రాష్ట్ర రైతుల తరహాలోనే.. ఆయా దేశాల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం..
ప్రజాభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ.. టోల్ ఫ్రీ నంబర్
ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ
కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని వ్యాఖ్య
జీవన్‌రెడ్డి కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.
పలు రాష్ట్రాల గల్ఫ్ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్‌లో సవరణలు, సూచనల కోసం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జీవన్‌రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా..
‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్‌రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు.
సాయం చేసేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదు: జీవన్‌రెడ్డి
గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని విమర్శించారు.
గల్ఫ్ గోస లేకుండా చూడండి
సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్‌ను పటిష్టం చేయాలని, గల్ఫ్ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు.
గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ అంతర్జాతీయ కన్వీనర్ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment