వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించనున్న ప్రభుత్వం
స్వయం సహాయక సంఘాల మహిళలు మరణిస్తే వారి రుణాలు మాఫీ
మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్
స్కూల్, పోలీస్ యూనిఫామ్‌లు కుట్టే బాధ్యత మహిళా గ్రూపులకే
ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ
12న మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం
సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ
కేబినెట్ నిర్ణయాలు వెల్లడించనున్న సీఎం రేవంత్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు.
ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.
మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్
ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది.
61 లక్షల మంది మహిళలకు బీమా
18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి
చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment