ఠారెత్తిస్తున్న ఎండలు ∙శివారులో 45.7.. సిటీలో 44.2
తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్‌లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్‌లో 47.6, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది.
మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు.
ఆల్కహాల్‌తోనూ డీ హైడ్రేషన్..
సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్‌కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం.
వడదెబ్బ లక్షణాలివీ..
వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్‌తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment