హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ .. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో 9 శాఖలు ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2,000 మంది పైచిలుకు అడ్వైజర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 1,400 మంది చేరారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్ శాఖల సంఖ్య 22కి చేరగా, అడ్వైజర్ల సంఖ్య 4,400 పైచిలుకు పెరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో నవీన్ తహ్లియానీ మీడియా సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు సుమారు 314 శాఖలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 10 ఉన్నాయని చెప్పారు.
ఏజెన్సీల ద్వారా వచ్చే కొత్త ప్రీమియం వసూళ్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 8%గా నమోదైందని, అన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన కొత్త ప్రీమియం వ్యాపారంలో ఇది 5.5%గా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ.54,000 కోట్లుగా ఉంటాయన్నారు.
30–40 శాతం వృద్ధి అంచనా..
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం సుమారు 30% పెరిగి రూ. 11,105 కోట్లకు చేరిందని నవీన్ చెప్పారు. తమ కంపెనీపరంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 30–40% వృద్ధి అంచనా వేస్తున్నామని, పరిశ్రమ సగటు 20% స్థాయిలో ఉండవచ్చన్నారు. సుమారు రూ. 488 కోట్లు సమీకరించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఈ నిధులను సమీకరించనున్నామని నవీన్ పేర్కొన్నారు.
కోవిడ్ క్లెయిమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు కూడా రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా చూసేందుకు వాటితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment