సనా: యెమెన్‌లోని తమ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులు, గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హౌతీ ప్రతినిధి యాహ్య సారె మాట్లాడుతూ ‘అమెరికా నౌక ‘స్టార్ నాసియా’పై తొలి బ్రిటీష్ నౌక ‘మార్నింగ్ టైడ్’పై దాడి చేశాం’ అని వెల్లడించారు.
బ్రిటన్ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆంబ్రే ధ్రృవీకరించింది. యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్ టైడ్ నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. అయితే నౌకలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.
బార్బడోస్ జెండాతో వస్తున్న ఈ నౌక బాబ్ ఎల్ మండెప్ జలసంధి దాటగానే స్పీడ్ పెంచినప్పటికీ హౌతీల దాడికి చిక్కిందని బ్రిటన్ తెలిపింది. నౌకపై యాంటీ షిప్ మిసైల్‌తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌక బ్రిటన్‌లోని ఫురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు. తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోందని కంపెనీ పేర్కొంది.
కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్ ఇటీవల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు తీవ్రం చేసిన విషయం తెలిసిందే. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సేనలు గత వారం బాంబులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లకు చెందిన పలు స్థావరాల్లో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment