు. అయితే వీటికితోడు న్యాయ, ఎన్నికలు, పోలీస్, కార్మిక, భూ సంస్కరణలతోపాటు ఫైనాన్షియల్ రంగంలోనూ సంస్కరణలు అవసరమని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు 6.5 నుంచి 7% వృద్ధి సాధనకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. -
ఆర్ధిక మంత్రి పదవి రేసులో లేను: దీపక్
న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి పదవి రేసులో తాను లేనని హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. తాను ఆర్ధిక మంత్రి పదవి చేపట్టనున్నట్టు వస్తున్న వార్తలన్ని రూమర్లేనని దీపక్ అన్నారు. అలాంటి వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే ప్రభుత్వమేమైనా సహాయం కోరితే తాను స్పందించడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా అడిగిన ప్రశ్నకు దీపక్ సమాధానమిచ్చారు. గత ఎనిమిది నెలల్లో ప్రస్తుత ఆర్ధిక మంత్రి చిదంబరం అందించిన సేవలు చిరస్మరణీయమని.. దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో రిజర్వు బ్యాంక్ చైర్మన్ రఘురామ్ రాజన్ నియామకం సాహసపూరితమైందన్నారు. మే 26న మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ లేదా సుబ్రమణ్యస్వామిలలో ఒకరికి ఆర్ధిక శాఖ కట్టబెట్టే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి.