మనమూ రక్షణాత్మక వైఖరి అమలు చేద్దాం
⇒ దేశీ సంస్థలను కాపాడుకునేందుకు ఇదే మార్గం
⇒ హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్
ముంబై: అమెరికా, బ్రిటన్ తదితర పెద్ద దేశాల తరహాలో భారత్ కూడా రక్షణాత్మక వైఖరి అమలు చేయాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. దేశీ సంస్థల ప్రయోజనాలు కాపాడేందుకు ఇదే తగిన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మనం కూడా రక్షణాత్మక ధోరణి పాటించాలి. అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాలు కూడా రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నప్పుడు మనం కూడా అలా చేయడంలో తప్పేముంది. మనది చాలా పెద్ద దేశం.. పెద్ద మార్కెట్. మనం సైతం మన పరిశ్రమలను కాపాడుకోవాలి కదా‘ అని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. చైనా నుంచి చౌక ఉక్కు దిగుమతులపై పరిమితులు విధించిన తర్వాత దేశీ ఉక్కు రంగం మళ్లీ కోలుకుంటుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.
‘చైనా నుంచి చౌకగా ఉత్పత్తులు వెల్లువెత్తుతుండటంతో మన ఉక్కు సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస దిగుమతి ధరలు విధిస్తే గానీ పరిస్థితి చక్కబడలేదు. ప్రభుత్వ జోక్యానికి ముందు 50 శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో పనిచేసిన మన సంస్థలు ప్రస్తుం 80 శాతం మేర పనిచేస్తున్నాయి. తీసుకున్న రుణాలనూ సక్రమంగా చెల్లించగలుగుతున్నాయి‘ అని పరేఖ్ వివరించారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రభుత్వం ప్రతీ ఉత్పత్తిపై యాంటీ–డంపింగ్ సుంకాలు విధించడం సాధ్యం కాదు కనుక.. దేశీ కంపెనీలను కాపాడటానికి రక్షణాత్మక వైఖరులు పాటించక తప్పదని ఆయన చెప్పారు.
’బీ ఇండియన్.. బై ఇండియన్ (భారతీయులుగా జీవిద్దాం.. భారతీయ ఉత్పత్తులే కొందాం)’ అంటూ పరేఖ్ పిలుపునిచ్చారు. మరోవైపు, భారత ఐటీ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలేమీ కొల్లగొట్టడం లేదని, పైపెచ్చు అక్కడ ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అమెరికాతో సహా 80 దేశాల్లోని 200 పైగా నగరాల్లో భారత ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో గతేడాది 20 బిలియన్ డాలర్ల పైగా పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చాయని, సుమారు 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయని ప్రసాద్ చెప్పారు.
ద్వితీయార్ధం నుంచి ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణ..
కీలకమైన వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి రానుండటం, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టమవుతుండటం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ప్రైవేట్ పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని పరేఖ్‌తో పాటు సదస్సులో పాల్గొన్న ఆది గోద్రెజ్ తదితర వ్యాపార దిగ్గజాలు చెప్పారు. మరోవైపు చైనాతో వాణిజ్య అసమతౌల్యత కూడా దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు తక్కువగా ఉండటానికి కారణమని పరేఖ్ చెప్పారు.
చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం 70 బిలియన్ డాలర్ల మేర ఉండగా.. అందులో 60 బిలియన్ డాలర్ల దిగుమతులే ఉంటున్నాయని, చైనాకు ఎగుమతులు 10 బిలియన్ డాలర్లే ఉంటున్నాయన్నారు. అటు గోద్రెజ్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్నాళ్లుగా ప్రైవేట్ వినియోగం మందగించడంతో కార్పొరేట్ల పెట్టుబడులూ తగ్గాయని వివరించారు. బ్లాక్‌మనీపై పోరును ప్రస్తావిస్తూ నల్లకుబేరులపై కొరడా ఝుళిపించడం దీనికి పరిష్కారం కాదని, ప్రత్యక్ష పన్నుల ను తగ్గించడం ద్వారా వ్యాపార సంస్థలను పన్నులు కట్టేలా ప్రోత్సహించడమే సరైన మార్గమని చెప్పారు. పన్నులు అధికంగా ఉండటమే ప్రజలు, కంపెనీలు తమ వాస్తవా దాయాలు తక్కువ చేసి చూపించడానికి కారణమన్నారు.