
ఆ ఫైట్స్‌కు 35 కోట్ల బీమా
వెండితెరపై ప్రతినాయకుణ్ణి కథానాయకుడు రఫ్ఫాడిస్తుంటే, అది నటనే అయినా నిజమని ఫీలైపోయి అభిమానులు సంబరపడిపోతారు. అక్షయ్‌కుమార్ లాంటి హీరోలు మాత్రం ఎంత రిస్క్ అయినా సరే వెనక్కి తగ్గరు. స్వయంగా తామే ఫైట్స్ చేస్తారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అక్షయ్‌కుమార్ రిస్కులు తీసుకునే విషయంలో అప్పుడప్పుడు హద్దులు దాటేసి, జీవితాన్ని రిస్కులో పడేసుకుంటుంటారు. గాయాల బారిన పడితే కష్టమని ప్రమాద బీమా చేయించుకుంటారు. సాదాసీదా మనుషులైతే లక్షల్లో బీమా చేయించుకుంటారు. అక్షయ్ సూపర్ స్టార్ కాబట్టి ఏ కోటి రూపాయలకో తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ, ‘హాలీడే’ సినిమా కోసం ఆయన ఏకంగా 35 కోట్ల రూపాయలకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు.
హిందీ సినీ రంగంలో ఈ స్థాయిలో బీమా చేయించుకున్నది ఒక్క అక్షయ్‌కుమారేనట. విచిత్రం ఏమిటంటే, బాలీవుడ్‌లో భారీస్థాయి పారితోషికాలు తీసుకొనే షారుఖ్, ఆమిర్‌ఖాన్‌లు సైతం సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రత్యేకించి, బీమా చేయించుకోవడం లేదు. షూటింగ్ సమయంలో ఏదైనా గాయాలైతే, వైద్యఖర్చుల నిమిత్తం పనికొస్తుందని చిత్ర నిర్మాణ సంస్థలే యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ 5 నుంచి 10 లక్షల మేరకు బీమా చేస్తున్నాయి. ‘రౌడీ రాథోడ్’, ‘బేబీ’, ‘ఖిలాడీ 786’ లాంటి చిత్రాల్లో యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి, రిస్కీ ఫైట్స్‌తో ‘ఖిలాడీ కుమార్’ అని పేరు తెచ్చుకున్న అక్షయ్ గతంలోనూ గాయాల బారినపడ్డారు. అయితే, అక్షయ్ కుమార్ లాంటి కొందరిని పక్కన పెడితే, హిందీ సినీ రంగంలో ఇప్పటికీ చాలామంది స్టార్స్ బీమా అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రమే.