సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్‌క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.
2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్ కూల్చేశారు. ‘మారిబ్ గవర్నరేట్ గగనతలంలో రీపర్ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.
ఎమ్‌క్యూ-9 రీపర్ డ్రోన్.. ఎన్నో ప్రత్యేకతలు..
అమెరికా నిఘా డ్రోన్ ఎమ్‌క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. పైలట్‌లు ఉండరు. సాధారణ డ్రోన్‌లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.
కాగా, ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్‌తో దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment