![SBI Q1 standalone net profit declines 7 per cent to Rs 6,068 - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/8/SBI.jpg.webp?itok=kYI_sUSq)
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే.
మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్‌గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment