జీవిత బీమా ‘క్లెయిమ్‌’ చేయాల్సి వస్తే..? | Life Insurance Claim Procedure | Sakshi
Sakshi News home page

జీవిత బీమా ‘క్లెయిమ్‌’ చేయాల్సి వస్తే..?

Published Mon, Nov 15 2021 12:38 AM | Last Updated on Mon, Nov 15 2021 11:08 AM

Life Insurance Claim Procedure - Sakshi

మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు.

దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్‌ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ కథనమే ఇది.

క్లెయిమ్‌ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్‌ లేదా ఫోన్‌ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్‌లైన్‌లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి.

ఎస్‌బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, ఎక్సైడ్‌ లైఫ్‌ క్లెయిమ్‌ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపడుతున్నాయి. ఆన్‌లైన్‌లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్‌ లేదా వాట్సాప్‌ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు.

ఏజెంట్‌ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్‌బీఐ లైఫ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్‌ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్‌ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డెత్‌ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్‌ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్‌ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది.

అలాగే, ఒరిజినల్‌ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్‌ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్‌ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్‌ చేశాయి. ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్‌ యాప్, చాట్‌బాట్స్, వెబ్‌ పోర్టల్‌ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు.

30 రోజుల ప్రక్రియ
బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి.

గతంతో పోలిస్తే క్లెయిమ్‌ ప్రక్రియ డిజిటలైజ్‌ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్‌ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్‌ లైఫ్‌ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి.

డాక్యుమెంట్ల పరంగా..
కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్‌ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్‌ కోసం డెత్‌ సర్టిఫికేట్‌ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు.  అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు.

అందుకనే ఎల్‌ఐసీ డెత్‌ సర్టిఫికెట్‌ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్‌ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్‌ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్‌ఐసీ క్లాస్‌–1 అధికారి లేదా డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సంతకంతోపాటు.. క్రిమేషన్‌ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు ఎల్‌ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్‌బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్‌ డెత్‌ సర్టిఫికెట్‌ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్‌ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి.

ఇతర క్లెయిమ్‌లు
జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్‌ పాలసీల (యాన్యుటీ ప్లాన్‌లు) విషయంలో పాలసీదారు లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్‌ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్‌ సర్టిఫికెట్‌ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్‌ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్‌బీఐ లైఫ్, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement