సనా: యెమెన్ రాజధాని సనాలోని తమ స్థావరాలపై అమెరికా,బ్రిటన్‌లు సంయుక్తంగా చేస్తున్న దాడులను హౌతీ మిలిటెంట్లు తేలిగ్గా కొట్టి పారేశారు. దాడుల ప్రభావం తమపై పెద్దగా లేదని, దాడుల్లో ఎవరూ గాయపడలేదని హౌతీ గ్రూపు సీనియర్ కమాండర్ మహ్మద్ అబ్దుల్ సలాం చెప్పాడు. అయితే దాడులకు మాత్రం తాము గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశాడు.
ఎర్ర సముద్రంలో నుంచి వెళ్లే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న అన్ని వాణిజ్య నౌకలపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు. బ్రిటన్‌తో కలిసి హౌతీలపై చేస్తున్న వైమానిక దాడులపై అమెరికా వివరాలు వెల్లడించింది. తాము ఇప్పటివరకు జరిపిన దాడుల కారణంగా హౌతీలు మళ్లీ డ్రోన్‌లు, మిసైళ్లతో ఇప్పట్లో నౌకలపై దాడి చేయకపోచ్చని తెలిపింది. యెమెన్‌లో హౌతీలు డ్రోన్‌లు, మిసైళ్లు నిల్వ ఉంచిన స్థావరం తమ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా వెల్లడించింది.
కాగా, హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ అలీ అల్ హౌతీ మాట్లాడుతూ యెమెన్‌పై అమెరికా దాడులను ఉగ్రవాదంతో పోల్చాడు. అమెరికా ఒక పెద్ద దయ్యమని మండిపడ్డాడు. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై శుక్రవారం ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ల వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment