వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్‌లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది.
జనవరి 28న జోర్డాన్‌లో ముగ్గురు అమెరికా సైనికులను దుండగులు హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత యెమెన్‌లో మళ్లీ ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి. "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్‌తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం" అని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది.
హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్‌లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. మొదట ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీలు.. ఇతర దేశాల నౌకలపై కూడా దాడులు ప్రారంభించాయి. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు అడ్డుకట్టవేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు
Comments
Please login to add a commentAdd a comment