
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రధానంగా ప్రొటెక్షన్ ప్లాన్స్‌పై దృష్టి సారిస్తోంది. అలాగే, పూర్తి స్థాయి ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటోంది. టాటా ఏఐఏ చీఫ్ ఆఫ్ ప్రొప్రైటరీ చానల్స్ రిషి శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా సుమారు ఎనిమిది శాతం మందికి మాత్రమే బీమా కవరేజీ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.
వచ్చే పదేళ్లలో జీవిత బీమా విభాగంలో సేవింగ్స్ కూడా కలిపి ఉన్న పథకాలకన్నా.. ప్రొటెక్షన్ ప్లాన్స్‌కే మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మొత్తం పాలసీ జారీ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంపై తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం టాటా ఏఐఏ సుమారు ఆరు రకాల రైడర్స్‌తో 34 పైచిలుకు పథకాలు అందిస్తోందని తెలిపారు.
ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్ ఏర్పాటు..
ఏజెన్సీలు, బ్యాంకులు తదితర మార్గాల్లో తమ పథకాలను విక్రయిస్తున్నప్పటికీ.. సొంతంగా ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. కంపెనీ ద్వారా శిక్షణ పొందిన ఈ ఫుల్‌టైమ్ ప్రీమియర్ ఏజెంట్స్.. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని ఆయన చెప్పారు.
మిగతా ఏజెంట్లతో పోలిస్తే ప్రీమియర్ ఏజెంట్లలో అట్రిషన్ (ఉద్యోగుల వలస) చాలా తక్కువగా ఉండటం వల్ల సుదీర్ఘకాలం అటు పాలసీదారుకు ఇటు కంపెనీకీ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు ఈ తరహా ఏజెంట్స్ ఉండగా, మొత్తం ఏజెంట్స్ సంఖ్య 20,000 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 400 దాకా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment