
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.
అలాగే తప్పుడు సమాచారంపై కీలక హెచ్చరిక చేశారు. ‘వాట్సాప్ యూనివర్శిటీ’ విస్తరణ, మార్కెట్‌లలో డబ్బు సంపాదించడంపై వస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలని , HDFC AMC . HDFC లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించి, ఆ తరువాత కొన్ని చిట్కాలతో నేరుగా మార్కెట్‌లలో పెట్టుబడులతో భారీ లాభాలు పొందవచ్చని భావించి నష్టపోయిన పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. (నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్)
ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్‌లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment