సవాళ్లున్నాయ్... పరిష్కరించాలి..!
⇒ భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణలు
⇒ మొండిబకాయిల సమస్య తక్షణ పరిష్కారం ఆవశ్యకత: దీపక్ పరేఖ్
⇒ గణాంకాల్లో మరింత స్పష్టత కావాలన్న క్రిసిల్
⇒ ఇకపై భారత్ వృద్ధికి దేశీయ అంశాలే కారణమవుతాయంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమించడానికి ఇకపై దేశీయ అంశాలే కారణమవుతాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును 0.25–0.50 శాతం నుంచి 0.75– 1 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్తలు తాజా పరిస్థితులపై చేసిన విశ్లేషణల ఇదీ...
మొండి బాకాయిల సమస్య తీవ్రం: పరేఖ్
‘‘దేశంలో మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి పెట్టాలి. అయితే దీనికి ప్రభుత్వ బెయిలవుట్ తరహా చర్యలు పనికిరావు. ఇక్కడ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా కాకూడదన్నది నా అభిప్రాయం. మౌలిక రంగంపై రీఫైనాన్షింగ్, రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునే విధంగా రుణ పునర్‌వ్యవస్థీకరణ వంటి చొరవల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అలాగే బ్యాంకింగ్‌కు తగిన మూలధనం అందుబాటులో ఉంచే చర్యలను కేంద్రం తీసుకోవాలి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఎల్‌ఎస్‌ఈ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా ఫోరంలో ఆర్థిక సంస్కరణలపై జరిగిన సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ విలీనాలపై మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక సందర్భాలో ఇలాంటి చొరవలు అవసరమేనన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్‌బీఐలో ఐదు బ్యాంకుల విలీనం తగిన నిర్ణయమేనని ఆయన అన్నారు.
గణాంకాల మధ్య పొంతన ఉండడం లేదు: క్రిసిల్
భారత్‌లో పలు కీలక గణాంకాల మధ్య పొందన కుదరడం లేదని రేటింగ్, విశ్లేషణా సంస్థ– క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మాదికారి జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు, క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల గణాంకాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి చూస్తే... జీడీపీలో తయారీ రంగం వాటా గణాంకాలకు, నెలవారీగా విడుదలవుతున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీకీ (ఐఐపీ) మధ్య వ్యత్యాసం కనబడుతోందని చెప్పారు.
దేశీయ అంశాలే వృద్ధికి ఊతం: అరవింద్ సుబ్రమణ్యం
అమెరికా ఫెడ్ నిర్ణయాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ ముందే డిస్కౌంట్ చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 5–6 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ నిర్ణయాలపై ఈ ప్రభావం పడబోదనీ వారు విశ్లేషిస్తున్నారు. రేట్లు పెంపు ఇకపై ఉండబోదని క్రితం పాలసీ సందర్భంగానే ఆర్‌బీఐ సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఫెడ్ రేటు పెంపు అంశంపై మాట్లాడుతూ, భారత్‌పై ఈ ప్రభావం స్వల్పమేనని అన్నారు.
దేశీయంగా తీసుకునే నిర్ణయాలే మున్ముందు దేశాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. స్థిరత్వం, అన్ని విభాగాల్లో వృద్ధి పరిస్థితులు బాగుండడం వంటి అంశాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని అన్నారు. కాగా స్వల్పకాలంలో రూపాయి భారీగా బలపడినా, 2017 చివరినాటికి 66.50–67.50 శ్రేణికి చేరుతుందన్న అభిప్రాయాన్ని ఎస్‌బీఐ ఇకోవ్రాప్ అంచనావేసింది. అయితే ఫెడ్ రేటు పెంపునకు సంబంధించి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు అనుసరించే విధానాలపై ఇది ఆధారపడి ఉంటుందనీ పేర్కొంది.