
ఫీజు కట్టాలన్నా కనికరించలేదు..
కదిరి: ‘సార్.. మా వాడికి కాలేజీలో ఫీజు కట్టాలి. దయచేసి మా ఖాతాలో జమ అయిన జీవిత బీమా మొత్తాన్ని ఇవ్వండి’ అంటూ ఆ రైతు దంపతులు ఎంతగా వేడుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదు.
రైతు బీమా సొమ్ము ఫ్రీజ్ చేసిన ఆంధ్రా బ్యాంకు సిబ్బంది
కదిరి: ‘సార్.. మా వాడికి కాలేజీలో ఫీజు కట్టాలి. దయచేసి మా ఖాతాలో జమ అయిన జీవిత బీమా మొత్తాన్ని ఇవ్వండి’ అంటూ ఆ రైతు దంపతులు ఎంతగా వేడుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన కొండ్రే వెంకటరమణమ్మ, సూర్యచంద్రారెడ్డి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు చెల్లించేందుకు డబ్బు పంపాలని కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. జీవిత బీమా సంస్థలో సూర్యచంద్రారెడ్డి పేరున పొదుపు చేసిన మొత్తాన్ని కుమారుడికి పంపాలని వారు నిర్ణయించుకున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత జీవిత బీమా సంస్థ వారు కదిరి పట్టణంలోని ఆంధ్రా బ్యాంకులో ఉన్న సూర్యచంద్రారెడ్డి ఖాతాలో రూ. 9,535 జమ చేశారు. ఆ మొత్తాన్ని డ్రా చేసేందుకు సోమవారం దంపతులిద్దరూ బ్యాంకుకు వెళ్లారు. అయితే.. ‘మా బ్యాంకులో సూర్యచంద్రారెడ్డిపై పంట రుణం తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ. 70 వేలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రీమియం, వడ్డీ మొత్తం చెల్లించి రుణం రెగ్యులరైజేషన్ చేసుకొంటేనే బీమా డబ్బు ఇస్తాం’ అంటూ మేనేజర్ తెగేసి చెప్పారు. ‘కొడుక్కి ఫీజు కట్టాలి సార్.. అయినా రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు కదా’ అంటే, మాఫీ చేసినప్పుడు తీసుకెళ్దురులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో కొడుకు ఫీజు కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలని వారు విలపిస్తున్నారు.