అంగన్‌వాడీలకు జీవిత బీమా | Life Fnsurance For Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు జీవిత బీమా

Published Thu, Aug 30 2018 2:31 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Life Fnsurance For Anganwadi - Sakshi

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు  

బాన్సువాడ టౌన్‌ నిజామబాద్‌ : కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు భరోసా కల్పించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచింది. కాగా ఇప్పుడు వారి ఇబ్బందులు, కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు పూనుకుంది. విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు, సహజ మరణం పొందినవారికి ఈ సౌకర్యం వర్తించే విధంగా రూపకల్పన చేసింది. ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం–భారతీయ జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా భరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వం అందించే బీమా సొమ్ము బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలవనున్నది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంగన్‌వాడీ ఉచిత బీమా పథకంతో జిల్లాలో 1038 మంది టీచర్లు, 155 మినీ టీచర్లు, 1083 మంది ఆయాలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిపి 2231 మంది ఉన్నారు. 35 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అయితే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు అనుబంధ సంఘాల సహకారంతో ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీచర్‌కు రూ.10,500, ఆయాలకు రూ.6 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల కష్టాల గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు నిర్ణయించి బీమా సౌకర్యంతో అండగా నిలిచింది. మృతిచెందిన అంగన్‌వాడీ కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించేందుకు నిర్ణయం తీసుకుంది.  

ప్రీమియం చెల్లించే బాధ్యత కూడా.. 

జిల్లాలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల బీమా ప్రీమియంను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పీఎంజీవై రూ.330, పీఎంఎస్‌జీవైరూ.12 ఎల్‌ఐసీ రూ.80 చొప్పున స్కీం కింద ప్రీమియం చెల్లించా ల్సి ఉంది. అయితే కేంద్ర మహిళ శిశు సంక్షమ శాఖ రూ.332, ఎల్‌ఐసీ రూ.100 చొప్పున సంయుక్తంగా భరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2017, జూన్‌ ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీచర్లు, ఆయాలకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కింద రూ.లక్షలాదిగా చెల్లిస్తుంది. 50 నుంచి 59 ఏళ్లలోపు టీచర్లు, ఆయాలకు జీవిత బీమా సౌకర్యం రాక ప్రత్యేకంగా అంగన్‌వాడీ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.  

సంతోషంగా ఉంది.. 

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, ఆయాలకు మూడు బీమా పథకాలు కల్పించడం సంతోషంగా ఉంది. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.  అయితేనే తమకు ఒక గుర్తింపు వస్తుంది. లేదంటే తాము ఎన్నేళ్లు కష్టపడినా ఫలితం ఉండదు.      –గౌరమ్మ, టీచర్, నస్రూల్లాబాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement